చెట్ల పెంపకంపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పెంచి భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ బాధ్యతను మరిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఏం చర్యలు చేపట్టారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో సంబంధం లేదన్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్లుగా విచారణ సాగుతున్నా జీహెచ్‌ఎంసీ ప్రతివాదో.. కాదో.. కూడా తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించింది.
తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ‘పట్టణాలు, నగరాల్లో పార్కుల అవసరం ఎంతైనా ఉంది. ఉన్నవాటి పరిరక్షణతో పాటు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలి. చెట్లను కూడా అభివృద్ధి చేయాలి. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి’అని కోరుతూ హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెందిన కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. 2023, ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 749 హెక్టార్లలో 8.37 లక్షల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటని సీజే ప్రశ్నించగా...నగర అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, అయినా ఆ వివరాలు తెలుసుకుని చెబుతామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణలోగా దీనిపై నివేదిక అందజే యాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment