గర్విత గుల్హటి - వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్
International Womens Day 2024
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి..
'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం..
బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్‌లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది.
‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది.
'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం!
ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్‌జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్‌మెంట్ పాక్ట్ అసెస్‌మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది.
వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది.
'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం!
‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు.
ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్‌మేకర్‌ల అసాధారణ కథలను ఎఫ్‌ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది.
'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది.
పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది.
'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ!
మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్‌వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్‌ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా.
తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్‌లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్‌లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది.
ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
Comments
Please login to add a commentAdd a comment