కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటరుగా నమోదవం.. ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి పాలకులు.. ప్రభుత్వాలు సాధ్యం. తద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న పండగలా నిర్వహిస్తోంది.
శనివారం 4వ విడత కార్యక్రమ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటరు దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాంసృతిక కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు.
ఆసక్తి చూపని యువత
ఓటరుగా నమోదయ్యేందుకు యువత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో 18, 19 ఏళ్ల యువత 3.66 శాతం ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 82వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
పెరిగిపోతున్న బోగస్ ఓటర్లు
జిల్లాలో బోగస్ ఓటర్లు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. జనాభాలో ఓటర్లు 64.6 శాతం ఉండాలి. కానీ జిల్లాలో 69 నుంచి 70 శాతం ఉండటం గమనార్హం. 1000 మంది పురుష ఓటర్లకు 988 మంది మహిళా ఓటర్లు ఉండాల్సిన స్థానంలో.. మహిళలు 1010 మంది ఉండటం బోగస్‌కు నిదర్శనం. నేతల స్వార్థమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. నవంబర్ 18న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 28,39,987 మంది కాగా.. పురుషులు 14,12,951.. మహిళలు 14,27,036 మంది ఉన్నట్లు వెల్లడైంది.
జిల్లాలో మొత్తం 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. ఇటీవల అధికారులు దాదాపు 60వేల బోగస్ ఓటర్లను తొలగించినా.. ఇప్పటికీ 1.24 లక్షల బోగస్ ఓటర్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారానే పోలింగ్
ఈ ఏడాది జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనే వినియోగించనున్నారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ఫిబ్రవరి నెల 20వ తేదీ తర్వాత ఏ రోజైనా వెలువడే అవకాశం ఉంది. త్వరలో జిల్లాకు కొత్త ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. ఈవీఎంలను భద్రపరిచేందుకు కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన రూ.1.05 కోట్లతో గోదామును నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఓటరు నమోదుకు ఎప్పుడైనా అవకాశం
18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదయ్యేందుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఫారం-6ను పూర్తి చేసి పంపవచ్చు. దీనిపై సందేహాలు ఉంటే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకునేందుకు 18004251110 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఓటర్లుగా నమోదైన వారు మీ సేవ కేంద్రాల్లో రూ.10 చెల్లించి ఫొటో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు.
ఓటరవుదాం.. ఓటేద్దాం
Published Sat, Jan 25 2014 12:37 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement