International Womens Day 2024
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం.
ప్రయత్నించడం మానకూడదు..
మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం.
పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది.
–ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ
వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు..
స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు.
ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది.
కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్‌ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు.
– డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్
మన మీద మనకు నమ్మకం!
మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు.
నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
– రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్
భయం బిడియంతో శక్తి తగ్గుతుంది..
స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు.
ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు.
స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది.
– వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్
ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment