వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి.
ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో జమ్మూ-కశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ!
ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment