ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు.
అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు.
మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు.
ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
Comments
Please login to add a commentAdd a comment