నంబర్ వన్ ‘ఓయూ’
♦ దేశంలోని అన్ని రాష్ట్ర వర్సిటీల్లో అగ్రస్థానం
♦ ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్ర యూనివర్సిటీల్లో ఉత్తమ వర్సిటీగా ఓయూ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేగాక దక్షిణ భారత్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీ లను వెనక్కినెట్టి ఓయూనే అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వీటితోపాటు దేశంలోని అన్ని కేంద్ర, డీమ్డ్ వర్సిటీల్లో ఐదో స్థానాన్ని సంపాదించింది. ఇటీవల ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వర్సిటీకి ఈ గౌరవం దక్కింది. ఓయూలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు.
వర్సిటీ గత కీర్తి, ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఆవిష్కరణలు, పరిపాలన, రిపోర్ట్స్, మౌలిక వసతులు, అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారని తెలిపారు. మిగతా వర్సిటీలతో పోల్చుకుంటే ఈ కేటగిరీల్లో వర్సిటీ మెరుగ్గా ఉండడంతోనే ఈ ఘనత సాధ్యపడిందన్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపక బృందానికి, సిబ్బందికి రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు.
త్వరలో 300 పోస్టులు భర్తీ..
ఓయూలో త్వరలో 300 అధ్యాపక పోస్టులు భర్తీ కానున్నాయని రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ తెలిపారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని వెల్లడించారు. వర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కామర్స్ డీన్ అక్బర్ అలీఖాన్, యూజీసీ డీన్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.