బొమ్మనహాళ్ మండలంలోని ఓ క్వారీలో తవ్వకాలు చేస్తున్న దృశ్యం
జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు టిప్పర్లు.. ఆరు లారీలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం ఏటికేడు తగ్గిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం.. పట్టింపులేని తనంతో మైనింగ్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా పర్మిట్లు పొంది రూ.కోట్లు విలువ చేసే ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను కట్టడి చేయాల్సిన అధికారులు కొందరు జేబులు నింపుకునే పనిలో పడటంతో భూగర్భ గనుల శాఖ వసూళ్ల లక్ష్యసాధనలో వెనుకబడింది.
అనంతపురం టౌన్ :జిల్లాలో 320 పైగా క్వారీలు నిర్వహిస్తుండగా.. వీటిలో గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలు ఉన్నాయి. వీటిపై నిత్యం నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన గనుల శాఖ అధికారులు.. కేవలం జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఖజానాకు చేరాల్సిన డబ్బు పక్కదారిపడుతోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు
క్వారీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ బ్లాక్‌లకు పర్మిట్లు పొంది ఎక్కువ మొత్తంలో గ్రానైట్ తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వాస్తవానికి గనుల శాఖఅధితాకారులు క్వారీలను ఎప్పటికప్పుడు పరిశీలించి... తీసుకున్న పర్మిట్లు ఎంత...? ఎన్ని క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్ తరలించారనే దానిపై నివేదిక తయారు చేయాల్సి ఉంది. అయితే గనులశాఖ అధికారులు మాత్రం క్వారీల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ క్షేత్రస్థాయికి వెళ్లకుండా దాటవేస్తున్నారు. దీంతో క్వారీ నిర్వహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్రమంగా అత్యంత విలువైన గ్రానైట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఏటికేడు తగ్గిపోతున్న ఆదాయం
అధికారుల నిర్లక్ష్యంతో గనులశాఖ ఆదాయం ఏటికేడు తగ్గిపోతోంది. మూడేళ్ల రికార్డును పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.56.64 కోట్ల లక్ష్యాన్ని ఉన్నతాధికారులు నిర్దేశించారు. జిల్లా అధికారులు లక్ష్యాన్ని అధిగమించి రూ.62.72 కోట్లు వసూళ్లు చేశారు. దాదాపు 10 శాతం అదనపు ఆదాయాన్ని సమకూర్చారు. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరాన్ని పరి«శీలిస్తే రూ.74 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా... రూ.59 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల లక్ష్యాన్ని విధించగా...ఫిబ్రవరి నెల వరకు రూ.54 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేసి 67 శాతం ప్రగతి సాధించారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా రూ.26 కోట్లు రాబట్టాల్సి ఉంది. గడచిన 11 నెలల కాలంలో కేవలం రూ.54 కోట్లు మాత్రమే రాబట్టిన అధికారులు ఈనెల రోజుల్లో రూ.26 కోట్లు వసూళ్లు చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అక్రమ క్వారీలపైకొరడా
పర్మిట్లు తక్కువ తీసుకొని ఎక్కువ ఖనిజాన్ని తరలిస్తున్న క్వారీల నిర్వాహకులపై అ«ధికారులు చర్యలు చేపట్టకపోవడంతోనే గనులశాఖ ఆదాయం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మనహాల్ మండలంలో కొందరు క్వారీ నిర్వాహకులు తీసుకున్న లీజులో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు ఏడాది కాలంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు అసలు గుర్తించలేకపోయారంటే క్వారీలను ఏమాత్రం పర్యవేక్షిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడి క్వారీలపై అనునిత్యం పర్యవేక్షించి కొరడా ఝులిపించి ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టాల్సిన అవసరం ఉంది.
కాసుల కక్కుర్తితో...
భూగర్భ గనులశాఖలోని కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి..ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. క్వారీ నిర్వాహకులు ఇచ్చింది తీసుకుని...క్వారీకి వెళ్లకుండానే నివేదికలు తయారు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ఖనిజాన్ని తరలిస్తున్న క్వారీ యజమానులు నామమాత్రంగా పర్మిట్లు, రాయల్టీలు పొందుతున్నా... అధికారులు కళ్లు మూసుకుని సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు చుట్టపుచూపుగా కార్యాలయానికి రావడం... పనులు ముగించుకొని వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే భూగర్భ గనుల శాఖ పనితీరు అధ్వానంగా తయారైనట్లు అక్కడున్న సిబ్బందే చెబుతున్నారు.
లక్ష్యాన్ని చేరుకుంటాం
ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చినెలాఖరులోపు రూ.80 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పటికే అక్రమ క్వారీలను గుర్తించి నోటీసులను జారీ చేశాం. కొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.. ఉత్తర్వులు రాగానే వాటిని సీజ్ చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి,గనులశాఖ ఇన్‌చార్జ్ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment