సంబరంలో దాగిన సంకటం! | Geological Survey Of India Discovers Lithium Reserves In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

సంబరంలో దాగిన సంకటం!

Published Tue, Feb 14 2023 1:43 AM | Last Updated on Tue, Feb 14 2023 1:59 AM

Geological Survey Of India Discovers Lithium Reserves In Jammu Kashmir - Sakshi

వర్తమాన యుగంలో అపురూపమైన, అత్యవసరమైన ఒక ఖనిజం కోసం ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు నిరంతరాన్వేషణలో తలమునకలైన వేళ ‘నేనున్నాన్నంటూ భారత్‌లోనే అది ప్రత్యక్షం కావటం సంబరం చేసుకోవాల్సిన సందర్భమే. అందుకే జమ్మూ, కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నాణ్యమైన లిథియం నిక్షేపాలున్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ప్రకటించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి లిథియం నిక్షేపాలు మన దేశంలో బయటపడటం ఇది మొదటిసారేమీ కాదు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలో కూడా లిథియం ఆచూకీ కనుక్కున్నారు. అయితే ఆ నిల్వలు 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు బయటపడిన నిక్షేపాలు దాదాపు 60 లక్షల టన్నులు. వర్తమాన ప్రపంచాన్ని నడిపిస్తున్న శిలాజ ఇంధనాలు క్రమేపీ తరిగిపోతున్నాయని, పైగా వాటి వినియోగం కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదనీ అర్థమయ్యాక ప్రత్యామ్నాయాల కోసం ఆత్రుతపడటం మొదలైంది.

ఆ క్రమంలో ‘హరిత ఇంధ నాల’ పేరిట చాలానే ఉనికిలోకొచ్చాయి. అయితే వీటికున్న పరిమితులను అధిగమించటంలో ఇంకా పూర్తి స్థాయి విజయం సాధ్యం కాలేదు. ఈ తరుణంలో లిథియం–అయాన్‌ బ్యాటరీ రూపకల్పనకు తోడ్పడగల పరిశోధన చేసినందుకు  2019 సంవత్సరానికి ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమిస్ట్రీలో నోబెల్‌ బహుమతి రావటం ప్రత్యామ్నాయ ఇంధన వెతుకులాటలో కీలక మలుపు. ఆ పరిశోధనల పర్యవసానంగానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్ల రంగంలో ఊహించని అభివృద్ధి సాధ్యమైంది. 1991లో ఒక జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ లిథియం అయాన్‌ బ్యాటరీ అభివృద్ధి చేశాక కంప్యూటర్‌ ఎక్కడికైనా తీసుకెళ్లే ఉపకరణమైంది. అప్పుడప్పుడే వస్తున్న డిజిటల్‌ కెమెరాల సైజు గణనీయంగా తగ్గింది. సెల్‌ఫోన్‌ల ఆగమనంలో లిథియం అయాన్‌ బ్యాటరీ పాత్ర అసాధారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్‌తో నడిచే వాహనాల తయారీ కూడా జోరందుకుంది. ఇంకా పేస్‌మేకర్లకూ, అంతరిక్ష నౌకలకూ, జలాంతర్గాములకూ లిథియం హైడ్రాక్సైడ్‌ కీలకం. ఇక బైపోలార్‌ వ్యాధి నివా రణకు తోడ్పడే ఔషధాల ఉత్పత్తిలో లిథియం కార్బొనేట్‌ ఎంతో అవసరమని ఇటీవల కనుగొన్నారు. 2020లో ప్రపంచ లిథియం వినియోగం కేవలం 56,000 టన్నులైతే అది ఇప్పటికే రెట్టింపు దాటింది. ఏటా ఆ వినియోగం 22 లక్షల టన్నులకు చేరుకోవచ్చని ఒక అంచనా.

‘తెల్ల బంగారం’గా పిలిచే లిథియంపై ఆధారపడటం ఎక్కువవుతున్న తరుణంలో దాని ఖరీదు కూడా పెరుగుతోంది. మన దేశం 2020–21లో రూ. 173 కోట్ల విలువైన లిథియంను దిగుమతి చేసుకోగా, ఆ ఏడాదే మరో 8,811 కోట్ల రూపాయల విలువైన లిథియం అయాన్‌ బ్యాటరీలు కొనుగోలు చేసింది. నిరుడు ఈ వ్యయం దాదాపు రెట్టింపయింది. రాగల సంవత్సరాల్లో ఇదింకా పెరగటం ఖాయం. కనుకనే లిథియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘా లయల్లో 20 ప్రాజెక్టులు ప్రత్యేకించి లిథియం కోసమే పనిచేస్తున్నాయి. ఇవిగాక మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఖనిజ్‌ బిదేష్‌ ఇండియా(కబిల్‌) పేరిట ఒక సంస్థ ఏర్పడి ఆస్ట్రేలియా, అర్జెంటీనా లిథియం గనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతోంది.

ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్‌లో అపారంగా లిథియం నిక్షేపాలున్నట్టు వెల్లడికావటం ఉత్సాహాన్నిచ్చేదే. ప్రపంచంలో భారీయెత్తున లిథియం నిల్వలున్న దేశం బొలీవియా అయితే...ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న చిలీ, ఆస్ట్రేలియా, చైనాల తర్వాత మనమే. రాశిలో అమెరికా కన్నా కూడా మనం ఎక్కువే. ఈ నిక్షేపాల నాణ్యతనూ, వాస్తవ వినియోగ సామర్థ్యాన్నీ మరిన్ని పరీ క్షల తర్వాతగానీ పూర్తిగా నిర్ధారించలేమన్నది శాస్త్రవేత్తల మాట. ఇందుకు రెండేళ్ల సమయం పడు తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఉత్పత్తి మొదలుకావడానికి మరో అయిదారేళ్లు తప్పదు. ఈ ప్రక్రియంతా పర్యావరణ హితంగా జరగటం సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పుడు నిక్షేపాలు బయటపడిన ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో ఉంది.

పర్యావరణపరంగా వచ్చే ప్రమాదం గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరుచేసి దశాబ్దాలుగా జలవిద్యుత్‌ ప్రాజెక్టులూ, ఇతర నిర్మాణాలూ చేపట్టిన పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లోని జోషీ మ పట్టణం ఎలా కుంగిపోతున్నదో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. భూకంప ముప్పు రీత్యా హిమాలయ పర్వత ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. లిథియం నిక్షేపాల వెలికితీత ఆ ముప్పును మరింత పెంచేలా మారకూడదు. ఉక్కు తెరల వెనక కాలక్షేపం చేసే చైనాలో లిథియం వెలికితీత వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా వెనకబడిన దక్షిణ అమెరికా దేశాల్లో జనం ఎదుర్కొంటున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఒక టన్ను లిథియం ఉత్పత్తికి 22 లక్షల లీటర్ల నీరు అవసరం కావటంతో చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో స్థానికంగా ఉన్న జలవన రులన్నీ హరించుకుపోతున్నాయి. నేల, చెట్టూ, చేమా దెబ్బతింటున్నాయి. దాంతో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా పర్యావరణాన్ని కాటేసే లిథియంకు బదులు తక్కువ నష్టం ఉండే ఇనుము, సిలికాన్‌ వంటి లోహాలపై దృష్టిపెట్టాలన్న డిమాండ్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఊపందు కుంది. ఏదేమైనా జమ్మూ, కశ్మీర్‌ లిథియం నిక్షేపాల విషయంలో ఆచితూచి అడుగేయటం అన్ని విధాలా శ్రేయస్కరం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement