Mining activity
-
చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జమ్మూ-కశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ! ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఐదేళ్లు..ఐదొందలకోట్లు.!
సాక్షి, నెల్లూరు: గూడూరు డివిజన్లోని సముద్రతీర ప్రాంతంలో చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సిలికా భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా భూముల్లో ఉన్న సిలికాపై జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్‌కుమార్ కన్నేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మైనింగ్‌కు అనుమతులు ఉన్న యజమానుల వద్ద లీజుల పేరుతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చిల్లకూరు మండలంలో సుమారు 60 మైన్లు, కోట మండలంలో సుమారు 11 మైన్లను లీజుకు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే కొన్నింటికి కాలపరిమితి మించిపోయి ఉండగా కొన్నింటికి ఇంకా పదేళ్ల వరకు తవ్వకాలు చేసుకునే వీలుంది. దీనిని ఆసరా చేసుకున్న అధికారపార్టీ నాయకులు లీజుదారులను ప్రలోభపెట్టి వారి మీదనే మైన్లు ఉండగా అగ్రిమెంట్లు మీద మైన్లు సొంత చేసుకున్నారు. రూ.500 కోట్ల దోపిడీ సిలికా మైన్స్ లీజు పేరుతో కొన్ని, కాలపరిమితి అయినపోయిన మరికొన్ని మైన్స్ యజమానులను అదిరించి, బెదిరించి సొంతం చేసుకున్న అధికారపార్టీ నేతలు ఐదేళ్లపాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. మైన్‌లో పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలతోపాటు చెరువులను తలపించేలా భారీ యంత్రాలతో తవ్వేశారు. మొత్తం మీద 71 మైన్స్ ద్వారా సిలికాను తవ్వేసి నిత్యం 500 వాహనాలతో తరలించేవారు. చెన్నై, బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్, పూనే ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు తరలించేవారు. దీంతోపాటుç పక్క రాష్ట్రాల్లో పెద్ద భవంతుల నిర్మాణాలకు ఇసుక బదులుగా సిలికాను తరలించి సొమ్ము చేసుకున్నారు. సిలికా ఇసుకను పోలి ఉండడంతో దీనిని ఇసుకగా చూపి విక్రయించారు. దీంతో ఇక్కడ టన్ను రూ.600 వంతున దొరికే సిలికాను పక్క రాష్ట్రాల్లో టన్ను రూ.3 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోజుకు సుమారు 500 లారీల వరకు సిలికాను తరలించేవారు. ఇలా ఐదేళ్లపాటు సిలికా తరలింపు ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు నేతల జేబుల్లోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో గనులశాఖ అధికారులు సైతం సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేసి వారిచ్చే నెలవారీ మామూళ్లతో సరిపెట్టుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు తూట్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు తూట్లు పొడిచేలా సిలికా మైన్స్‌లో దోపిడీ సాగింది. అనుమతులు ఉన్న మైన్స్‌కు హద్దులు ఏర్పాటు చేసి 10 అడుగులకు మించి తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అధికారపార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కావడంతో వారు నిబంధనలు పాటించకున్నా అధికారులు పట్టించుకోలేదు. 10 అడుగులకు మించి గోతులు తీయకూడదనే నిబంధన ఉన్నా 40 అడుగుల తోతైన గుంతలు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. అంతేకాదు కాలుష్యం వెదజల్లి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సాగు, తాగునీటికి కటకట సిలికా గనుల నుంచి వచ్చే ఊట నీటితో సొనకాలువలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. టీడీపీ పెద్దలు గనులను లీజులు తీసుకున్న తరువాత మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు అందించే 13 సొన కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో దాదాపు ఆయా కాలువల ద్వారా సాగయ్యే 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లపాటు కాలువలు ఎండి ఆ ప్రాంత రైతుల భూముల్లో పంటలు సాగు చేసుకోలేకపోయారు. సాగునీరుతోపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డారు. వేసవి వస్తుందంటే తాగునీటికి ఆయా గ్రామస్తుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. -
పర్మిట్లు తక్కువ.. తోలేది ఎక్కువ
జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు టిప్పర్లు.. ఆరు లారీలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం ఏటికేడు తగ్గిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం.. పట్టింపులేని తనంతో మైనింగ్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా పర్మిట్లు పొంది రూ.కోట్లు విలువ చేసే ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను కట్టడి చేయాల్సిన అధికారులు కొందరు జేబులు నింపుకునే పనిలో పడటంతో భూగర్భ గనుల శాఖ వసూళ్ల లక్ష్యసాధనలో వెనుకబడింది. అనంతపురం టౌన్ :జిల్లాలో 320 పైగా క్వారీలు నిర్వహిస్తుండగా.. వీటిలో గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలు ఉన్నాయి. వీటిపై నిత్యం నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన గనుల శాఖ అధికారులు.. కేవలం జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఖజానాకు చేరాల్సిన డబ్బు పక్కదారిపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కరువు క్వారీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ బ్లాక్‌లకు పర్మిట్లు పొంది ఎక్కువ మొత్తంలో గ్రానైట్ తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వాస్తవానికి గనుల శాఖఅధితాకారులు క్వారీలను ఎప్పటికప్పుడు పరిశీలించి... తీసుకున్న పర్మిట్లు ఎంత...? ఎన్ని క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్ తరలించారనే దానిపై నివేదిక తయారు చేయాల్సి ఉంది. అయితే గనులశాఖ అధికారులు మాత్రం క్వారీల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ క్షేత్రస్థాయికి వెళ్లకుండా దాటవేస్తున్నారు. దీంతో క్వారీ నిర్వహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్రమంగా అత్యంత విలువైన గ్రానైట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏటికేడు తగ్గిపోతున్న ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో గనులశాఖ ఆదాయం ఏటికేడు తగ్గిపోతోంది. మూడేళ్ల రికార్డును పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.56.64 కోట్ల లక్ష్యాన్ని ఉన్నతాధికారులు నిర్దేశించారు. జిల్లా అధికారులు లక్ష్యాన్ని అధిగమించి రూ.62.72 కోట్లు వసూళ్లు చేశారు. దాదాపు 10 శాతం అదనపు ఆదాయాన్ని సమకూర్చారు. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరాన్ని పరి«శీలిస్తే రూ.74 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా... రూ.59 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల లక్ష్యాన్ని విధించగా...ఫిబ్రవరి నెల వరకు రూ.54 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేసి 67 శాతం ప్రగతి సాధించారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా రూ.26 కోట్లు రాబట్టాల్సి ఉంది. గడచిన 11 నెలల కాలంలో కేవలం రూ.54 కోట్లు మాత్రమే రాబట్టిన అధికారులు ఈనెల రోజుల్లో రూ.26 కోట్లు వసూళ్లు చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ క్వారీలపైకొరడా పర్మిట్లు తక్కువ తీసుకొని ఎక్కువ ఖనిజాన్ని తరలిస్తున్న క్వారీల నిర్వాహకులపై అ«ధికారులు చర్యలు చేపట్టకపోవడంతోనే గనులశాఖ ఆదాయం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మనహాల్ మండలంలో కొందరు క్వారీ నిర్వాహకులు తీసుకున్న లీజులో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు ఏడాది కాలంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు అసలు గుర్తించలేకపోయారంటే క్వారీలను ఏమాత్రం పర్యవేక్షిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడి క్వారీలపై అనునిత్యం పర్యవేక్షించి కొరడా ఝులిపించి ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టాల్సిన అవసరం ఉంది. కాసుల కక్కుర్తితో... భూగర్భ గనులశాఖలోని కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి..ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. క్వారీ నిర్వాహకులు ఇచ్చింది తీసుకుని...క్వారీకి వెళ్లకుండానే నివేదికలు తయారు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ఖనిజాన్ని తరలిస్తున్న క్వారీ యజమానులు నామమాత్రంగా పర్మిట్లు, రాయల్టీలు పొందుతున్నా... అధికారులు కళ్లు మూసుకుని సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు చుట్టపుచూపుగా కార్యాలయానికి రావడం... పనులు ముగించుకొని వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే భూగర్భ గనుల శాఖ పనితీరు అధ్వానంగా తయారైనట్లు అక్కడున్న సిబ్బందే చెబుతున్నారు. లక్ష్యాన్ని చేరుకుంటాం ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చినెలాఖరులోపు రూ.80 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పటికే అక్రమ క్వారీలను గుర్తించి నోటీసులను జారీ చేశాం. కొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.. ఉత్తర్వులు రాగానే వాటిని సీజ్ చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి,గనులశాఖ ఇన్చార్జ్ ఏడీ -
కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు
సాక్షి,తాడేపల్లిరూరల్: ‘మళ్లీ ఎప్పుడు అవకాశం వస్తుందో.. అందినకాడికి దోచుకుందాం.. అది ప్రమాదమైతే మనకేంటి.. ప్రభుత్వాలకు, ప్రజలకు నష్టం జరిగితే మాకేంటి.. మనం సుఖంగా ఉన్నామా లేదా..’ అనే భావనతో టీడీపీలోని ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు, వారి అనుచరులు వ్యవహరిస్తున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉచిత ఇసుక పేరుతో రోజూ కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకుంటున్నారు. అంతటితో ఆగక నిషిద్ధ ప్రదేశాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రశ్నించకపోవడంతో తవ్వకూడని ప్రదేశాల్లో కూడా తవ్వుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి గుంటూరు జిల్లా వైపునకు 133కె.వి. విద్యుత్ లైన్ల టవర్లను కృష్ణానదిలో నిర్మించారు. ఆ టవర్లు నిర్మించిన ప్రాంతంలో ఇసుక ఎక్కువ మేట వేయడంతో అక్కడ కూడా డ్రెడ్జర్లను ఉపయోగించి భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి కృష్ణానదిలో పడవకు అమర్చిన డ్రెడ్జర్ నుంచి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే 50 టన్నుల వరకు ఇసుక తీయవచ్చు. అదేపనిగా కొంతమంది పడవ యజమానులు ఇసుక క్వారీ నిర్వాహకులు నాణ్యమైన ఇసుక కోసం గప్‌చుప్‌గా టవర్లకు అతి సమీపంలో ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. డ్రెడ్జర్‌తో ఇసుక తోడేటప్పుడు ఒకేచోట 20 నుంచి 30 అడుగుల గొయ్యి ఏర్పడుతుంది. ఇలా టవర్ల వెంబడి ఇసుక తవ్వకాలు నిర్వహించడం వల్ల వరదలు వచ్చిన సమయంలో ఇసుక తీసిన చోట ఆ గోతుల్లో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన సమయంలో ఒక్కోసారి ఆ గొయ్యి మరింత లోతుకు వెళ్లి, విద్యుత్ టవర్ల కింద ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మలను కోతలకు గురిచేయడమే కాకుండా, వాటి పునాదులు కూడా కదులుతాయి. ప్రస్తుతం కొన్ని సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఈ పునాదులు నీటి అడుగు భాగం నుంచి 15 నుంచి 30 అడుగుల లోపు ఏర్పాటు చేశారు. అప్పుడు కృష్ణానది ఇసుక మట్టాన్ని బట్టి వాటిని ఏర్పాటు చేసినట్లు 133కె.వి. సెక్షన్లో పనిచేసే ఓ సీనియర్ ఇంజనీర్ తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక తవ్వకాలను నిలిపివేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టవరు కనుక కుంగితే వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు సైతం తెగిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆ వైర్లు నీటిపై పడితే చాలా ప్రమాదమని, అలాంటి చోట మైనింగ్‌శాఖ అధికారులు తవ్వకాలు నిలిపివేయడం మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
జిల్లాలో 570 మైనింగ్ లీజుల రద్దుకు సిఫార్సు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 570 గనుల లీజులను రద్దు చేయాలని జిల్లా భూగర్భ గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడంతోపాటు నిర్ధిష్ట కాలంలో రిటర్న్‌లు సమర్పించకపోవడం, ఖనిజం తవ్వకాలు చేపట్టకపోవడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లా పరిధిలోని 3,321 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. జిల్లా భూగర్భగనుల శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు సోమవారం జిల్లాకు చెందిన మూడు లీజులను ప్రభుత్వం ఖనిజ రాయితీల చట్టం (1960)లోని సెక్షన్ 28 (1) కింద రద్దు చేసిన విషయం విదితమే. నిబంధనలు పాటించని గనుల లీజులను రద్దు చేయాలంటూ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించి అధిక మొత్తంలోనే లీజులు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని నిబంధనలు పాటించని మిగిలిన గనుల లీజులు రద్దయ్యే అవకాశమున్నట్లు సమాచారం. మైనింగ్ లీజుల వివరాలు.. చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, మదనపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాలలో గ్రానైట్, రోడ్డు మెటల్, గ్రావెల్ గనులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చిత్తూరు భూగర్భగనుల శాఖ కింద 36 మండలాల పరిధిలో మేజర్ మినరల్‌కు సంబంధించి 22 క్వార్జ్ గనుల లీజులుండగా, వాటిలో నాలుగు మాత్రమే ప్రస్తుతం వర్కింగ్‌లో ఉన్నాయి. 18 లీజులకు సంబంధించిన గనుల్లో ఎటువంటి పనులు జరగడం లేదు. మైనర్ మినరల్‌కు సంబంధించి గ్రానైట్, రోడ్ మెటల్ తదితర గనుల లీజులు 521 ఉండగా 173 గనులలో పనులు జరగడం లేదు. ఈ డివిజన్ పరిధిలో వివిధ రకాలకు సంబంధించి మొత్తం 694 లీజుల్లో 173 గనుల్లో పనులు జరగడం లేదు. ఈ మొత్తం గనులకు సంబంధించి దాదాపు 1940 హెక్టార్ల ప్రభుత్వం భూములను కేటాయించింది. గంగవరం భూగర్భగనుల శాఖ పరిధిలోని 30 మండలాల్లో మేజర్ మినరల్ క్వార్జ్, గ్రానైట్, రోడ్ మెటల్ మొత్తం కలిపి 803 లీజులుండగా, ఇందులో 406 మాత్రమే వర్కింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 397 లీజులు నాన్ వర్కింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 570 మైనింగ్ లీజులు నాన్ వర్కింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికోసం గంగవరం పరిధిలో ప్రభుత్వం 1381 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయించింది. నిబంధనలు ఇలా.. మేజర్ మినరల్స్ క్వార్జ్ గనులకు సంబంధించి రెండు సంవత్సరాలుగా నాన్వర్కింగ్లో ఉంటే లీజు రద్దు చేయవచ్చు. మొదట భూగర్భ శాఖాధికారులు లీజుదారునికి నోటీసులు అందజేస్తారు. తరువాత లీజుదారుడు ప్రభుత్వానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. సమాధానం సంతృప్తికరంగా లేకుంటే డెరైక్టర్ ఆఫ్ మైన్స్ (డీయంజీ)కు లీజు రద్దు చేసే అధికారం ఉంది. గ్రానైట్ గనుల లీజులకు సంబంధించి ఆరునెలలుగా పర్మిట్ తీసుకోకపోయినా, రెండేళ్లు నాన్ వర్కింగ్‌లో ఉన్నా, ప్రతి సంవత్సరం డెడ్ రెడ్ (స్థిర అద్దె) కట్టకపోయినా ఏడీ మైన్స్ ప్రతిపాదనల మేరకు నోటీసు, సమాధానం పద్ధతిలోనే లీజు రద్దు చేసే అధికారముంది. రోడ్డు మెటల్స్, గ్రావెల్స్కు ఆరు నెలలుగా పర్మిట్లు తీసుకోకపోయినా, ఏడాది పాటు డెడ్ రెడ్ చెల్లించకపోయినా, నాన్ వర్కింగ్‌లో ఉన్నా లీజును రద్దు చేసే అధికారం ఉంది.