మళ్లీ మోదీనే రావాలి | Online survey says majority prefer Modi as PM for 2nd term | Sakshi
Sakshi News home page

మళ్లీ మోదీనే రావాలి

Published Sat, Nov 3 2018 4:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Online survey says majority prefer Modi as PM for 2nd term - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశమిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తేలింది. 63 శాతం పైగా మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తీకరించారు. వార్తా వెబ్‌సైట్‌ డైలీహంట్, డేటా అనలిటిక్స్‌ సంస్థ నీల్సన్‌ ఇండియాలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. దేశ విదేశాల్లో సుమారు 54 లక్షల మంది అభిప్రాయాల్ని ఆన్‌లైన్‌లో సేకరించి ఈ నిర్ధారణకు వచ్చాయి.

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాల్ని కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. ఈ అంచనాలు వృథా, నకిలీవని పేర్కొంది. ‘ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎన్డీయేకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు. అన్ని దారులు మూసుకుపోయాక తన అర్థ బలంతో ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తెచ్చి, అవి నిజమని నిరూపించాలనుకుంటోంది. ప్రజలే తిరస్కరించాక ఇలాంటి వృథా సర్వేలతో వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు.   

సర్వేలో ఏం తేలిందంటే..
► మోదీ పనితీరు, నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది. 2014తో పోలిస్తే మోదీ ప్రభుత్వంపై వారికి ఏమాత్రం విశ్వాసం సడలలేదు.
►  సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించేందుకు మోదీనే అందరి కన్నా ఎక్కువ అర్హుడని అభిప్రాయపడిన సుమారు 62 శాతం మంది. తరువాతి స్థానాల్లో రాహుల్‌ గాంధీ(17 శాతం), అరవింద్‌ కేజ్రీవాల్‌(8 శాతం), అఖిలేశ్‌ యాదవ్‌(3 శాతం), మాయావతి(2 శాతం) ఉన్నారు.
►  మోదీకి రెండోసారి ప్రధాని అయితే తమ భవిష్యత్తు బాగుంటుందన్న 50 శాతం మంది.
►  అవినీతి నిర్మూలనలో మోదీకి మద్దతుతెలిపిన సుమారు 60 శాతం మంది.
►  ఈ విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎక్కువ మద్దతు    పలికారు.
►  ఇతర వయో బృందాల కన్నా 35 ఏళ్లకు పైబడిన వారే మోదీకి అత్యధిక మద్దతు తెలిపారు.
►  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచగా, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ధోరణి      కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement