
లక్నో: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి స్పందించారు. వెనుకబడిన అగ్ర కులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం మంచిదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె వర్ణించారు.
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఆమె ఇచ్చిన హామీను గుర్తుచేశారు. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రవర్ణ కులాల ఓట్లకు గాలం వేసేందుకే రిజర్వేషన్ల అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా సంబంధిత బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment