42.40 లక్షల మందికి ‘ఉపాధి హామీ’ | Upadhi Hamee Scheme Beneficiaries Are 42 Lakhs In Telangana | Sakshi
Sakshi News home page

42.40 లక్షల మందికి ‘ఉపాధి హామీ’

Published Tue, Jun 11 2019 4:11 AM | Last Updated on Tue, Jun 11 2019 4:11 AM

Upadhi Hamee Scheme Beneficiaries Are 42 Lakhs In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంటోంది. గడువులోగా లక్ష్యం చేరేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా ఇప్పటికే రూ. 947.2 కోట్లు ఖర్చు చేసి 5.70 కోట్ల పనిదినాలు కల్పించారు. గత నెలాఖరు వరకు రాష్ట్రంలోని 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.20 లక్షల మంది కూలీలకు పనులు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి 2018–19 సంవత్సరంలోనే అత్యధికంగా 25.20 లక్షల కుటుంబాలకు చెందిన 42.40 లక్షల మంది కూలీలకు పనులు ఇవ్వగా వారిలో 2,24,366 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించారు.

ఈ పనుల కోసం రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ అమలుపై గ్రామీణాభివృద్ధిశాఖ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ మండలి నాలుగో సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలను సమీక్షించారు. 2018–19లో తెలంగాణకు హరితహారంలో భాగంగా రూ. 688 కోట్లతో 11,933 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 11.43 కోట్ల మొక్కలు నాటారు. అలాగే రూ. 670 కోట్లతో 61,116 భూసార/నీటి పరిరక్షణ పనులు పూర్తి చేశారు. రూ. 46.7 కోట్లతో 2,031 శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టారు.

రూ. 470.8 కోట్లు ఖర్చు చేసి 22,037 సిమెంటు రోడ్లు వేశారు. రూ. 63.5 కోట్లతో 1,219 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, రూ. 14.86 కోట్ల వ్యయంతో 634 కొత్త అంగన్‌వాడీ భవనాలు నిర్మించారు. పనుల ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ నీటి గుంతలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదుల నిర్మాణం, ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డులు, పశువుల కొట్టాలు, మేకలు–గొర్రెల షెడ్లు, కూరగాయల పందిళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సి.హెచ్‌. మల్లారెడ్డి, ఉపాధి హామీ మండలి సభ్యులు గద్దల పద్మ, తుల ఉమ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్‌ మహెష్‌దత్‌ ఎక్కా ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఉపాధి అమల్లో ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల అమల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీలు క్రీయాశీలపాత్ర పోషించాలి. పంచాయతీల ఆదేశాల మేరకు పనుల గుర్తింపు, అమలు జరగాలి. గ్రామసభ ఆమోదించిన పనులనే చేపట్టాలి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీకి నివేదిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీపై ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయాలి.

ప్రతి గ్రామంలో తెలంగాణకు హరితహారం, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, పంట కాల్వలు, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శ్మశానాలు, మరుగుదొడ్లు, వంట గదులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల వంటి పనులు చేపట్టాలి. ఉపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణకు హరితహారంలో భాగంగా చింత, వేప చెట్లను విరివిగా నాటి వాటి సంరక్షణలో సర్పంచులను, కార్యదర్శులను భాగస్వాములను చేయాలి. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ భవనాలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement