‘చమురు’ ధరతో ఆటలు! | Editorial On Petrol Diesel Prices Increasing In India | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 12:26 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial On Petrol Diesel Prices Increasing In India - Sakshi

ఈమధ్య కాలంలో పైపైకి పోవడం తప్ప కిందకు దిగడం తెలియని పెట్రోల్, డీజిల్‌ ధరలు గురువారం హఠాత్తుగా రూటు మార్చుకుని తగ్గుముఖం పట్టాయి. ప్రతి లీటర్‌కూ వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ సుంకంలో రూ. 2.50 కోత విధించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటమే ఇందుకు కారణం. అంతేకాదు...రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తాము వసూలు చేసే వ్యాట్‌లో లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం వెనువెంటనే దాన్ని శిరసావహించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో వెళ్తే ఈ రెండింటి ధరలూ లీటర్‌కు రూ. 5 మేర తగ్గుతాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక పెట్రో ధరలు డజనుసార్లు పెరిగాయి. ఇలా పెరిగిన ప్రతిసారీ జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. గత నెల 11న విపక్షాలు భారత్‌ బంద్‌కు పిలుపునివ్వగా పుండు మీద కారం జల్లినట్టు అదే రోజు పెట్రో ధరలు మరికాస్త పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు బ్యారెల్‌  ధర 86 డాలర్లుంది. నాలుగేళ్లలో ఇది అత్యధికం. దీనికితోడు రూపాయి విలువ నానాటికీ దిగజారుతోంది.

డాలర్‌తో పోలిస్తే దాని ప్రస్తుత విలువ రూ. 73.81. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల పెంపు పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయి. సరుకు రవాణా చార్జీలు తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి రిజర్వ్‌బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతుంది. దాని ప్రభావం వల్ల వృద్ధి మందగిస్తుంది. ఇలా ఒకదానికొకటి ముడి పడి ఉండే అనేక పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అంతర్జాతీయ పరిణామాలవల్ల చమురు ధరలు తగ్గటం మొదలయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ 115 డాలర్లుంటే ఏడాది తిరిగేసరికల్లా అది 53.36 డాలర్లకు చేరుకుంది.

మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడతాం గనుక ఇలా ధరలు పడిపోవడం వల్ల ఒక్కసారిగా మన కరెంట్‌ అకౌంట్‌ లోటు తగ్గడం ప్రారంభించింది. లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం మొదలైంది. అయితే మోదీ ప్రభుత్వం చమురు ధరల తగ్గుదలను వినియోగదారులకు బదిలీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ పోయి భారీ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టింది. 2014 నవంబర్‌ మొదలు 2016 జనవరి వరకూ 9 సార్లు ఈ సుంకాన్ని పెంచింది. నిరుడు అక్టోబర్‌లో ఒక్క సందర్భంలో మాత్రం ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించింది. గత ఏడు నెలల్లో పెట్రోల్‌పై లీటర్‌కు దాదాపు రూ. 6, డీజిల్‌పై లీటర్‌కు దాదాపు 6.50 చొప్పున పెరిగింది. 

ఈ పెట్రో ధరల పెరుగుదలలో రాష్ట్రాల పాత్ర తక్కువేమీ కాదు. అవి వ్యాట్‌(విలువ ఆధారిత పన్ను) పేరుతో బాదుతుంటాయి. సరుకు విలువను బట్టి ఈ పన్ను విధిస్తారు గనుక కేంద్రం పెట్రో ధరలు పెంచినప్పుడల్లా రాష్ట్రాలకు పండగే. వ్యాట్‌ ద్వారా వాటి ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ వ్యాట్‌ అన్నిచోట్లా ఒకేలా లేదు. పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్‌ విధించే రాష్ట్రాల్లో అగ్ర స్థానం మహారాష్ట్రది. అది పెట్రోల్‌పై 38.11 శాతం, డీజిల్‌పై 24.78 శాతం వ్యాట్‌ వసూలు చేస్తోంది. పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్‌ 35.77 శాతం వ్యాట్‌ వసూలు చేస్తుండగా...డీజిల్‌పై మాత్రం అందరికన్నా ఎక్కువగా 28.08 శాతం వసూలు చేస్తోంది. కనుకనే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ. ప్రతి పెట్రోల్‌ బంక్‌ వద్దా పెట్రోల్, డీజిల్‌ ధరలతోపాటు ఆ ధరలో ఎవరి వాటా ఎంతో వివరంగా ప్రదర్శిస్తే అందరి వేషాలూ బయటపడతాయి.

ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆంధ్రప్రదేశ్‌ పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా విధించిన వ్యాట్‌ ద్వారా రూ. 1,208 కోట్లు ఆర్జిస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయన బృందం నివేదిక అంచనా వేసింది.  చమురుపై విధించే వ్యాట్‌ ద్వారా రూ. 10,800 కోట్లు ఆర్జించాలని  2018–19 బడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకోగా ఆ లక్ష్యానికి మించే ఆదాయం లభిస్తుందని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఒకపక్క జనంపై ఇలా ఎడాపెడా వ్యాట్‌ పేరుతో బాది భారీగా ఆదాయం గడిస్తూ బిచ్చం వేసినట్టు లీటర్‌కు రూ. 2 తగ్గించామని బాబు సర్కారు ఆర్భాటంగా గత నెలలో ప్రకటించింది. ఇప్పటివరకూ పొందిన ఆదాయాన్ని, ఆ రాష్ట్రం పెట్టుకున్న లక్ష్యాన్ని బేరీజు వస్తే పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 3, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 వరకూ తగ్గించవచ్చునని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక లెక్కేసింది. చమురుపై మొత్తంగా రాష్ట్రాల ఆదాయం రూ. 23,000 కోట్లు దాటుతుందని ఆ నివేదిక చెబుతోంది.  

ఇప్పుడు హఠాత్తుగా ధరల్ని తగ్గించడానికి త్వరలో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు, అటుపై వచ్చే సార్వత్రిక ఎన్నికలు కారణమని సులభంగానే అర్ధమవుతుంది.  కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకం రూ. 2.50లో కేంద్రం వాటా రూ. 1.50 మాత్రమే. మరో రూపాయిని చమురు సంస్థలు భరిస్తాయి. 2013 జనవరిలో అప్పటి యూపీఏ సర్కారు పెట్రోల్‌ ధరపై నియంత్రణ ఎత్తేసింది. ఇకపై అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఆ ధరలుంటాయని చెప్పింది. ఎన్‌డీఏ సర్కారు వచ్చిన వెంటనే డీజిల్‌పై కూడా నియంత్రణ తొలగించింది. ఆ విధానానికే కట్టుబడి ఉంటే ఈపాటికల్లా చమురు ధరలు బాగా తగ్గాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగంపై ఆధారపడి ఏటా లక్షల కోట్ల మేర ఆదాయం గడిస్తున్న తీరు సరికాదని గతంలో రంగరాజన్‌ కమిటీ హితవు పలికింది. ఇతరేతర రంగాల ద్వారా వనరులు పెంచుకోవాలని సూచించింది. కానీ ఆ కమిటీ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎక్సైజ్‌ సుంకం తగ్గించటం మంచిదే. కానీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చమురు ధరలు మరింత తగ్గేలా చూడాలి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement