జమ్ము కశ్మీర్‌లో లిథియం గనులు బయటపడిన విషయం తెలిసిందే. దక్షిణాన కర్ణాటకలోని మండ్యలో దాదాపు 1600 టన్నుల లిథియం నిక్షేపాలున్నట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఏంటీ.. అదేమన్నా బంగారమా? అంటారా.. బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్ పవర్ యూనిట్..చివరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. దాంతో ఏటా వేలకోట్లు వెచ్చించి విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. అలాంటిది తాజాగా మనదేశంలోనే దాని నిక్షేపాలు బయటపడుతుండటం విశేషం.
కరెంటు లేకపోయినా సెల్ ఫోను పనిచేస్తుంది. కారణం అందులో బ్యాటరీ ఉంటుంది. ఫోను ఒక్కటే కాదు; ల్యాప్‌టాప్, డిజిటల్ కెమెరా, ఎమర్జెన్సీ లైట్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రిక్ స్కూటర్, రోబో క్లీనర్.. ఇలా ప్రస్తుతం వాడే మరెన్నో పోర్టబుల్, స్మార్ట్ పరికరాలను చార్జింగ్ చేస్తూనే ఉంటారు.
కరెంట్ ప్రతి సమయాల్లో, ప్రతి ప్రదేశాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్ బ్యాటరీలే.
రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్దసైజులో తయారైన మొబైల్ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారవడమే అందుకు కారణం. కారుకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే అది 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది.
అసలేమిటీ లిథియం?
ఇనుము, బంగారం, వెండిలాగే ఇదీ ఒక లోహం. ‘లిథోస్’ అంటే గ్రీకు భాషలో ‘రాయి’ అని అర్థం. చూడటానికిది వెండి రాయి లాగా కన్పిస్తుంది కానీ మెత్తగా ఉంటుంది. మండించినప్పుడు ఎర్రని మంట వస్తుంది. ఈ లోహాన్ని 1790లో బ్రెజిల్ దేశస్థుడు కనిపెట్టాడు. ఆ తర్వాత పలువురు రసాయన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా ముడిఖనిజం నుంచి లిథియంని వేరుచేసే విధానాన్ని తెలుసుకున్నారు.
వివిధ రూపాల్లో లభ్యం
సహజంగా ఇది వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిదరంగులోకి మారుతుంది. మంచి ఉష్ణ, విద్యుత్ వాహకం కూడా. చురుగ్గా స్పందిస్తుంది. నీటితో చర్య జరిపే గుణం ఉన్నందున ప్రకృతిలో లిథియం రూపంలో కాకుండా ఇతరపదార్థాలతో కలిసి భూమిమీదా, సముద్రంలోనూ ఇది దొరుకుతుంది. మండే స్వభావం ఉన్నందువల్ల దీన్ని ఏదైనా ఒక హైడ్రో కార్బన్ ద్రవంలో కానీ పెట్రోలియం జెల్లీలో కానీ ఉంచి భద్రపరుస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం సులువు.
వెలికితీయడం సవాలే..
ముడి లిథియంను బయటకు తీయడం అంత తేలికైన పనేమీ కాదు. వాణిజ్యపరంగా లిథియంని కార్బొనేట్ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో రెండు రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్‌తో కలిసి ఉంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలేవరకూ విశాలమైన మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. సముద్రతీరాల్లో ఎక్కువగా ఈ రూపంలో లభిస్తుంది. మనదేశంలో బాక్సైట్‌తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దాన్ని ఓపెన్ మైనింగ్ తరహాలో లోతుగా గోతులు తవ్వి వెలికి తీయాలి. అందుకోసం పరిసర ప్రాంతాల్లోని చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు లేదా డీజిల్ ఉపయోగిస్తారు.
ప్రయోజనాలివే..
- అల్యూమినియం, రాగి లాంటి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి లిథియం లోహాన్ని ఉపయోగిస్తారు.
- వివిధ పరికరాల్లో ఒకదానినొకటి రాసుకుంటూ కదిలే భాగాల మధ్య రాపిడిని తగ్గించే శక్తి లిథియంకి ఉండడంతో గ్రీజు లాంటి కందెనల తయారీలో వాడతారు.
- పింగాణీ, గాజు లాంటి వాటి మెల్టింగ్ పాయింట్‌ని తగ్గించే సామర్థ్యం లిథియంకి ఉంది. వాటి నాణ్యతనీ సామర్థ్యాన్నీ పెంచగలదు. దీన్ని ఆయా వస్తువుల తయారీ పరిశ్రమల్లో, శీతలీకరణ యంత్రాల్లో ఎక్కువగా వాడతారు.
- లిథియంని ఇతర లోహాలతో కలిపినప్పుడు తయారయ్యే మిశ్రధాతువులు చాలా తేలిగ్గానూ దృఢంగానూ ఉంటాయి.
- విమానాలూ అంతరిక్షనౌకలకు సంబంధించిన విడిభాగాల తయారీలో ఈ మిశ్రధాతు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. రక్షణ సంబంధ పరికరాల్లోనూ, సైకిల్ ఫ్రేములూ, వేగంగా ప్రయాణించే రైళ్ల తయారీలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
- తలనొప్పి, మూర్ఛ, మధుమేహం, కాలేయ, మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన ఔషధాల్లోనే కాక బైపోలార్ డిజార్డర్, కుంగుబాటు, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతలకు వాడే పలు మందుల్లోనూ లిథియం ఉంటుంది.
ఇదీ చదవండి.. అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్
- రీచార్జబుల్ కాని, వాడి పారేసే మామూలు బ్యాటరీల్లో(టీవీ, ఏసీ రిమోట్‌లలో వాడేలాంటివి) కూడా లిథియం ఉంటుంది.
- ఎరువుల తయారీలో సూక్ష్మపోషకంగా దీన్ని వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment