
చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియాలో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో లిథియం ప్రత్యక్ష మైనింగ్‌ను ప్రోత్సహించడానికి త్వరలోనే కమర్షియల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మినిష్టర్ 'ఖలీద్ బిన్ సలేహ్ అల్ ముదైఫర్' వెల్లడించారు.
ఇప్పటికే ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. లిథియం నిక్షేపాలు బయటపడంతో మరింత బలపడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కంపెనీ 'సౌదీ అరామ్‌కో అకా అరమ్‌కో' (Saudi Aramco aka Aramco) లిథియంను వెలికి తీయనున్నట్లు.. దీనికోసం కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.
లిథియం నిక్షేపాలు బయటపడిన సందర్భంగా అల్ ముదైఫర్ మాట్లాడుతూ.. చమురు క్షేత్రాలు, ఉప్పునీటి ప్రవాహాల నుంచి లిథియం తీయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే లిథియం ధరలు పెరిగితే కొత్త ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
నిజానికి సౌదీ అరేబియా, దశాబ్దాలుగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీనికి లిథియం కూడా తోడైంది. చమురు మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలలో భాగంగా ఈ నిక్షేపాలను గుర్తించారు.
లిథియం ఉపయోగాలు
ఈ రోజు మనం రోజూ ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, సోలార్ పవర్ యూనిట్లు, ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు వంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లో లిథియం ఉపయోగిస్తారు. నేడు ప్రతి రంగంలోనూ లిథియం అవసరం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దీనిని తెల్ల బంగారం అని పిలుస్తారు.