Lithium
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు
జమ్ము కశ్మీర్లో లిథియం గనులు బయటపడిన విషయం తెలిసిందే. దక్షిణాన కర్ణాటకలోని మండ్యలో దాదాపు 1600 టన్నుల లిథియం నిక్షేపాలున్నట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఏంటీ.. అదేమన్నా బంగారమా? అంటారా.. బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్ పవర్ యూనిట్..చివరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. దాంతో ఏటా వేలకోట్లు వెచ్చించి విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. అలాంటిది తాజాగా మనదేశంలోనే దాని నిక్షేపాలు బయటపడుతుండటం విశేషం. కరెంటు లేకపోయినా సెల్ ఫోను పనిచేస్తుంది. కారణం అందులో బ్యాటరీ ఉంటుంది. ఫోను ఒక్కటే కాదు; ల్యాప్‌టాప్, డిజిటల్ కెమెరా, ఎమర్జెన్సీ లైట్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రిక్ స్కూటర్, రోబో క్లీనర్.. ఇలా ప్రస్తుతం వాడే మరెన్నో పోర్టబుల్, స్మార్ట్ పరికరాలను చార్జింగ్ చేస్తూనే ఉంటారు. కరెంట్ ప్రతి సమయాల్లో, ప్రతి ప్రదేశాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్ బ్యాటరీలే. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్దసైజులో తయారైన మొబైల్ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారవడమే అందుకు కారణం. కారుకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే అది 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది. అసలేమిటీ లిథియం? ఇనుము, బంగారం, వెండిలాగే ఇదీ ఒక లోహం. ‘లిథోస్’ అంటే గ్రీకు భాషలో ‘రాయి’ అని అర్థం. చూడటానికిది వెండి రాయి లాగా కన్పిస్తుంది కానీ మెత్తగా ఉంటుంది. మండించినప్పుడు ఎర్రని మంట వస్తుంది. ఈ లోహాన్ని 1790లో బ్రెజిల్ దేశస్థుడు కనిపెట్టాడు. ఆ తర్వాత పలువురు రసాయన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా ముడిఖనిజం నుంచి లిథియంని వేరుచేసే విధానాన్ని తెలుసుకున్నారు. వివిధ రూపాల్లో లభ్యం సహజంగా ఇది వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిదరంగులోకి మారుతుంది. మంచి ఉష్ణ, విద్యుత్ వాహకం కూడా. చురుగ్గా స్పందిస్తుంది. నీటితో చర్య జరిపే గుణం ఉన్నందున ప్రకృతిలో లిథియం రూపంలో కాకుండా ఇతరపదార్థాలతో కలిసి భూమిమీదా, సముద్రంలోనూ ఇది దొరుకుతుంది. మండే స్వభావం ఉన్నందువల్ల దీన్ని ఏదైనా ఒక హైడ్రో కార్బన్ ద్రవంలో కానీ పెట్రోలియం జెల్లీలో కానీ ఉంచి భద్రపరుస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం సులువు. వెలికితీయడం సవాలే.. ముడి లిథియంను బయటకు తీయడం అంత తేలికైన పనేమీ కాదు. వాణిజ్యపరంగా లిథియంని కార్బొనేట్ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో రెండు రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్‌తో కలిసి ఉంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలేవరకూ విశాలమైన మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. సముద్రతీరాల్లో ఎక్కువగా ఈ రూపంలో లభిస్తుంది. మనదేశంలో బాక్సైట్‌తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దాన్ని ఓపెన్ మైనింగ్ తరహాలో లోతుగా గోతులు తవ్వి వెలికి తీయాలి. అందుకోసం పరిసర ప్రాంతాల్లోని చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు లేదా డీజిల్ ఉపయోగిస్తారు. ప్రయోజనాలివే.. అల్యూమినియం, రాగి లాంటి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి లిథియం లోహాన్ని ఉపయోగిస్తారు. వివిధ పరికరాల్లో ఒకదానినొకటి రాసుకుంటూ కదిలే భాగాల మధ్య రాపిడిని తగ్గించే శక్తి లిథియంకి ఉండడంతో గ్రీజు లాంటి కందెనల తయారీలో వాడతారు. పింగాణీ, గాజు లాంటి వాటి మెల్టింగ్ పాయింట్‌ని తగ్గించే సామర్థ్యం లిథియంకి ఉంది. వాటి నాణ్యతనీ సామర్థ్యాన్నీ పెంచగలదు. దీన్ని ఆయా వస్తువుల తయారీ పరిశ్రమల్లో, శీతలీకరణ యంత్రాల్లో ఎక్కువగా వాడతారు. లిథియంని ఇతర లోహాలతో కలిపినప్పుడు తయారయ్యే మిశ్రధాతువులు చాలా తేలిగ్గానూ దృఢంగానూ ఉంటాయి. విమానాలూ అంతరిక్షనౌకలకు సంబంధించిన విడిభాగాల తయారీలో ఈ మిశ్రధాతు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. రక్షణ సంబంధ పరికరాల్లోనూ, సైకిల్ ఫ్రేములూ, వేగంగా ప్రయాణించే రైళ్ల తయారీలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, మూర్ఛ, మధుమేహం, కాలేయ, మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన ఔషధాల్లోనే కాక బైపోలార్ డిజార్డర్, కుంగుబాటు, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతలకు వాడే పలు మందుల్లోనూ లిథియం ఉంటుంది. ఇదీ చదవండి.. అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ రీచార్జబుల్ కాని, వాడి పారేసే మామూలు బ్యాటరీల్లో(టీవీ, ఏసీ రిమోట్లలో వాడేలాంటివి) కూడా లిథియం ఉంటుంది. ఎరువుల తయారీలో సూక్ష్మపోషకంగా దీన్ని వాడతారు. -
మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?
టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు ఉన్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ గుర్తించింది. దాంతో ఈస్ట్ఆఫ్రికాలోని టాంజానియాలో ‘కేజీఎఫ్’ తరహా తవ్వకాలు జరుపనున్నట్లు తెలిసింది. బంగారంతోపాటు లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో ఇదొక కీలక పరిణామమని సంస్థ తెలిపింది. డెక్కన్ గోల్డ్ మైన్స్‌కు చెందిన డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్ న్జెగా-టబోరా గ్రీన్‌స్టోన్ పరిధిలోని పీఎల్ బ్లాక్ 11524లో ఈ నిల్వలను గుర్తించింది. అక్కడ బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు ఉన్నట్లు తేలింది. విద్యుత్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి లిథియం ఎంతో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ లిథియం నిల్వల గుర్తింపు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ మొదాలి తెలిపారు. ఇదీ చదవండి: మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..? లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్ లైసెన్సు(పీఎల్) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి పేర్కొన్నారు. టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి పీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్‌కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులున్నాయి. -
చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జమ్మూ-కశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ! ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్‌యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. -
మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!
Jharkhand Lithium Reserves: ప్రపంచానికి మైకాను ఎగుమతి చేసిన జార్ఖండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను గుర్తించిన తరువాత తాజాగా జార్ఖండ్‌లో అపారమైన నిల్వలను గుర్తించారు. జమ్మూ కశ్మీర్ , రాజస్థాన్, కర్ణాటకలలో లిథియం నిల్వలు కనుగొన్న కొన్ని నెలల తర్వాత, జార్ఖండ్‌లో కూడా కాస్మిక్ ఖనిజ నిల్వలను గుర్తించడం విశేషం. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) జియోలాజికల్ సర్వే నిర్వహించి, జార్ఖండ్‌లో కోడెర్మా , గిరిడిహ్‌లో లిథియం సహా అరుదైన ఖనిజాల నిల్వలున్న ప్రాంతాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాలతో పాటు తూర్పు సింగ్భూమ్ ,హజారీబాగ్‌లలో అన్వేషణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 30శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం లిథియం కోసం ప్రధానంగా చైనాపైనా ఎక్కువగా ఆధారపడుతోంది. జార్ఖండ్‌లో లిథియం నిల్వల ఆవిష్కరణతో దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకుపోనుంది. లిథియం ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తే, అది చౌకైన ఎలక్ట్రిక్ బ్యాటరీలకు దారితీస్తుందని , చివరికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత దిగి వవస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇపపటికే జార్ఖండ్ ప్రభుత్వం లిథియం మైనింగ్ సామర్థ్యాలను అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. (స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?) లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు , ఇతర గాడ్జెట్ల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. కోరలు చాస్తున్న కాలుష్యం, ఉద్గార నిబంధనల కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)వైపు మొగ్గుతున్నాయి. దీంతో లిథియంకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచానికి కనీసం 2 బిలియన్ల (200 కోట్లు) EVలు అవసరమవుతాయి .వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే లిథియం నిల్వలున్నాయి. లిథియం మైనింగ్ , ప్రాసెసింగ్‌లో చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం లిథియంలో ఎక్కువ భాగం చైనా, ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా ద్వారా సరఫరా చేయబడుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, బీహార్ , పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉన్న తూర్పు రాష్ట్రం ఇప్పటికే యురేనియం, మైకా, బాక్సైట్, గ్రానైట్, బంగారం, వెండి, గ్రాఫైట్, మాగ్నెటైట్, డోలమైట్, ఫైర్‌క్లే, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బొగ్గు (32 శాతం), ఇనుము, రాగి (భారతదేశంలో 25 శాతం) నిల్వలకు ప్రసిద్ధి చెందింది. -
రాజస్థాన్‌లో భారీగా బయటపడ్డ లిథియం నిక్షేపాలు.. ఇక చైనాకు చెక్ పడ్డట్టే!
జైపూర్: అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్తాన్‌లో భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో డేగానా(నాగౌర్)లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్తాన్‌లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80 శాతం అవసరాలను రాజస్తాన్‌లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతోంది. తాజాగా బయటపడిన నిల్వలతో చైనా గుత్తాధిపత్యానికి తెరపడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగిస్తున్నారు. -
రూ. 35 లక్షల కోట్ల విలువైన లిథియం నిక్షేపాల వేలం పాట.. ఎప్పుడంటే?
జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లభ్యమైన 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వేలం వేయనున్నట్లు గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ తెలిపారు. ఇటీవల గనుల శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. లిథియం వేలంలో సలహాదారు కోసం కేంద్ర గనుల శాఖ జమ్మూ కశ్మీర్ పరిపాలనా విభాగానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ..59 లక్షల టన్నుల లిథియంను కనుగొనడం అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి మేం జమ్మూ కాశ్మీర్లో లభించే సున్నపురాయి కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా సున్నపురాయి, బాక్సైట్, లిథియంలను గుర్తించినట్లు చెప్పారు. రూ.35 లక్షల కోట్లకు పైమాటే ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. మార్కెట్ అంచనా ప్రకారం.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించిన ఒక టన్ను లిథియం ఖరీదు రూ. 60 లక్షలు ఉండగా.. వీటి మొత్తం ఖరీదు సుమారు రూ. 35 లక్షల (అంచనా) కోట్లుపై మాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే లిథియం నిక్షేపాల్ని వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. -
లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.33,750 కోట్లు కావాలా?
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 50 గిగావాట్ల లిథియం అయాన్ సెల్, బ్యాటరీ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకై భారత్‌కు రూ.33,750 కోట్లు కావాలి. మొబిలిటీ, విద్యుత్ రంగం 2030 నాటికి కర్బనరహితం కావడానికి 903 గిగావాట్ అవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యం అవసరమని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) తన నివేదికలో తెలిపింది. ఈ డిమాండ్‌లో అత్యధికం లిథియం అయాన్ బ్యాటరీలు తీరుస్తాయని వివరించింది. చమురు, సహజ వాయువు మాదిరిగానే పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం లిథియం ముఖ్యమైనదని వెల్లడించింది. దేశంలోనే అవసరమైన సెల్, బ్యాటరీ తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా ఆసక్తి చూపుతోందని వివరించింది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని తెలిపింది. (ఇదీ చదవండి: రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!) -
లిథియం నిల్వల వేలం ప్రక్రియకు కేంద్రం సన్నద్ధం.. దక్కించుకునే లక్ ఎవరికుందో?
2023 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారీ లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నిల్వలను బయటకు తీయడానికి, శుద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుమారు 5.9 మిలియన్ టన్నుల వరకు ఉన్న లిథియం నిల్వలను బయటకు తీయడానికి వేర్వేరు లెవెల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్న దేశాల్లో భారతదేశం ఏడవ స్థానం ఆక్రమించింది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీలలో ఎక్కువ శాతం లిథియం వినియోగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లిథియం డిపాజిట్ల వేలం ప్రక్రియను 2023 జూన్‌లో ప్రారంభించనున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. లిథియం నిల్వల వేలం ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, వేలం ప్రక్రియలో దీనిని సొంతం చేసుకునే సంస్థలు శుద్ధి చేసే ప్రక్రియను భారతదేశంలోనే జరపాలని, ఏ కారణం చేతనూ విదేశాలకు పంపించకూడదని సంబంధిత వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది, అదే సమయంలో దేశంలో బయటపడిన లిథియం నిల్వల వల్ల 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారదేశంలో లిథియం శుద్ధి చేయడానికి కావలసిన సదుపాయాలు లేదు, భవిష్యత్తులో ఇలాంటి సదుపాయాలు దేశంలో నెలకొల్పబడతాయా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఎక్కువ లిథియం ఉన్న దేశాల్లో బొలీవియా మొదటి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో వరుసగా అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలు ఉన్నాయి, ఇటీవల ఇండియా లిథియం అయాన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం ప్రభుత్వం లిథియం వేలం ప్రక్రియను పూర్తి చేసిన తరువాత జరగాల్సిన పనులు ప్రారంభమవుతాయి. -
సంబరంలో దాగిన సంకటం!
వర్తమాన యుగంలో అపురూపమైన, అత్యవసరమైన ఒక ఖనిజం కోసం ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు నిరంతరాన్వేషణలో తలమునకలైన వేళ ‘నేనున్నాన్నంటూ భారత్‌లోనే అది ప్రత్యక్షం కావటం సంబరం చేసుకోవాల్సిన సందర్భమే. అందుకే జమ్మూ, కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నాణ్యమైన లిథియం నిక్షేపాలున్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి లిథియం నిక్షేపాలు మన దేశంలో బయటపడటం ఇది మొదటిసారేమీ కాదు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలో కూడా లిథియం ఆచూకీ కనుక్కున్నారు. అయితే ఆ నిల్వలు 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు బయటపడిన నిక్షేపాలు దాదాపు 60 లక్షల టన్నులు. వర్తమాన ప్రపంచాన్ని నడిపిస్తున్న శిలాజ ఇంధనాలు క్రమేపీ తరిగిపోతున్నాయని, పైగా వాటి వినియోగం కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదనీ అర్థమయ్యాక ప్రత్యామ్నాయాల కోసం ఆత్రుతపడటం మొదలైంది. ఆ క్రమంలో ‘హరిత ఇంధ నాల’ పేరిట చాలానే ఉనికిలోకొచ్చాయి. అయితే వీటికున్న పరిమితులను అధిగమించటంలో ఇంకా పూర్తి స్థాయి విజయం సాధ్యం కాలేదు. ఈ తరుణంలో లిథియం–అయాన్ బ్యాటరీ రూపకల్పనకు తోడ్పడగల పరిశోధన చేసినందుకు 2019 సంవత్సరానికి ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి రావటం ప్రత్యామ్నాయ ఇంధన వెతుకులాటలో కీలక మలుపు. ఆ పరిశోధనల పర్యవసానంగానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల రంగంలో ఊహించని అభివృద్ధి సాధ్యమైంది. 1991లో ఒక జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి చేశాక కంప్యూటర్ ఎక్కడికైనా తీసుకెళ్లే ఉపకరణమైంది. అప్పుడప్పుడే వస్తున్న డిజిటల్ కెమెరాల సైజు గణనీయంగా తగ్గింది. సెల్ఫోన్ల ఆగమనంలో లిథియం అయాన్ బ్యాటరీ పాత్ర అసాధారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్‌తో నడిచే వాహనాల తయారీ కూడా జోరందుకుంది. ఇంకా పేస్మేకర్లకూ, అంతరిక్ష నౌకలకూ, జలాంతర్గాములకూ లిథియం హైడ్రాక్సైడ్ కీలకం. ఇక బైపోలార్ వ్యాధి నివా రణకు తోడ్పడే ఔషధాల ఉత్పత్తిలో లిథియం కార్బొనేట్ ఎంతో అవసరమని ఇటీవల కనుగొన్నారు. 2020లో ప్రపంచ లిథియం వినియోగం కేవలం 56,000 టన్నులైతే అది ఇప్పటికే రెట్టింపు దాటింది. ఏటా ఆ వినియోగం 22 లక్షల టన్నులకు చేరుకోవచ్చని ఒక అంచనా. ‘తెల్ల బంగారం’గా పిలిచే లిథియంపై ఆధారపడటం ఎక్కువవుతున్న తరుణంలో దాని ఖరీదు కూడా పెరుగుతోంది. మన దేశం 2020–21లో రూ. 173 కోట్ల విలువైన లిథియంను దిగుమతి చేసుకోగా, ఆ ఏడాదే మరో 8,811 కోట్ల రూపాయల విలువైన లిథియం అయాన్ బ్యాటరీలు కొనుగోలు చేసింది. నిరుడు ఈ వ్యయం దాదాపు రెట్టింపయింది. రాగల సంవత్సరాల్లో ఇదింకా పెరగటం ఖాయం. కనుకనే లిథియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘా లయల్లో 20 ప్రాజెక్టులు ప్రత్యేకించి లిథియం కోసమే పనిచేస్తున్నాయి. ఇవిగాక మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఖనిజ్ బిదేష్ ఇండియా(కబిల్) పేరిట ఒక సంస్థ ఏర్పడి ఆస్ట్రేలియా, అర్జెంటీనా లిథియం గనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్లో అపారంగా లిథియం నిక్షేపాలున్నట్టు వెల్లడికావటం ఉత్సాహాన్నిచ్చేదే. ప్రపంచంలో భారీయెత్తున లిథియం నిల్వలున్న దేశం బొలీవియా అయితే...ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న చిలీ, ఆస్ట్రేలియా, చైనాల తర్వాత మనమే. రాశిలో అమెరికా కన్నా కూడా మనం ఎక్కువే. ఈ నిక్షేపాల నాణ్యతనూ, వాస్తవ వినియోగ సామర్థ్యాన్నీ మరిన్ని పరీ క్షల తర్వాతగానీ పూర్తిగా నిర్ధారించలేమన్నది శాస్త్రవేత్తల మాట. ఇందుకు రెండేళ్ల సమయం పడు తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఉత్పత్తి మొదలుకావడానికి మరో అయిదారేళ్లు తప్పదు. ఈ ప్రక్రియంతా పర్యావరణ హితంగా జరగటం సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పుడు నిక్షేపాలు బయటపడిన ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో ఉంది. పర్యావరణపరంగా వచ్చే ప్రమాదం గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరుచేసి దశాబ్దాలుగా జలవిద్యుత్ ప్రాజెక్టులూ, ఇతర నిర్మాణాలూ చేపట్టిన పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లోని జోషీ మ పట్టణం ఎలా కుంగిపోతున్నదో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. భూకంప ముప్పు రీత్యా హిమాలయ పర్వత ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. లిథియం నిక్షేపాల వెలికితీత ఆ ముప్పును మరింత పెంచేలా మారకూడదు. ఉక్కు తెరల వెనక కాలక్షేపం చేసే చైనాలో లిథియం వెలికితీత వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా వెనకబడిన దక్షిణ అమెరికా దేశాల్లో జనం ఎదుర్కొంటున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఒక టన్ను లిథియం ఉత్పత్తికి 22 లక్షల లీటర్ల నీరు అవసరం కావటంతో చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో స్థానికంగా ఉన్న జలవన రులన్నీ హరించుకుపోతున్నాయి. నేల, చెట్టూ, చేమా దెబ్బతింటున్నాయి. దాంతో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా పర్యావరణాన్ని కాటేసే లిథియంకు బదులు తక్కువ నష్టం ఉండే ఇనుము, సిలికాన్ వంటి లోహాలపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఊపందు కుంది. ఏదేమైనా జమ్మూ, కశ్మీర్ లిథియం నిక్షేపాల విషయంలో ఆచితూచి అడుగేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. -
భారత్‌లో అత్యంత విలువైన ఖనిజం.. అమెరికా కంటే మన దగ్గరే అధికం
ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం నానాటికీ పెరిగిపోతోంది. సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. ఇక స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే పొద్దు గడవదు. మరి ఈ అవసరాలన్నీ తీరాలంటే ఏం కావాలో తెలుసా? లిథియం. అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమన గ్రామం వద్ద ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఇటీవల గుర్తించింది. భారత్‌లో ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి! తవ్వకాలతో నీటి నిల్వలకు ముప్పు! ఖనిజ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు తప్పదు. లిథియం తవ్వకాల కారణంగా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లిథియం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతరించిపోతాయని హెచ్చరిస్తున్నారు. భూమిపై తేమ తగ్గిపోయి, కరువు నేలగా మారుతుందని పేర్కొంటున్నారు. ఒక టన్ను లిథియం కోసం తవ్వకాలు సాగిస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని సమాచారం. ఒక టన్ను లిథియం తవ్వకానికి దాదాపు రూ.64 లక్షల ఖర్చవుతుంది. లిథియం వెలికితీతకు భారీస్థాయిలో నీరు అవసరం. లిథియం అంటే? తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్ భాషలోని లిథోస్ (రాయి) నుంచి పుట్టింది. ఇది ఆల్కలీ మెటల్ గ్రూప్‌కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి రంగులో వెండిలాగా మెరిసే లోహం. పీరియాడిక్ గ్రూప్ 1(ఐఏ)లో లిథియంను చేర్చారు. ఇది భూగోళంపై సహజంగా ఏర్పడింది కాదు. అంతరిక్షంలో సంభవించిన పేలుళ్ల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం పుట్టిన తొలినాళ్లలో భూగోళంపై లిథియం నిల్వలు మొదలైనట్లు తేల్చారు. ఇతర గ్రహాలపైనా లిథియం ఉంది. 500 పీపీఎం నాణ్యత సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. కానీ కశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 పీపీఎంగా ఉండటం విశేషం. లిథియంను ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. విద్యుత్‌తో నడిచే వాహనాల బ్యాటరీల తయారీకి లిథియం కీలకం. ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాల బ్యాటరీల తయారీలోనూ ఉపయోగిస్తారు. గాజు, సెరామిక్ పరిశ్రమల్లో లిథియం వాడకం అధికంగా ఉంది. పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలు లిథియంతో తయారవుతాయి. రీచార్జి చేయడానికి వీల్లేని బ్యాటరీల్లోనూ వాడుతారు. పేస్మేకర్లు, బొమ్మలు, గడియారాల్లోని బ్యాటరీల్లో లిథియం ఉంటుంది. 2030 నాటికి మన దేశంలో 27 గిగావాట్ల గ్రిడ్–స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ కావాలని అంచనా. అంటే రానున్న రోజుల్లో లిథియం అవసరం ఎన్నో రెట్లు పెరిగిపోనుంది. అంతర్జాతీయంగా లిథియం మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2008 నుంచి 2018 నాటికి దీనికి వార్షిక ఉత్పత్తి 25,400 టన్నుల నుంచి 85,000 టన్నులకు చేరింది. ఐదో స్థానంలో భారత్ 3.9 కోట్ల టన్నులతో బొలీవియా ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. చిలీ, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, అర్జెంటీనా తదితర దేశాల్లో కోట్ట టన్నుల నిల్వలున్నట్లు కనిపెట్టారు. భారత్‌లో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నుల లిథియం ఉన్నట్లు రెండేళ్ల క్రితం గుర్తించారు. తాజాగా కశ్మీర్లో బయట పడ్డ 59 లక్షల టన్నులతో కలిపితే ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో కంటే భారత్‌లోనే అధిక నిల్వలున్నాయి. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా నుంచి భారత్ లిథియంను దిగుమతి చేసుకుంటోంది. ముడి లిథియంను శుద్ధి చేసి, బ్యాటరీల తయారీకి అనువైన లోహంగా మార్చడం కఠినమైన ప్రక్రియ. ఇందులో సాధించేదాకా మరో రెండేళ్లపాటు దిగుమతులపై ఆధారపడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఏ దేశంలో ఎన్ని నిల్వలు(టన్నుల్లో) దేశం లిథియం నిల్వలు బొలీవియా 3,90,00,000 చిలీ 1,99,03,332 ఆస్ట్రేలియా 77,17,776 చైనా 66,90,180 భారత్ 59,00,000 అమెరికా 57,62,917 – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్మూకశ్మీర్ లిథియం నిల్వలు అత్యుత్తమ రకం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బయటపడిన లిథియం నిల్వలు అత్యుత్తమ రకానికి చెందినవని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ పరిశోధన సంస్థ (జీఎస్ఐ)కనుగొన్న విషయం తెలిసిందే. ‘‘లిథియం కీలకమైన ఖనిజ వనరు. ఇది గతంలో దేశంలో అందుబాటులో లేదు. నూటికి నూరు శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సాధారణంగా లిథియం నాణ్యత 220 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్)గా ఉంటుంది. అయితే, కశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత 500 పీపీఎం ప్లస్‌గా ఉంది. లిథియం లభ్యతలో మన దేశం చైనాను మించిపోతుంది’’ అని కశ్మీర్ గనుల శాఖ కార్యదర్శి అమిత్ శర్మ చెప్పారు. -
భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: జమ్మూ కశ్మీర్లో అపారమైన లిథియం నిక్షేపాలను కనుగొనడంపై పారిశశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇక సందేహం లేదు, భారతదేశం భవిష్యత్తు అంతా ఎలక్ట్రి ఫైయింగే అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో అత్యంత కీలకమైంది లిథియం, ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్ర భవిష్యత్తులో ఈ-వాహనాల్లో భారత్ దూసుకుపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?) దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. లిథియం నిక్షేపాల ఆవిష్కరణతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత దిగిరానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మొత్తం 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్ర గనుల శాఖ పేర్కొంది. నాన్-ఫెర్రస్ ఖనిజమైన లిథియం..ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడే కీలకమైన మూలకం. భారీగా లిథియం నిల్వలగుర్తింపుతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని, ఫలితంగా డీజిల్, పెట్రోల్‌పై ఆధారపడడం ఇకపై మరింత తగ్గుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే..) కాగా ఈవీ కార్ల బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో లిథియం ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ బ్యాటరీలో ఉత్పత్తిపై చైనా వంటి దేశాల దిగుమతులపై ఆధారపడుతోంది ఇండియా. తాజా పరిణామంతో ఈవీల ఉత్పత్తి ఖర్చు ఖచ్చితంగా తగ్గుంనుందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలు, మండుతున్న ఇంధన ధరల నేపథ్యంలో గ్లోబల్‌గా ఈవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది. -
Geological Survey of India: జమ్మూకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను తొలిసారిగా మన దేశంలో గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ‘‘జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది’’ అని ట్వీట్ చేసింది. గనుల శాఖ 2018–19లో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 51 ఖనిజ క్షేత్రాలను కనిపెట్టింది. సంబంధిత సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసింది. బంగారంతో పాటు పొటాషియం, మాలిబ్డినం, ఇంకా ఇతర ప్రాథమిక లోహాల నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. బంగారం నిల్వలను 5 క్షేత్రాలను కనుగొన్నారు. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ తెలిపింది. భారత్ ప్రస్తుతం లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. విద్యుత్ వాహనాల తయారీలో లిథియం చాలా కీలకం. ఇప్పుడు ఈ ఖనిజ నిల్వలు జమ్మూకశ్మీర్‌లో బయటపడడంతో రాబోయే రోజుల్లో దేశంలో విద్యుత్ వాహనాల తయారీ రంగం వేగం పుంజుకోనుంది. లిథియం దిగుమతుల భారం పెద్దగా ఉండదు కాబట్టి విద్యుత్ వాహనాల ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీలోనూ లిథియం ఉపయోగిస్తారు. -
Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అరుదైన ఖనిజాలకు నిలయమైన ‘అనంత’లో మరో విలువైన ఖనిజం ఉనికి లభింంది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు జిల్లాలో భారీగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో గుర్తించారు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ధ్రువీకరించారు. లిథియం ప్రాజెక్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ, డాక్టర్ ఎస్.సంజీవ్ కుమార్ ఈ నెల రెండో తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి ప్రహ్లాద్ జోషి రాతపూర్వక సమాధానమిస్తూ అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నిక్షేపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. తాడిమర్రి మండల పరిధిలో.. జీఎస్ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాలతో పాటు సమీపంలోని వైఎస్సార్ జిల్లా పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లోని మట్టి, శిలలు, ప్రవాహ అవక్షేపాలను సేకరించి పరీక్షించారు. 18 పీపీఎం నుంచి 322 పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అరుదైన ఖనిజం.. ఫుల్ డిమాండ్ లిథియం ఖనిజం చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పటివరకూ చిలీ, ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తోంది. ఈ ఖనిజాన్ని రీచార్జ్‌బుల్ బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా గుండెకు అమర్చే పేస్మేకర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ఖనిజాన్ని 1817లో స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త జాన్ అగస్ట్ ఆర్ఫ్వెడ్సన్ కనుగొన్నారు. ఇది మార్కెట్‌ను శాసించింది మాత్రం 1990 తర్వాతనే. దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ పై కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి అరుదైన ఖనిజం ఉనికి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో లభించడం గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. విలువైన ఖనిజాలకు కేరాఫ్ అనంతపురం జిల్లా విలువైన ఖనిజాలకు కేరాఫ్‌గా ఉంది. బంగారు, వజ్రాలు, బైరటీస్, ఇనుము తదితర ఖనిజ నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు లిథియం నిక్షేపాలు కూడా వెలుగు చూడడం విశేషం. అంతర్జాతీయంగా డిమాండ్ లిథియం ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని బ్యాటరీల తయారీలో, కెమికల్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. సముద్రగర్భాల్లో ఎక్కువగా దొరికే అవకాశముంది. అలాంటిది మన దగ్గర ఉండడం గొప్ప విషయమే. దీన్ని అవసరానికి తగ్గట్టుగానే వినియోగించుకోవాల్సి ఉంటుంది. –సుబ్రహ్మణ్యేశ్వరరావు, గనుల శాఖడిప్యూటీ డైరెక్టర్, అనంతపురం -
ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!
కాబూల్: కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడమేకాదు ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల భారీ నిక్షేపాల ప్రాప్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు. సంఘర్షణ, అవినీతి, అధికార లోపం కారణంగా గత పదేళ్లుగా దాదాపు పూర్తిగా ఉపయోగంలోకి రాకుండా ఉన్న లిథీయం నిక్షేపాలపై కూడా పట్టు సాధించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఉపయోగపడే ఈ ఖనిజ వనరులు విరివిగా ఉపయోగంలోకి వస్తాయా, ఈ ఖనిజాల మైనింగ్ ట్రేడింగ్‌ను తాలిబన్లు సమర్ధవంతంగా నిర్వహించగలరా? ఖనిజాలు, విలువైన లోహాల నిధిగా పేరొందిన దేశంలో నల్లమందుకు ప్రత్యామ్నాయంగా ప్రధాన ఆర్థిక వనరుగా మైనింగ్‌ను ఉపయోగించుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ జియాలజిస్టులు దేశంలోని విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కనుగొన్న తరువాత 2010లో "సౌదీ అరేబియా ఆఫ్ లిథియం" గా పిలిచిన లిథియం ఖనిజ సంపదపై కూడా తాలిబన్లు తాజాగా పట్టు సాధించారు. దీని విలువ కనీసం 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అప్పట్లోనే అంచనా వేశారు. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) ఎలక్ట్రిక్ వాహనాల పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఈ సిల్వర్ మెటల్ ఎంతో అవసరం ఉంది. అయితే ప్రపంచంలోని అగ్రశ్రేణి లిథియం ఉత్పత్తిదారు అయిన చైనా నుండి అమెరికా తన ఇంధన సరఫరా గొలుసులను విడదీయాలని చూస్తున్నందున, అప్గనిస్తాన్ ఖనిజ సంపద తాలిబాన్ నియంత్రణలోకి పోవడం అంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బేనని నిపుణుల అంచనా. తాలిబాన్లు ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన వ్యూహాత్మక ఖనిజాలపై పట్టు సాధించారని వాషింగ్టన్ థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ రిస్క్‌లో పర్యావరణ భద్రతా కార్యక్రమం అధిపతి రాడ్ స్కూనోవర్ అన్నారు. అయితే తాలిబన్లు వీటిని ఉపయోగించగలరా, ఉపయోగించుకుంటారా అనేది ముఖ్యమైన ప్రశ్న అన్నారు. తాలిబన్లు అఫ్గన్‌ను అక్రమించుకున్న తరువాత దేశం విడిచిపారిపోయిన అధ్యక్షుడు, ప్రపంచ ఆర్థికవేత్త అశ్రఫ్ ఘనీ ఖనిజాలను ఒక శాపంగా పేర్కొనేవారు. ఖనిజాలు అప్గన్‌కు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. అంతర్జాతీయ పవర్ సంస్థ ప్రకారం, లిథియం కోసం గ్లోబల్ డిమాండ్. 2020 నాటితో పోలిస్తే 2040 నాటికి 40 రెట్లు పెరగనుంది. ఈ ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభ్యమవుతున్న నేపథ్యంలో అప్గనిస్తాన్‌కు గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే గతంలో అఫ్గన్ ప్రభుత్వ అధికారులు దేశంలో అమెరికా సైనిక ఉనికిని విస్తరించేందుకు ప్రలోభ పెట్టి మరీ కొన్ని మైనింగ్ ఒప్పందాలకు ప్రయత్నించినాప్పటికీ వాటిని అడ్డుకున్నారు. అదే సమయంలో, తాలిబాన్లు తిరుగుబాటులో భాగంగా దేశ వార్షిక ఆదాయంలో 300 మిలియన్ డాలర్ల మేర అక్కడి ఖనిజాలను లాపిస్ లాజులి, రత్నం చట్టవిరుద్ధంగా దోచుకున్నారు. ఖనిజ నిక్షేపాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవినీతి హింసను పెంచుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్) ( లిథియం...ఫైల్ ఫోటో) తాలిబన్ నియంత్రణలోఇప్పుడు ఏమి జరుగుతుంది అనేది ప్రధాన చర్చ. అయితే గ్లోబల్ లిథియం ట్రేడ్‌లోకి తాలిబన్లు ఎంట్రీ ఇవ్వలేరని స్కూనోవర్ చెప్పారు. అనేక సంవత్సరాల సంఘర్షణతో దేశంలోని భౌతిక మౌలిక సదుపాయాలు-రోడ్లు, విద్యుత్ ప్లాంట్లు, రైల్వేలు విధ్వంస మయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగరాల్లో ప్రాథమిక ప్రజా సేవలు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకే కష్టపడాలన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే ఆర్థిక విధానాలను అమలు చేయడం. అంతర్జాతీయ పెట్టుబడి దారులను ఆకర్షించే ఆర్థిక విధానాలు అమల్లో లేవు. తాలిబన్లతో పోటీపడుతున్న ఏ కంపెనీ అయినా మైనింగ్ ఒప్పందాల గురించి చర్చించడం కష్టమే. ఇక ఆన్లైన్లో మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు రుణ స్థాయిని చైనా గ్రూపునకు విస్తరించే అవకాశం ఇప్పట్లో లేదని డెవలప్ మెంట్ ఎకనామిక్స్ రీసెర్చర్ నిక్ క్రాఫోర్డ్ అభిప్రాయ పడ్డారు. అలాగే 2007లో అఫ్గనిస్తాన్‌లో ప్రారంభమైన 3 బిలియన్ డాలర్ల రాగి మైనింగ్ ప్రాజెక్ట్‌లో చైనా పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో, నీటి కొరత, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన తీవ్రమైన వాతావరణ విపత్తులతో సహా ఇప్పటికే అఫ్గన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర పర్యావరణ ప్రమాదాలకు మైనింగ్ కూడా తోడయ్యే అవకాశం ఉందని క్రాఫోర్డ్ చెప్పుకొచ్చారు. -
దక్షిణాదిలో బయటపడిన అరుదైన లోహం
బెంగళూర్ : భారత్‌లో ఎలక్ర్టిక్ వాహనాల తయారీకి భారీ ముందడుగు పడింది. ఎలక్ర్టిక్ బ్యాటరీల తయారీలో ఉపయోగించే కీలక లోహం లిథియం నిల్వలను బెంగళూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌కు చెందిన పరిశోధకులు దక్షిణ కర్ణాటక జిల్లాలోని కొద్దిపాటి భూమిలో 14,100 టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారని జర్నల్ కరెంట్ సైన్స్‌లో ప్రచురితమయ్యే పత్రాల్లో వెల్లడైంది. అందుబాటులో ఉన్న 30,300 టన్నుల ముడి లోహం నుంచి 14,100 టన్నుల లిథియం మెటల్‌ను తయారుచేయవచ్చని అంచనా వేస్తున్నామని బ్యాటరీ టెక్నాలజీస్‌లో ప్రావీణ్యం కలిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎన్ మునిచంద్రయ్య పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద లిథియం నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. చిలీలో 8.6 మిలియన్ టన్నులు, ఆస్ర్టేలియాలో 2.8 మిలియన్ టన్నులు, అర్జెంటీనాలో 1.7 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్ లిథియంను పూర్తిస్ధాయిలో దిగుమతి చేసుకుంటోంది. చదవండి : స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్ -
ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద రానున్న ఈ కేంద్రాల్లో తొలి దశలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక గిగావాట్‌తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్ సామర్థ్యానికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారమిక్కడ నిర్వహించిన ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మూడు సంస్థల ద్వారా రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. నెల రోజుల్లో ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభమై, 9–15 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 200 ఎకరాల పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిని 900 ఎకరాల స్థాయికి చేరుస్తామని వివరించారు. భాగ్యనగరిలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు.. హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు తిరిగే విషయమై పోలీసు శాఖతో చర్చిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, దీనిని తగ్గించడంలో భాగంగా కాలం చెల్లిన పాత త్రీవీలర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో రీప్లేస్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, బ్యాటరీల తయారీలో వాడే లిథియం నిక్షేపాలున్న బొలీవియాలో మైనింగ్ కోసం భారత కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే తమ దేశంతో చర్చలు జరుపుతున్నాయని భారత్‌లో బొలీవియా రాయబారి జె.జె.కార్టెజ్ తెలిపారు. -
వేడి వేడి టార్చి...
సాధారణంగా కరెంటు పోయినప్పుడో.. రాత్రివేళ బయటకు వెళ్లినప్పుడో వెలుతురు కోసం టార్చిలైటు ఉపయోగిస్తాం. కానీ ఈ టార్చిలైటు కాంతినే కాదు.. వేడిని కూడా ఇస్తుంది. ఆ వేడి ఎంత ఉంటుందంటే.. దాంతో చక్కగా ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ ప్లేటును దాని దగ్గరగా పెట్టి ఈ లైటు వేస్తే.. అది ఏకంగా ఇలా మండిపోతుంది. అంతేకాదు.. మనకు ఎంత వెలుతురు అవసరమో, అందుకు తగ్గట్టుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే, టార్చిలా ఉపయోగించుకోవచ్చు లేదా ఫోకస్ లైట్లానూ వినియోగించుకోవచ్చు. ఇందులోనిఅయాన్ బ్యాటరీ.. మనం అడ్జస్ట్ చేసుకున్న కాంతిని బట్టి 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు పనిచేస్తుంది. ఈ బల్బ్ సాధారణ టార్చిలైట్లలోని బల్బ్ కంటే 20వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. షాంఘైలోని విక్డ్ లేజర్స్ అనే సంస్థ రూపొందించిన ఈ టార్చి ధర దాదాపు రూ.12 వేలు.