ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ–వేస్ట్) అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ–వేస్ట్ సేకరణ మొదలుకొని దానిని భాగాలుగా విడదీయడం, రీ సైక్లింగ్ చేయడంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించక పోవడంతో పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. మరోవైపు ఈ–వేస్ట్‌లో ఉండే విలువైన లోహాలు చెత్త రూపంలో భూమి పొరల్లోకి చేరుతుండటంతో ఆర్థికంగా కూడా నష్టం జరుగుతోంది. కొంత మొత్తంలో ఈ–వేస్ట్‌ను సేకరించినా అనియంత్రిత రంగంలో రీసైక్లింగ్ కావడం కూడా అనేక సమస్యలకు దారితీస్తోంది.
నిత్య జీవితంలో సాంకేతికత ప్రాధాన్యంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా భారీగా పెరిగింది. సీపీయూతో పాటు ఇన్ పుట్, ఔట్‌పుట్ డివైజ్‌లతో కూడిన పీసీలు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ప్రింటర్లు, కాట్రిడ్జ్‌లు, టెలివిజన్‌లు ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం నిత్య జీవనంలో పెనవేసుకుపోయింది.
నిరుపయోగంగా మారిన ఈ ఉపకరణాలు, పరికరాలు తదితర ఈ–వేస్ట్‌ను ఎలా వదిలించుకోవాలో తెలియక పోవడం అనేక సమస్యలకు దారితీస్తోంది. వీటి డిస్మాంట్లింగ్, రీ సైక్లింగ్‌లను గుర్తింపు పొందిన సంస్థలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తాయి. అయితే ఈ–వేస్ట్‌లో ఎక్కువ భాగం అనియంత్రిత రంగంలో ఉన్న వారి చేతుల్లోకి పోతోంది. ఈ–వేస్ట్ లాభాలను కురిపించే రంగం కావడంతో శాస్త్రీయ రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్‌పై అవగాహన లేని స్క్రాప్ డీలర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వీరు ఈ–వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టి అందులోని విలువైన లోహాలను సంగ్రహిస్తున్నారు.
ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల్లో బంగారం, పల్లాడియం, రాగి, వెండి, అల్యూమినియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటితో పాటు మెర్క్యురీ, లెడ్, కాడ్మియం, బేరియం, లిథియం వంటి హానికారక భారలోహాలు, ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయకపోవడంతో అవి భూమి పొరల్లోకే కాదు గాలి, నీటిలోకీ చేరుతున్నాయి. వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలోకి చేరి మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి.
‘ఈ–వేస్ట్ పాలసీ’తో కొంత మెరుగు
ఈ–వేస్ట్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో ‘ఈ–వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని రూపొందించింది. పాలసీ పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఈ– వేస్ట్ పాలసీకి అనుగుణంగా ప్రొడ్యూసర్లు పలు రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9 రీ సైక్లింగ్ యూనిట్లు, 14 డిస్మాంట్లింగ్ యూనిట్లు, 35 మంది ఈ వేస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీటికి అవసరమైన ముడి సరుకు (ఈ–వేస్ట్) పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో అనేక రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు కేంద్రీకృతమై ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ వేస్ట్ రికవరీలో పేరొందిన ‘అటెరో ఇండియా’ తెలంగాణలో కొత్త యూనిట్ ఏర్పాటుకు గత ఏడాది అక్టోబర్‌లో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఈ యూనిట్‌తో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది.
∙కల్వల మల్లికార్జున్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment