
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళ, బుధవారాల్లో చేసిన ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గత సార్వత్రిక ఎన్నికలకు మించి భారీ మెజారిటీ సాధించాక జరిగిన తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా మోదీ మాట్లాడారు. ఇందులో సహజంగానే జార్ఖండ్‌లో ఇటీవల ఒక ఉన్మాద మూక ముస్లిం యువకుణ్ణి హతమార్చడం, ఉత్తరప్రదేశ్‌లో పసివాళ్ల ఉసురు తీస్తున్న మెదడువాపు వ్యాధి ప్రస్తావన తదితరాలున్నాయి.
మూకదాడి ఉదంతంపై ప్రధాని మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. మోదీ మాట్లాడటం అవసరమనడంలో సందేహం లేదు గానీ... అంతకన్నా ముఖ్యంగా దేశానికి అప్రదిష్ట తెస్తున్న ఈ తరహా దాడులకు పూర్తిగా అడ్డుకట్ట వేయడం ప్రధానం. ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో మోదీ గతంలో మాట్లాడారు. కానీ ప్రభుత్వాల్లో కదలిక ఉన్న దాఖలా లేదు. నిందితులను సత్వరం అరెస్టు చేయడంలోనూ, కఠినంగా వ్యవహ రించడంలోనూ అవి చొరవ చూపడం లేదు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కాస్త వెనకో, ముందో బెయిల్‌పై విడుదలవుతున్నారు. విచారణ పూర్తయిన కొన్ని కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లభించక నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.
మూకదాడుల విషయంలో పార్టీలు, పౌర సమాజ కార్యకర్తలు, వివిధ సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం ఏడాదిక్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో నిందితులను శిక్షించడానికి కఠినమైన చట్టం తీసుకురావాలని పార్లమెంటును కోరింది. అది వచ్చేలోగా ఆ మాదిరి దాడుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ముసాయిదా బిల్లు రూపకల్పనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల కమిటీని, మంత్రుల బృందాన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆ పని ఎంతవరకూ వచ్చిందో ఎవరికీ తెలియదు. మూకదాడులు మాత్రం యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే తీరుగా జరుగుతున్నాయి. పశువుల్ని తీసుకెళ్తున్న వాహనాలను గమనించి కొంతమంది వాటిని అడ్డగించడం, డ్రైవర్‌తోపాటు ఇతరుల్ని పట్టుకుని నెత్తురోడేలా కొట్టడం వీటన్నిటా కనిపిస్తుంది.
ఈ ఉదంతాల్లోని బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. తాజా ఉదంతంలో యువకుడు మోటార్ సైకిల్ అపహరించాడని మూక ఆరోపించింది. కానీ అతను అది నిజం కాదని ప్రాధేయపడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న అతనితో ఆ గుంపు బలవంతంగా ‘జైశ్రీరాం’, ‘జై హనుమాన్’ అనిపించింది. బుధవారం మధ్యప్రదేశ్ రాజ ధాని భోపాల్‌లో జరిగిన ఘటనా ఇటువంటిదే. బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌వర్గియా కుమారుడు గుంపును వెంటేసుకుని అక్రమ నిర్మాణాలను కూలగొట్టిస్తున్న పనిలో ఉన్న మున్సిపల్ అధికారిపై గూండాగిరీకి దిగాడు. క్రికెట్ బ్యాట్‌తో చావబాదాడు. విజయ్‌వర్గియా అతగాణ్ణి సమర్ధించడమే కాదు...‘అడగడానికి నువ్వెవరు, నువ్వేమైనా జడ్జీవా’ అంటూ ఒక పాత్రికేయుణ్ణి దబాయించారు.
పశువుల్ని తరలిస్తున్నారని లేదా గోమాంసం దగ్గరుంచుకున్నారని దాడులు చేయడంతో మొదలై, ఇప్పుడు ఇతర కారణాలతో దాడులు చేయడం వరకూ ఇవి పెరిగిపోయాయని, ఒక సంస్కృతిగా మారాయని అర్ధమవుతోంది. వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి. వాటి తీవ్రతనుబట్టి ఒక్కోసారి అవి హత్యలకు కూడా దారితీస్తాయి. కానీ మూక దాడులకు కారణమవుతున్న ఉదంతాలు అటువంటివి కాదు. పట్టుబడినవారు బతిమాలుతు న్నారు. చేతులెత్తి మొక్కుతున్నారు. కానీ ఉన్మాద మూకలకు అవేమీ పట్టడంలేదు. అవతలినుంచి కనీస ప్రతిఘటన కూడా లేనప్పుడు తోటి మనిషిని అంతమంది ఏకమై చంపడానికి ఎలా సిద్ధ పడతారో అనూహ్యం. ఈ అమానుషమైన ఉదంతాలు పునరావృతం కాకుండా నిరోధించడంలో విఫలమవుతున్నందుకు సహజంగానే జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారు. దాన్ని ఆ రాష్ట్రాన్ని నిందించడంగా, అవమానించడంగా మోదీ భావించనవసరం లేదు.
పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యలనూ, వీటినీ ఒకేలా పరిగణించాలనడం కూడా సరికాదు. రెండు రకాల దాడుల్లోనూ హత్యలు చోటుచేసుకుంటున్నా స్వభావరీత్యా మూకదాడులకూ, రాజకీయ కార ణాలతో పరస్పరం చేసుకునే దాడులకూ మధ్య వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్‌పై మోదీ చేసిన రాజకీయ విమర్శలకు ఆ పార్టీ జవాబు చెప్పుకునే స్థితిలో లేదు. ఆ పార్టీ ఏలుబడిలో దేశానికి సేవలందించిన పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల ఘనత గురించి ఏరోజైనా మాట్లాడారా అని ఆయన వేసిన ప్రశ్నకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. వారి వరకూ అవసరం లేదు... స్వతంత్రంగా ఆలోచించగలిగే కింది స్థాయి నాయకులను సైతం సంశయించడం, వారిని అవమానించడం, చివరకు వెళ్లగొట్టడం కాంగ్రెస్‌లో ఒక సంస్కృతిగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్నాక ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దీని పర్యవసానమే.
కాంగ్రెస్ పార్టీ అటు విజయాన్నయినా, ఇటు అపజయాన్నయినా స్వీకరించే స్థితిలో లేదని మోదీ చేసిన విమర్శలోనూ వాస్తవం ఉంది. అపజయానికి కారణాలేమిటో సమీక్షించుకుని, అవసరమైన దిద్దుబాటు చర్యలకు దిగకపోగా రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటానని భీష్మిం చుకుని కూర్చున్నారు. మరోపక్క ఈవీఎంల వల్లే బీజేపీ నెగ్గిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తు న్నారు. దేశం మరింతగా ఎదిగేందుకు పార్టీలకతీతంగా కలిసిరావాలని ప్రధాని అనడం స్వాగతించదగ్గదే. కానీ అందుకవసరమైన వాతావరణాన్ని కల్పించవలసిన ప్రధాన బాధ్యత అధికార పక్షానిదే. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమేరకు కృషి చేస్తుందో మున్ముందు చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment