సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరపైనా, 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం డీజిల్ ధరపైనా నియంత్రణ తొలగించినప్పుడు దేశ ప్రజలకు ఒకే రకమైన వాగ్దానం చేశాయి. ఇలా నియంత్రణ ఎత్తేయడం వల్ల మేలే తప్ప కీడు జరగదన్నదే దాని సారాంశం. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని ‘సాక్షి’ బుధవారం వెల్లడించిన కథనం స్పష్టం చేస్తోంది. గతంతో పోలిస్తే చమురు ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోతక్కువగానే ఉన్నా వాటికి అను గుణంగా ఇక్కడ ధరలు తగ్గటం లేదు సరికదా అవి పైపైకి పోతున్నాయని ఆ కథనం వివరించింది. అంతేకాదు... దేశంలో ఈ పెట్రో ధరల మంటను మిగిలిన వారి కంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే అధికంగా భరించవలసి వస్తున్నదని వెల్లడించింది. చమురు సంస్థలు ప్రతి పదిహేను రోజులకూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే విధానాన్ని నిరుడు జూన్ 16నుంచి తొలగించి, దాని స్థానంలో రోజువారీ సవరణను మొదలుపెట్టారు.
ఈ రోజువారీ ధరల సవరణలో ప్రభు త్వాలకు ఒక వెసులుబాటు ఉంది. రోజుకు కొన్ని చిల్లర పైసలు పెరగడాన్ని లేదా తగ్గడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ మొత్తంగా గత వారం కంటే రూపాయి లేదా అంతకన్నా ఎక్కువ పెరిగిందని, నెలక్రితం కంటే రూ. 2 పెరిగిందని గ్రహించినప్పుడు గుండెలు బాదుకోక మానరు. పెరిగే పెట్రో ధరలతో సమస్యేమంటే... అవి కేవలం ద్విచక్ర వాహనదారులనో, ఆటోలు, కార్లు, ట్రక్కులు ఉన్నవారినో తాకి ఊరుకోవు. కూరగాయలు, ఇతర నిత్యా వసరాలు మొదలుకొని సామాన్యులు కొనే ప్రతి వస్తువుపైనా ఆ పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి బతుకులు దుర్భరంగా మారతాయి. పెరిగే ధరలకనుగుణంగా కరువు భత్యం మారే ఉద్యోగులకు ఎంతో కొంత ఊరట దొరుకుతుంది. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని కోట్లాదిమంది బడుగు జీవుల పరిస్థితేమిటి? వారు బతకడమెలా? మన ప్రభుత్వాలు ఆ సంగతి ఆలోచిస్తున్నట్టు లేదు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరకూ, ఇక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలకూ ఏనాడూ పొంతన ఉండటం లేదు. 2013 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 113 డాలర్లు(సుమారు రూ. 7,200) ఉన్న ప్పుడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.07, డీజిల్ ధర రూ. 58.67 ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 69 డాలర్లకు (సుమారు రూ. 4,416) పడిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు అదే నిష్పత్తిలో తగ్గలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.47, డీజిల్ ధర రూ. 67.23 ఉంది. మన ప్రభుత్వాలు తమ విధానాల్లో ఉన్న లోపాలను సవ రించుకోవడానికి బదులు ఎప్పటికప్పుడు సామాన్యులపై భారాన్ని నెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడమంటే మన కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం, మన విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం. ఇంకా చెప్పాలంటే ద్రవ్యలోటు తగ్గడం.
పడిపోతున్న చమురు ధరల వల్ల ఇన్ని ఉపయోగాలున్నా సాధారణ పౌరులకు అందువల్ల కలుగుతున్న ప్రయోజనం ఏమీ లేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పుడు పన్నులు పెంచి ఇక్కడి ధరలను నామమాత్రంగా తగ్గించడం, ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆ భారాన్నంతటినీ ప్రజలపైన మోపడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను ఎన్నో రకాల అంశాలు ప్రభావితం చేస్తుం టాయి. కమోడిటీ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చే వ్యత్యాసాలు మొదలుకొని ముడి చమురుకుండే డిమాండ్ వరకూ వాటిల్లో ఎన్నో ఉంటాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలుముకున్నప్పుడూ, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడం లేదా తగ్గించడం చేసినప్పుడూ, మార్కెట్ లోకొచ్చే షేల్ చమురు పరిమాణం వగైరాలు చమురు ధరల్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ని సంక్లిష్టతలున్న అంతర్జాతీయ మార్కెట్‌కు మన చమురు ధరల్ని ముడి వేసి అంతా దాని ప్రకారం చేస్తామనడమే అన్యాయమనుకుంటే... రకరకాల పన్నులు, సుంకాలు జోడించి వాటిని మరింతగా పెంచడం క్షమిం చరాని విషయం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై వివిధ పన్నులు, సుంకాల ద్వారా రూ. 2.67 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రాష్ట్రాల వాటా 42 శాతమైతే, మిగిలింది కేంద్రం వాటా.
వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్, ఇతర సుంకాలు భారీగా వసూలు చేస్తున్నాయన్న సంగతి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పెట్రోల్ ధరలో ఈ రెండు రాష్ట్రాలూ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నాయి. డీజిల్ విషయానికొస్తే ఈ రెండుచోట్లే దాని ధర అధికం. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ కంటే కూడా విజయవాడలో రూ. 1.80 పైసలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న బంకుల్లో ‘ఆంధ్రప్రదేశ్‌లో రేట్లు ఎక్కువ. ఇక్కడే ట్యాంక్ నింపుకోండి’ అంటూ కటౌట్లు పెడుతున్నారంటే పరిస్థితేమిటో అర్ధమవుతుంది. దేశంలో నిత్యావసరాలను నలు మూలలకూ చేరేవేసే ట్రక్కులు డీజిల్‌తో నడిచేవే గనుక దాని ధర పెరిగినప్పు డల్లా ఆ ప్రభావం సామాన్యులపై పడుతుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటుంది.
పెట్రోల్ చార్జీలు పెరిగితే రవాణా చార్జీలపై ప్రభావం ఉంటుంది. ఏతా వాతా నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు భారీగా పెరిగి జనం విలవిలలాడ తారు. పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్నులు, సుంకాలు విధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం బతుకులతో ఆటలాడుకుంటున్న తీరు క్షంతవ్యం కాదు. ఏకీకృత పన్ను వ్యవస్థ అంటూ జీఎస్‌టీని అమల్లోకి తెచ్చి ఆర్నెల్లు దాటు తున్నా పెట్రో ఉత్పత్తులకు దాన్ని వర్తింపజేయకపోవడం న్యాయం కాదు. ఫక్తు వ్యాపార ధోరణికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్వస్తి చెప్పాలి. పెట్రో ధరల విధానాన్ని సవరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment