డెబిట్, క్రెడిట్ కార్డులతో పన్నుల చెల్లింపు
మునిసిపల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌కు పురపాలక శాఖ ఏర్పాట్లు
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
మునిసిపాలిటీల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ యంత్రాలు
చిన్నపాటి మొబైల్ మిషిన్ల ద్వారా ఇళ్లవద్దే వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్ను మొత్తాలు ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా స్వీకరించేందుకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌లో, అలాగే కార్పొరేషన్.. మునిసిపల్ కార్యాలయూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా, చిన్నపాటి మొబైల్ మిషన్ల ద్వారా ఇళ్ల వద్దే పన్ను చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. మునిసిపాలిటీల్లో ప్రస్తుతం వసూలు అవుతున్న పన్నులు వెంటనే బ్యాంకుల్లో జమ కాకపోవడం, ప్రజలు చెక్కుల రూపంలో చెల్లిస్తున్న పన్నులు మునిసిపల్ ఖాతాల్లో జమ అవుతున్నదీ లేనిదీ సరిగా తెలియకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పురపాలక శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వసూలైన పన్నులు పారదర్శకంగా ఎప్పటికప్పుడు బ్యాంకులో, అటునుంచి ప్రభుత్వ ఖజానా(ట్రెజరీ)లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
‘మునిసిపల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్’ పేరిట డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని పురపాలక సంఘాలు, పురపాలక సంస్థల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం టెండర్ల విధానంలో రెండు బ్యాంకులు యూక్సిస్, ఐడీబీఐలను ప్రభుత్వం గుర్తించింది. ఈ రెండు బ్యాంకులకు ఆయా మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇంటి నంబర్లు, ఇంటి యజమాని పేరుతోపాటు, చెల్లించాల్సిన పన్ను ఎంత అన్న వివరాలను అందజేస్తారు. ఈ బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో పన్ను మొత్తాలను స్వీకరిస్తారుు. ప్రజలు కట్టే సొమ్ము సదరు బ్యాంకులోని మునిసిపల్ ఖాతాలో జమ అవుతారుు. పన్ను ఎవరు చెల్లించారో వెంటనే సదరు మునిసిపాలిటీకి తెలిసిపోతుంది. బ్యాంకులో పన్ను చెల్లించగానే.. మున్సిపాలిటీలోని ఈ-సువిధ కేంద్రంలో ఆ సమాచారం నమోదు అవుతుందని అధికారవర్గాలు వివరించాయి. మరోవైపు ఆ బ్యాంకులు మున్సిపాలిటీలకు ఎలక్ట్రానిక్ యంత్రాలు, సులువుగా ఆపరేట్ చేయగలిగిన చిన్నపాటి మొబైల్ మిషన్లను అందజేస్తారుు.
మునిసిపాలిటీలకు వెళ్లి అక్కడ బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కూడా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి పన్నులు చెల్లించవచ్చు. మరోవైపు ప్రస్తుతం విద్యుత్ శాఖ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న మాదిరి గానే చిన్నపాటి మొబైల్ మిషిన్ల ద్వారా ప్రజల ఇంటి వద్దే పన్నులు వసూలు చేస్తారు. ఇక్కడ కూడా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధమైన చెల్లింపులు జరిపిన వెంటనే ప్రజలకు మొబైల్ ఫోన్లలో ఎస్‌ఎంఎస్ వచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపాలిటీ నుంచి పన్ను చెల్లించాలని ఎలాంటి నోటీసు రాకపోయినా ఈ బ్యాంకుల నుంచి సమాచారం తీసుకుని చెల్లించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు. వసూలు అయిన ప్రతి పైసా ఉద్యోగుల వద్ద అట్టిపెట్టుకునే అవకాశం లేకుండా చేయడంతోపాటు, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నట్లు పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఈ సౌకర్యం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంది.