ఎలక్ట్రిక్ వాహన సదస్సులో పాల్గొన్న జయేశ్ రంజన్, బొలీవియా రాయబారి జె.జె.కార్టెజ్ తదితరులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద రానున్న ఈ కేంద్రాల్లో తొలి దశలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక గిగావాట్‌తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్ సామర్థ్యానికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారమిక్కడ నిర్వహించిన ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మూడు సంస్థల ద్వారా రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. నెల రోజుల్లో ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభమై, 9–15 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 200 ఎకరాల పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిని 900 ఎకరాల స్థాయికి చేరుస్తామని వివరించారు.
భాగ్యనగరిలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు..
హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు తిరిగే విషయమై పోలీసు శాఖతో చర్చిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, దీనిని తగ్గించడంలో భాగంగా కాలం చెల్లిన పాత త్రీవీలర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో రీప్లేస్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, బ్యాటరీల తయారీలో వాడే లిథియం నిక్షేపాలున్న బొలీవియాలో మైనింగ్ కోసం భారత కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే తమ దేశంతో చర్చలు జరుపుతున్నాయని భారత్‌లో బొలీవియా రాయబారి జె.జె.కార్టెజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment