![Modi Cabinet Expansion Likely To Be On July 7, Three Ex CMs May Get Chance - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/5/Untitled-4.jpg.webp?itok=ll45ybC1)
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
మరో 25 మందికి చోటు
ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్‌కు, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్ సింగ్‌లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి..
2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కనుంది. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులలో జీవీఎల్‌కుగానీ, టీజీ వెంకటేష్‌కుగానీ చాన్సు దక్కొచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment