టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా 2020లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో గెలుపొందినవారికి ఈసారి ప్రత్యేక పతకాలను ఇవ్వనున్నారు. అంటే... స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇవ్వరా? అని అడక్కండి. ఎందుకంటే.. ఎప్పటిలాగే బంగారు, వెండి, కాంస్య పతకాలే ఇస్తారు. అయితే పతకాల తయారీకి ఈ లోహాలను సేకరించడం మాత్రం గతంలోకంటే భిన్నం.
ఇ-వ్యర్థాల నుంచి సేకరణ
సాధారణంగా మనం ఉపయోగించే ప్రతి ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలుంటాయ నే విషయం తెలిసిందే. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మదర్ బోర్డుల్లో పూతగా ఈ లోహాలను వినియోగిస్తారు. ఈ గ్యాడ్జెట్ల వినియోగం బాగా పెరగడంతో.. పాడైపోయిన వాటిని రిపేర్ చేయించుకొనే పరిస్థితి లేదు. పక్కన పడేసి కొత్తవి కొంటున్నారు. దీంతో ఏటా లక్షల టన్నుల్లో ఇ–వేస్ట్ పోగవుతోంది. గుట్టల్లా పేరుకుపోతున్న ఇ–వ్యర్థాలు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి.
దీంతో ఇ–వ్యర్థాల వల్ల తలెత్తే విపత్తుపై అవగాహన కల్పించడానికి టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కమిటీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పతకాల తయారీకి అవసరమైన లోహాలను ఇ-వ్యర్థాలను రీసైకిల్ చేసి సేకరించాలని నిర్ణయించారు. జపాన్‌లోని స్థానిక కంపెనీల నుంచి ఇ-వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహాకులు తెలిపారు. మార్చి నెలాఖరునాటికి పతకాల తయారీకి అవసరమైనస్థాయిలో ఇ–వ్యర్థాలను సేకరిస్తామని, ఆ తర్వాత వాటి నుంచి బంగారం, వెండి, ఇతర లోహాలను వేరుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment