
దేశవ్యాప్తంగా 2024లో 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్స్ వ్యర్థాల ఉత్పత్తి
ఏటా 6 బిలియన్ డాలర్ల ఈ–వేస్ట్ వ్యాపారానికి అవకాశం
ఈ–వేస్ట్‌లో లోహాలను వెలికితీసి విక్రయిస్తే కాసుల వర్షం
ప్రస్తుతం ఈ–వ్యర్థాల్లో 40 శాతమే రీ–సైక్లింగ్
‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: కంప్యూటర్ పాడైపోతే.. సెల్‌ఫోన్ పూర్తిగా పనిచేయకపోతే.. టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, మిక్సీలు, ఏసీలు వంటివి రిపేర్ చేయడానికి వీలులేనంతగా చెడిపోతే... అవన్నీ ఏమవుతాయి? మన వీధిలోకి వచ్చే పాత సామాన్లు కొనే వ్యక్తికి నామమాత్రపు ధరకే ఇచ్చేస్తాం. లేదా బయట చెత్త కుప్పలో పడేస్తుంటాం. బయట పడేసినవాటిని కూడా కొంతమంది సేకరించి స్క్రాప్(వ్యర్థ సామగ్రి) వ్యాపారికి విక్రయిస్తుంటారు. చూడటానికి ఇదంతా చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది.
కానీ, దేశవ్యాప్తంగా వచ్చే ఈ–వ్యర్థాలతో ఏటా 6 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసేందుకు అవకాశం ఉందని రెడ్‌సీర్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేయడంతోపాటు ఏటా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలు భూమిని, వాతావరణాన్ని దెబ్బతీయకుండా అడ్డుకోవచ్చని తెలిపింది.
సోలార్ మాడ్యూల్స్‌లో విలువైన ఖనిజాలు దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. 2022–23లో సుమారు 100 కిలో టన్నుల సౌర విద్యుత్ వ్యర్థాల ఉత్పత్తి జరిగింది. 2030 నాటికి అది 600 కిలో టన్నులకు చేరుతుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ నివేదిక వెల్లడించింది.
సర్వేలోని ముఖ్యాంశాలు
ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ–వేస్ట్ ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాల కారణంగా 2014లో 2 మిలియన్ మెట్రిక్ టన్నులు(ఎంఎంటీ) ఉన్న ఈ–వ్యర్థాల ఉత్పత్తి... 2024 నాటికి 3.8 ఎంఎంటీలకు చేరింది.
ఈ–వ్యర్థాల్లో విలువైన లోహాలు ఉంటాయి. వాటిలో ప్రస్తుతం 40శాతం మాత్రమే వెలికి తీసి తిరిగి వినియోగిస్తున్నారు. మిగతా 60 శాతంపై దృష్టి సారించగలిగితే కాసుల వర్షం కురిపించే భారీ వ్యాపారంగా మారుతుంది.
అధికారిక రీసైక్లింగ్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం వల్ల మన దేశం మెటల్ దిగుమతులను 1.7 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు.
సౌర విద్యుత్ వ్యర్థాల్లో దాదాపు 67శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.
సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు సవాలుగా మారనున్నాయి. ఫొటో వాల్టాయిస్ మాడ్యూల్స్‌లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మి యం వంటి ఖనిజాలు ఉంటాయి.
2030 నాటికి మన దేశంలో ఇప్పుడు ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే సుమారు 340 కిలో టన్నుల వ్యర్థాలు రావొచ్చని అంచనా. 340 కిలో టన్నుల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్‌ను తిరిగి పొందవచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment