E-waste
-
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు. -
ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్.. సవాల్‌గా నిర్వహణ
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్‌తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు.. ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు.. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. 2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నాయి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
భాగ్యనగరానికి ఈ-వేస్ట్ బెడద
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ–వేస్ట్) అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ–వేస్ట్ సేకరణ మొదలుకొని దానిని భాగాలుగా విడదీయడం, రీ సైక్లింగ్ చేయడంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించక పోవడంతో పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. మరోవైపు ఈ–వేస్ట్‌లో ఉండే విలువైన లోహాలు చెత్త రూపంలో భూమి పొరల్లోకి చేరుతుండటంతో ఆర్థికంగా కూడా నష్టం జరుగుతోంది. కొంత మొత్తంలో ఈ–వేస్ట్‌ను సేకరించినా అనియంత్రిత రంగంలో రీసైక్లింగ్ కావడం కూడా అనేక సమస్యలకు దారితీస్తోంది. నిత్య జీవితంలో సాంకేతికత ప్రాధాన్యంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా భారీగా పెరిగింది. సీపీయూతో పాటు ఇన్ పుట్, ఔట్పుట్ డివైజ్లతో కూడిన పీసీలు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ప్రింటర్లు, కాట్రిడ్జ్‌లు, టెలివిజన్లు ఎల్ఈడీ, ఎల్సీడీ, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం నిత్య జీవనంలో పెనవేసుకుపోయింది. నిరుపయోగంగా మారిన ఈ ఉపకరణాలు, పరికరాలు తదితర ఈ–వేస్ట్‌ను ఎలా వదిలించుకోవాలో తెలియక పోవడం అనేక సమస్యలకు దారితీస్తోంది. వీటి డిస్మాంట్లింగ్, రీ సైక్లింగ్‌లను గుర్తింపు పొందిన సంస్థలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తాయి. అయితే ఈ–వేస్ట్‌లో ఎక్కువ భాగం అనియంత్రిత రంగంలో ఉన్న వారి చేతుల్లోకి పోతోంది. ఈ–వేస్ట్ లాభాలను కురిపించే రంగం కావడంతో శాస్త్రీయ రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్పై అవగాహన లేని స్క్రాప్ డీలర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వీరు ఈ–వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టి అందులోని విలువైన లోహాలను సంగ్రహిస్తున్నారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల్లో బంగారం, పల్లాడియం, రాగి, వెండి, అల్యూమినియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటితో పాటు మెర్క్యురీ, లెడ్, కాడ్మియం, బేరియం, లిథియం వంటి హానికారక భారలోహాలు, ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయకపోవడంతో అవి భూమి పొరల్లోకే కాదు గాలి, నీటిలోకీ చేరుతున్నాయి. వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలోకి చేరి మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. ‘ఈ–వేస్ట్ పాలసీ’తో కొంత మెరుగు ఈ–వేస్ట్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ’ని రూపొందించింది. పాలసీ పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఈ– వేస్ట్ పాలసీకి అనుగుణంగా ప్రొడ్యూసర్లు పలు రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9 రీ సైక్లింగ్ యూనిట్లు, 14 డిస్మాంట్లింగ్ యూనిట్లు, 35 మంది ఈ వేస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీటికి అవసరమైన ముడి సరుకు (ఈ–వేస్ట్) పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో అనేక రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ రికవరీలో పేరొందిన ‘అటెరో ఇండియా’ తెలంగాణలో కొత్త యూనిట్ ఏర్పాటుకు గత ఏడాది అక్టోబర్‌లో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఈ యూనిట్‌తో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ∙కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్
శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై (ఈ–వేస్ట్ (వ్యర్థ్ధాలు) పలు దేశాలు చట్టాలు చేసినా వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ–వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలోనూ కలుస్తూ ప్రాణకోణిపై ప్రభావం చూపెడుతున్నాయి. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటిని నుంచి విష వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా.. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కానీ, వినియోగదారులు కానీ, చివరకు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్ల ఏటేటా ఈ–వ్యర్థ్ధాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకుపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలున్నాయి. అయితే అందులో కొంతమేరకు రీసైక్లింగ్ జరిగాయి. ఏతావాతా గడచిన సెప్టెంబర్ చివరి నాటికి నికరంగా 34.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలు భూమిపై ఉన్నాయి. ఒక్క ఏడాదిలో 5.7 కోట్ల టన్నుల వ్యర్థ్ధాలు ఒక్క 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ–వ్యర్థ్ధాల ముప్పును గుర్తించిన తరువాత.. 2014 నుంచి ప్రతియేటా ఏ మేరకు ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశంపై వివిధ సంస్థలు సీరియస్‌గా దృష్టి సారించాయి. 2014 ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థ్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకున్నా అంచనాలు మాత్రం వేయగలిగారు. రీసైక్లింగ్‌లో నిర్లక్ష్యం తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం వైపు పరుగులు పెడుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించిన వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తేచాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు. మరింత సౌకర్యవంతమైన వాటి వెంట పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాతవాటిని సక్రమంగా డిస్పోజ్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ–వ్యర్థ్ధాల్లో 17.4% మాత్రమే రీ సైకిల్ అవుతున్నట్లు సమాచారం. 78 దేశాల్లో చట్టాలున్నా.. ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ–వ్యర్థ్ధాలపై చట్టాలు, నియంత్రణ, విధానాలు తీసుకునివచ్చాయి. కానీ వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంది. విచిత్రంగా అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ–వ్యర్థ్ధాలు రీసైక్లింగ్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. టాప్ త్రీలో చైనా, అమెరికా, భారత్ ఈ–వ్యర్థ్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నులు, యూరోప్‌లో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరోప్‌లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది. ఆఫ్రికా దేశస్తుల తలసరి ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అతితక్కువగా ఉంది. ఈ–వ్యర్థాల్లో ఏది ఎంత? ఈ వ్యర్థాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, టోస్టర్స్, ఏవర్స్, హెయిర్ డ్రయ్యర్స్ (17.4 ఎంటీ), వాషింగ్ మెషీన్స్, టంబుల్ డ్రయ్యర్స్, స్టవ్స్, డిష్‌వాషర్స్, కుక్కర్స్ (13.4 ఎంటీ), రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, హీట్‌పంప్స్ (10.8ఎంటీ), స్క్రీన్స్,మానిటర్స్, టెలివిజన్స్, నోట్‌బుక్స్, టాబ్లెట్స్ (6.7ఎంటీ), ఐటీ, టెలీఎక్విప్‌మెంట్, సెల్‌ఫోన్స్, వైర్లెస్ రూటర్స్, జీపీఎస్, కాలుక్యులేటర్స్ (4.7ఎంటీ), బల్బులు, ఎల్ఈడీ (0.9ఎంటీ)లు ఉన్నాయి. ప్రజలు ఏంచేయాలి.. ►ప్రతి వ్యక్తీ తన స్థాయిలో ఈ–వ్యర్థ్ధాలను అరికట్టేందుకు సిద్ధం కావాలి. సరిగా డిస్పోజ్ చేయాలి. పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. ►వస్తువు కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి. దాని వినియోగం ఎలా..?దాని కాలపరిమితి తీరిన తరువాత ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసుకోవాలి. ►పాత టెక్నాలజీతో కూడిన వాటిని తొందరపడి పారేయకూడదు. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం కంటే వాటి మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. విలువైన ముడి పదార్థాలు వ్యర్థంగా.. ఈ–వ్యర్థ్ధాలను రీసైక్లింగ్ చేయకుండా భూమిపై వదిలేయడంతో.. వాటిలో విలువైన ముడి పదార్థాలు ఎందుకు కొరగాకుండా పోతోంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఈ–వ్యర్థ్ధాలు 5.3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే.. అందులో వినియోగించిన విలువైన బంగారం, వెండి, రాగి, ఇనుము తదితర లోహాల విలువ దాదాపు 57 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. పది లక్షల సెల్ఫోన్లలోని సర్క్యూట్లను రీసైకిల్ చేయడం ద్వారా సుమారు 34 కిలోల బంగారం, 336 కిలోల వెండి, 17వేల కిలోల కాపర్, 17 కిలోల పల్లాడియం మెటల్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ రీసైకిల్ కాకపోవడంతో సాధారణ వ్యర్థ్ధాలతో కలిసి భూమిలోనే ఇమిడిపోతున్నాయి. ఇవి కాకుండా హానికారక సీసం, జింక్, నికెల్, క్రోమియం, బేరియం లాంటివి భూమిలో కలవడంతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రెండేళ్లకే గాడ్జెట్స్ మార్చేస్తున్నారు.... ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఆధునిక సాంకేతికతల్లో వేగంగా వస్తున్న మార్పులతో ఒకటి, రెండేళ్లకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మార్చేస్తున్నారు. కంప్యూటర్లు, టీవీలు, సెల్ఫోన్లు, చార్జర్లు, ఇతర ఆక్సెసరీల వాడకం పెరిగింది. అదే సమయంలో మన దగ్గర ఈ–వేస్ట్ రీసైకిల్ చేస్తున్న ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. జనరల్ వేస్ట్‌తో కలిపి ఈ–వేస్ట్‌ను పడేస్తుండడంతో ప ర్యావరణం కలుషితమౌతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. – పి.రఘువీర్, విశ్రాంత ఐఎఫ్ఎస్, మాజీ పీసీసీఎఫ్ టేక్ బ్యాక్ పాలసీ ముఖ్యం.. ఈ–వేస్ట్‌ను సరైన పద్ధతుల్లో పడేయడం లేదా రీసైకిల్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. నగరాలు, ముఖ్య పట్టణాల్లో కాలంచెల్లిన, పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలను వినియోగదారుల నుంచి వెనక్కు తీసుకునే ఏర్పా టు జరగలేదు. అందువల్ల వీటి టేక్ బ్యాక్ పాలసీ (వెనక్కి తీసుకునే విధానం) ముఖ్యం. మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిలో సూక్ష్మ స్థాయిలో గోల్డ్, కాపర్ వంటివి ఉంటాయి. వీటి కోసం వస్తువలు కాల్చేయడం వల్ల కేన్సర్ కారక విష వాయువులు విడుదలవుతున్నాయి. – మురళీకృష్ణ, ఈ–వేస్ట్ నిర్వహణ నిపుణులు -
‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా రామ్కీ ఎన్విరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా దీన్ని రీబ్రాండ్ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్‌కు సంబంధించి తమ తొలి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈఎల్వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ .. రీసైక్లింగ్ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్ ప్రక్రియలో మదర్‌బోర్డులను ప్రాసెస్ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు .. రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేస్తోంది. -
ఇ-వ్యర్థాలతో ఒలింపిక్ మెడల్స్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా 2020లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో గెలుపొందినవారికి ఈసారి ప్రత్యేక పతకాలను ఇవ్వనున్నారు. అంటే... స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇవ్వరా? అని అడక్కండి. ఎందుకంటే.. ఎప్పటిలాగే బంగారు, వెండి, కాంస్య పతకాలే ఇస్తారు. అయితే పతకాల తయారీకి ఈ లోహాలను సేకరించడం మాత్రం గతంలోకంటే భిన్నం. ఇ-వ్యర్థాల నుంచి సేకరణ సాధారణంగా మనం ఉపయోగించే ప్రతి ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలుంటాయ నే విషయం తెలిసిందే. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మదర్ బోర్డుల్లో పూతగా ఈ లోహాలను వినియోగిస్తారు. ఈ గ్యాడ్జెట్ల వినియోగం బాగా పెరగడంతో.. పాడైపోయిన వాటిని రిపేర్ చేయించుకొనే పరిస్థితి లేదు. పక్కన పడేసి కొత్తవి కొంటున్నారు. దీంతో ఏటా లక్షల టన్నుల్లో ఇ–వేస్ట్ పోగవుతోంది. గుట్టల్లా పేరుకుపోతున్న ఇ–వ్యర్థాలు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. దీంతో ఇ–వ్యర్థాల వల్ల తలెత్తే విపత్తుపై అవగాహన కల్పించడానికి టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కమిటీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పతకాల తయారీకి అవసరమైన లోహాలను ఇ-వ్యర్థాలను రీసైకిల్ చేసి సేకరించాలని నిర్ణయించారు. జపాన్‌లోని స్థానిక కంపెనీల నుంచి ఇ-వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహాకులు తెలిపారు. మార్చి నెలాఖరునాటికి పతకాల తయారీకి అవసరమైనస్థాయిలో ఇ–వ్యర్థాలను సేకరిస్తామని, ఆ తర్వాత వాటి నుంచి బంగారం, వెండి, ఇతర లోహాలను వేరుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. -
విలువైన వస్తువులుగా పాడైపోయిన ఫోన్లు
న్యూఢిల్లీ : రోజురోజుకి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. దాంతో పాటు ఈ-వ్యర్థాలు కూడా గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ-వేస్ట్ వల్ల వచ్చే ముప్పు కూడా అత్యధికమే. ఈ ముప్పు భారీ నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి, పాడైపోయిన స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లాంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విలువైన వస్తువులుగా మార్చి మళ్లీ వాడుకునేలా చేయడానికి పూర్వ ఐఐటీ విద్యార్థి, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఓ ఇండియన్ సైటిస్ట్ ప్రపంచంలోనే తొలి మైక్రో ఫ్యాక్టరీ రూపకల్పనకు సాయం అందించారు. ఈ ఫ్యాక్టరీ లాంచింగ్‌లో ఆయనదే కీలక పాత్ర. ప్రొఫెసర్ వీణ సహజ్వాలా.... యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో మెటీరియల్ సైంటిస్ట్, సిడ్నీ వర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ(ఎస్‌ఎంఏఆర్‌టీ)లో డైరెక్టర్. ఆయన ఒకప్పుడు అంటే 1986లో ఐఐటీ కాన్పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. వీణ సహజ్వాలా ప్రస్తుతం మైక్రో ఫ్యాక్టరీల లాంచింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ఈ-వేస్ట్ మైక్రో ఫ్యాక్టరీ అనేదే ప్రపంచంలో మొదటిదని, యూఎస్ఎస్డబ్ల్యూలో దీన్ని టెస్ట్ చేసినట్టు వీణ చెప్పారు. ఇలాంటి మైక్రో ఫ్యాక్టరీలు గ్లాస్, ప్లాస్టిక్, టింబర్ లాంటి కన్జ్యూమర్ వేస్ట్‌ను కమర్షియల్ మెటీరియల్స్గా, ప్రొడక్ట్‌లుగా మార్చనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్లో సుదీర్ఘంగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలు పర్యావరణానికి ముప్పు కలిగించే పెద్ద మొత్తంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్మూలించనున్నట్టు తెలిపారు. ఇటీవలే ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్ ల్యాబోరేటరీస్‌లో ఈ మైక్రో ఫ్యాక్టరీని లాంచ్ చేశారు. మైక్రో ఫ్యాక్టరీలు సమీపంలో ఉన్న ఈ-వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల మాదిరిగా రూపాంతరం చేయనున్నారు. అంతేకాక ఇవి కన్జ్యూమర్ డిమాండ్‌కు తగ్గట్టు ఉండనున్నాయి. కంప్యూటర్ సర్క్యూట్ బోర్డులను విలువైన మెటల్ అలోయ్స్గా, ఈ-డివైజ్‌ల గ్లాస్, ప్లాస్టిక్‌ను ఇండస్ట్రియల్ గ్రేడ్ సెరామిక్స్‌లో వాడే మైక్రో మెటీరియల్స్గా మార్చనున్నారు. 50 చదరపు మీటర్లలో ఈ మైక్రో ఫ్యాక్టరీలు ఆపరేట్ చేయవచ్చు. ఎక్కడ స్టాక్ ఎక్కువగా ఉంటే అక్కడ వాటిని ఏర్పాటు చేయొచ్చు. ద్వీపకల్ప మార్కెట్లకు, మారమూల, స్థానిక ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. వీణ సహజ్వాలా 2005లో ఆయన గ్రీన్ స్టీల్‌ను కనుగొన్నారు. దీంతో రీసైకిల్ ప్లాస్టిక్స్‌ను, రబ్బర్ టైర్లను స్టీల్ మేకింగ్‌లో వాడుతున్నారు. -
ఈ–వేస్ట్ వినియోగానికి ఎకో పార్కు
పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు కేంద్రం పరిశీలిస్తోంది: పర్యావరణ శాఖ న్యూఢిల్లీ: ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా ఉపయెగించుకు నేందుకు వీలుగా పునరుత్పత్తి చేసేందుకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో పార్కును ఏర్పాటు సాధ్యా సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలంటే పర్యావరణ అనుకూల (ఎకో)పార్కును ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, శిక్షణ పరికరాలు సమ కూర్చాల్సి ఉంటుందని క్రేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపినట్లు పర్యావరణ శాఖ చెప్పింది. ఎకోపార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఈ–వేస్ట్‌ను పర్యావరణహితంగా తయారు చేయొచ్చని పేర్కొంది. ప్రమాదకరమైన వస్తువుల నిర్వహణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఓ స్కీం ఉందని, అందులో ఈ–వేస్ట్‌ను పునరుత్పత్తి చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తాయని తెలిపింది. -
ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్
టెలికం పరికరాల నుంచే అధిక ఈ-వేస్ట్ న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 1.03 బిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని, ఏడాదికి 25 శాతం ఈ-వ్యర్ధాల పరిమాణం పెరుగుతోందని సర్వే పేర్కొంది. దేశంలో 95 శాతం ఈ-వేస్ట్ అసంఘటిత రంగం నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావ రణ, వాతావరణ శాఖ ప్రత్యేకంగా ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను రూపోందించింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఈ- వ్యర్ధాల సేకరణ జరుగుతోందని అధ్యయనం పేర్కొంది.