Nielsen India survey
-
మళ్లీ మోదీనే రావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశమిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తేలింది. 63 శాతం పైగా మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తీకరించారు. వార్తా వెబ్సైట్ డైలీహంట్, డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఇండియాలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. దేశ విదేశాల్లో సుమారు 54 లక్షల మంది అభిప్రాయాల్ని ఆన్లైన్లో సేకరించి ఈ నిర్ధారణకు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ అంచనాలు వృథా, నకిలీవని పేర్కొంది. ‘ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎన్డీయేకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు. అన్ని దారులు మూసుకుపోయాక తన అర్థ బలంతో ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తెచ్చి, అవి నిజమని నిరూపించాలనుకుంటోంది. ప్రజలే తిరస్కరించాక ఇలాంటి వృథా సర్వేలతో వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సర్వేలో ఏం తేలిందంటే.. ► మోదీ పనితీరు, నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది. 2014తో పోలిస్తే మోదీ ప్రభుత్వంపై వారికి ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ► సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించేందుకు మోదీనే అందరి కన్నా ఎక్కువ అర్హుడని అభిప్రాయపడిన సుమారు 62 శాతం మంది. తరువాతి స్థానాల్లో రాహుల్ గాంధీ(17 శాతం), అరవింద్ కేజ్రీవాల్(8 శాతం), అఖిలేశ్ యాదవ్(3 శాతం), మాయావతి(2 శాతం) ఉన్నారు. ► మోదీకి రెండోసారి ప్రధాని అయితే తమ భవిష్యత్తు బాగుంటుందన్న 50 శాతం మంది. ► అవినీతి నిర్మూలనలో మోదీకి మద్దతుతెలిపిన సుమారు 60 శాతం మంది. ► ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎక్కువ మద్దతు పలికారు. ► ఇతర వయో బృందాల కన్నా 35 ఏళ్లకు పైబడిన వారే మోదీకి అత్యధిక మద్దతు తెలిపారు. ► త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచగా, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ధోరణి కనిపించింది. -
నంబర్ వన్ ‘ఓయూ’
♦ దేశంలోని అన్ని రాష్ట్ర వర్సిటీల్లో అగ్రస్థానం ♦ ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సర్వేలో వెల్లడి హైదరాబాద్ : చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్ర యూనివర్సిటీల్లో ఉత్తమ వర్సిటీగా ఓయూ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేగాక దక్షిణ భారత్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీ లను వెనక్కినెట్టి ఓయూనే అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వీటితోపాటు దేశంలోని అన్ని కేంద్ర, డీమ్డ్ వర్సిటీల్లో ఐదో స్థానాన్ని సంపాదించింది. ఇటీవల ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వర్సిటీకి ఈ గౌరవం దక్కింది. ఓయూలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. వర్సిటీ గత కీర్తి, ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఆవిష్కరణలు, పరిపాలన, రిపోర్ట్స్, మౌలిక వసతులు, అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారని తెలిపారు. మిగతా వర్సిటీలతో పోల్చుకుంటే ఈ కేటగిరీల్లో వర్సిటీ మెరుగ్గా ఉండడంతోనే ఈ ఘనత సాధ్యపడిందన్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపక బృందానికి, సిబ్బందికి రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు. త్వరలో 300 పోస్టులు భర్తీ.. ఓయూలో త్వరలో 300 అధ్యాపక పోస్టులు భర్తీ కానున్నాయని రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ తెలిపారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని వెల్లడించారు. వర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కామర్స్ డీన్ అక్బర్ అలీఖాన్, యూజీసీ డీన్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.