ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. రఫేల్ ఒప్పందం వివరాలు బయటకు తీసుకురావాలా ? వద్దా అనే అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు బయటకు వస్తే పరిస్థితి ఎలా మారు తుంది ? సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ? ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ వేడిని రగులుస్తోంది?
ధర.. దడ దడ
రఫేల్ ఒప్పందానికి బీజం 2000 సంవత్సరం వాజ్‌పేయి హయాంలో పడినప్పటికీ యూపీఏ హయాంలోనే ఒక కొలిక్కి వచ్చింది. 2007లో యూపీఏ ఈ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చివరికి 2011లో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఒక్కో విమానానికి దాదాపుగా రూ.526 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాకుండానే ఫ్రాన్స్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. ఆ తర్వాత భారత్‌లో కూడా ఎన్నికలు జరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం పరుగులు తీసింది. 126కి బదులుగా 36 విమానాల కొనుగోలుకే కేంద్రం ఒప్పందం ఖరారు చేసుకుంది. అయితే ధర విషయంలో గోప్యత పాటించింది. ఈ ఒప్పందం వివరాలు, విమానం ధరల్ని బయటపెడితే శత్రుదేశాలకు ఆయుధాలు, పరికరాల వివరాలు తెలిసిపోయి దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ వాటి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది.
యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు రూ.12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంది. కానీ 36 విమానాలకే రూ.59 వేల కోట్లు చెల్లించడానికి ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు రూ.1,638 కోట్లు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2016 విదేశీ మారకద్రవ్య మార్పిడి లెక్క ప్రకారం ఒక్కో యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని, అయితే పూర్తిస్థాయి ఆయుధాలు, ఏవియానిక్స్‌తో కూడిన ధరను వెల్లడిస్తే దేశ భద్రతకే ప్రమాదం అంటూ దాటవేశారు. ఇక పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్కో యుద్ధ విమానం ధర 15.5 కోట్ల యూరో(దాదాపు రూ.1275 కోట్లు)లు ఉండేదని, ఇప్పుడు ఏకంగా 40 శాతం పెరిగిపోయి 27 కోట్ల యూరోలకు (దాదాపు రూ.2,219 కోట్లు) చేరుకుందని వాదించారు. ఇలా ఇరుపక్షాల మ«ధ్య రఫేల్ ధరల యుద్ధం రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది.
ఆఫ్‌సెట్ కంపెనీ చేతులెత్తేస్తే?
అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని గట్టెక్కించడానికే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆఫ్‌సెట్ ఒప్పందానికి అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2008లో రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్‌ఏటీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకే రఫేల్ ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్ అప్పగించాల్సి ఉంది. కానీ మోదీ హయాంలో సీన్ మారింది. ముఖేశ్ ఆర్‌ఏటీఎల్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. అనిల్ రాత్రికి రాత్రి రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్ ఆర్‌డీఎల్ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని మరీ ఆర్‌డీఎల్‌కు కాంట్రాక్ట్ అప్పగించడమేంటని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి నిలదీస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వాదనల సమయంలో న్యాయమూర్తులు ఈ అంశంపైనే ప్రభుత్వ లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చలేకపోతే, విమానాల తయారీ చేపట్టలేకపోతే ఏం జరుగుతుంది? దేశ ప్రయోజనాల సంగతేంటి? అని న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే ఆఫ్‌సెట్ కంపెనీని ఒప్పందం నుంచి తప్పించవచ్చని దసో ఏవియేషన్‌కు జరిమానాలు కూడా విధించవచ్చని వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఫ్రాన్స్ చేతుల్లో ఏమీ ఉండదా ?
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిందేనని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం భారత్‌కు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’కు కుదిరిన ఒప్పందం మాత్రమే. యుద్ధ విమానాల సరఫరాలో ఏమైనా తేడాలొచ్చినా, దసో ఏవియేషన్ యుద్ధ విమానాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోయినా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు వహించదు. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఇవ్వాల్సిన సార్వభౌమ హామీ(సావరీన్ గ్యారంటీ) ఫ్రాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా రక్షణ శాఖ ఏమీ పట్టకుండా ఒప్పందంపై ముందుకు వెళితే న్యాయశాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ సర్కార్ కంఫర్ట్ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇంచుమించుగా సావరీన్ గ్యారంటీతో సమానమని కేంద్రం పేర్కొంటోంది. కానీ భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురైతే ఆ లేఖకు చట్టబద్ధత ఉండదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అది చెల్లుబాటుకాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా ఆత్మరక్షణలో కేంద్రం
అదే ఒప్పందం, అవే విమానాలు కానీ యూపీఏ నుంచి ఎన్డీయే హయాం వచ్చేసరికి ఎన్నో తేడాలు. ధర రెట్టింపు అయిందంటూ ఆరోపణలు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను పక్కన పెట్టారంటూ విమర్శలు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే దేశ ప్రయోజనాలను కాలరాశారంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు దీటైన జవాబులివ్వలేక కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కేంద్ర మంత్రులు చేసిన వాదనలన్నీ తప్పుడువేనని ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉండటంతో కేంద్రం ఇరుకున పడిపోతోంది. విమానం ధరలు వెల్లడిస్తామని తొలుత ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మాటమార్చి దేశ ప్రయోజనాల దృష్ట్యా గోప్యత తప్పదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని, అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా ఎందుకు ఎంపిక చేశారన్నదానికి, అది తమ పరిధిలో లేదని దసో ఏవియేషనే ఆ నిర్ణయం తీసుకుందని కేంద్రం వాదిస్తోంది.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ రిలయెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని బహిరంగంగానే చెప్పడంతో బీజేపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. హాల్‌కి యుద్ధ విమానాలు చేసే సామర్థ్యమే లేదంటూ నిర్మలా సీతారామన్ వాదించడంపై రాజకీయంగా రచ్చ జరిగింది. ఆ తర్వాత హాల్ మాజీ చైర్‌పర్సన్ సువర్ణ సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలనే తాము తయారు చేశామని ఈ బాధ్యతను అప్పగించినా చేసేవాళ్లమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కేంద్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. దీన్ని ఆయుధంగా చేసుకొని రాహుల్ హాల్ సిబ్బందితో సమావేశమై నైతిక మద్దతుని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఆ తర్వాత కోర్టులో కూడా న్యాయమూర్తుల నుంచి కేంద్రం గట్టి ప్రశ్నల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదన్న విషయంపై కూడా ఇప్పడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మొత్తమ్మీద రఫేల్ ఒప్పందం అవకతవకలు కోర్టుకి చేరడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలన్న నిర్ణయం కోర్టు తీసుకుంటే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రఫేల్ యుద్ధంలో కేంద్రంపై పైచేయి సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ ఒప్పందంలో లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి తమకే లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉంది.
యూపీఏ డీల్..
2007
మధ్యతరహా బహుముఖ యుద్ధ విమానాలు(ఎంఎంఆర్‌సీఏ) కొను గోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
ఆగస్టు 28, 2007
ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల సంస్థ దసో ఏవియేషన్ బిడ్ వేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన మిగ్–35, స్వీడన్‌సాబ్ జాస్–39 గ్రిపెన్, అమెరికా మార్టిన్ ఎఫ్–16, యూరో ఫైటర్ టైఫూన్ వంటి సంస్థలు కూడా బిడ్‌లు దాఖలు చేశాయి.
సెప్టెంబర్ 4, 2008
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్‌ఏటీఎల్) పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరితే దసో ఏవియేషన్, ఆర్‌ఏటీఎల్ సంయుక్తంగా యుద్ధ విమానాల తయారీ చేపట్టాలని ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి.
మే 2011
భారత వాయుసేన చేసిన షార్ట్ లిస్ట్‌లో రఫేల్, యూరోఫైటర్ జెట్స్ నిలిచాయి.
జనవరి 2012
బిడ్‌లను పరిశీలిస్తే దసో ఏవియేషన్ తక్కువ ధరని కోట్ చేసింది. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను అప్పటికప్పుడు పంపడానికి, మిగిలిన వాటిని దసో సహకారంతో హాల్ తయారు చేయాలని అంగీకారానికి వచ్చాయి.
మార్చి 13, 2014
రఫేల్ ధరలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దసో–హాల్ మధ్య పని విభజన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఒక అవగాహనకు రాలేకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లుగా చెబుతోంది.
ఎన్డీయే డీల్..
మార్చి 28, 2015
అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 10, 2015
ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌కు వెళ్లి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.
జూన్ 2015
126 యుద్ధ విమానాల టెండర్లను రక్షణ శాఖ అధికారికంగా వెనక్కి తీసుకుంది.
డిసెంబర్, 2015
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలన్ సహచరి, నటి అయిన జూలీ గయె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. రఫేల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసం క్విడ్‌ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి.
జనవరి 2016
ఫ్రాన్స్ అధ్యక్షుడి హోదాలో ఫ్రాన్సిస్ హోలన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఫేల్ ఒప్పందంపై ఇరుపక్షాలు సంత కాలు చేశాయి. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాలు సరఫరా చేయాల్సి ఉంది.
అక్టోబర్ 3, 2016
అనిల్ అంబానీ ఆర్‌డీఎల్, దసో ఏవియేషన్ జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్ ఒప్పందం విలువలో 50% పెట్టుబడుల్ని భారత్‌లో తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది.
ఫిబ్రవరి 2017
దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్‌ఎల్) అన్న పేరుతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment