అందరం ఏకమై యూపీఏ సర్కారు పీడ విరగడ చేసుకున్నామని జనం సంబరపడి ఇంకా నెల్లాళ్లయినా కాలేదు... చార్జీల బాదుడులో తాను కూడా యూపీఏకు ఏమాత్రం తీసిపోనని ఎన్‌డీఏ ప్రభుత్వం రుజువుచేసుకుంది. ఉన్నట్టుండి శుక్రవారం రోజున ఒక్కసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా సరుకు రవాణా చార్జీలను కూడా 6.5 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తాయి. రేపో మాపో వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్నవారు అసలు చార్జీలే పెంచరాదని, అలా పెంచనివారే మంచి పాలకులని ఎవరూ వాదించరు. కానీ అందుకు ఒక పద్ధతంటూ ఉండాలని ఆశిస్తారు.
అలాంటి పద్ధతి పాటించకపోవడంలో యూపీఏ సర్కారు చరిత్ర జగ ద్విదితం. విషాదమేమంటే ఎన్‌డీఏ ప్రభుత్వానికి సైతం ఆ అడుగుజా డలే ఆదర్శమయ్యాయి. పార్లమెంటులో తనకున్న మెజారిటీకి ఎన్‌డీఏ ఇలా చేయాల్సిన అవసరం లేదు. అసలిది మెజారిటీ ఉండటం, లేకపోవడానికి సంబంధించింది కూడా కాదు. నైతికతకు సంబంధిం చిన అంశం. మెచ్చి మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు దిగ్భ్రమ కలిగించే విషయం. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటివారంనుంచి ప్రారం భం కావొచ్చని చెబుతున్నారు. ఆ సమావేశాల్లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. చార్జీల పెంపుతో సహా అన్ని ప్రతిపాదనలూ అప్పుడుండాలి. చట్టసభలంటే గౌరవమున్నా, ప్రజాస్వామ్యమంటే విశ్వాసం ఉన్నా చేయాల్సింది ఇదే. కానీ, బడ్జెట్‌కు ముందో, తర్వాతో ప్రజల నడ్డి విరిచి అటు తర్వాత చార్జీల ఊసే లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇటీవలికాలంలో అలవాటైంది. పర్యవసానంగా చార్జీల పెంపు సంగతి పార్లమెంటులో అసలు చర్చకే రాకపోవడమో లేదా మొక్కుబడి ప్రస్తావనగానో మిగిలిపోతున్నది.
అసలు ఎన్‌డీఏ సర్కారు చార్జీల విష యమై ఆదరాబాదరాగా వ్యవహరించిన తీరును ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రయా ణికుల చార్జీలు పెంచడం తప్పకపోవచ్చని ఆరు రోజులక్రితమే రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. గురువారం అధికారులతో మాట్లాడి నప్పుడు ఈ విషయంలో మరికొన్ని దఫాలు చర్చలు జరగాల్సివున్న దని మంత్రి చెప్పారంటున్నారు. అలా చెప్పి 24 గంటలు గడవక ముందే చార్జీల పెంపు ప్రకటన వెలువడింది. ఎందుకిలా జరిగిందో సదానందకే తెలియాలి. ‘నాకు ముందున్న రైల్వే మంత్రి చేసిన నిర్ణ యాలను అమలు చేయకతప్పలేదు. నేను చేసిందల్లా ఆయన పెండింగ్ లో పెడుతూ జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించడమే’అని సదా నంద లౌక్యంగా చెబుతున్నారు. యూపీఏ సర్కారు పరమ అస్తవ్య స్తంగా వ్యవహరించేదన్న కారణానే దాన్ని జనం కాదన్నారు. ఒకవేళ తామూ అదే తోవన వెళ్లకతప్పదని భావించే స్థితి బీజేపీకి ఉంటే ఆ సంగతి ఎన్నికల్లోనే చెబితే సరిపోయేది. ‘మాకూ వారికీ తేడా ఏం లేదు. చార్జీలు పెంచి కూడా దాన్ని అమలు చేయడానికి వారు భయపడ్డారు. మాకు ఓటేస్తే ఆ ప్రతిపాదనలను నిర్భయంగా అమలుచేస్తాం’ అని చెప్పివుండాల్సింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పార్లమెంటును లెక్కచేయని యూపీఏనే మాకూ ఆదర్శమని ప్రకటించాల్సింది. అప్పుడు ప్రజలు దానికి తగ్గట్టే వ్యవహరించేవారు.
గత రెండేళ్లనుంచి 5 శాతానికి మించకుండా మందగించిన వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థను స్వస్థపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ప్రధాని నరేంద్రమోడీ ఈమధ్యే చెప్పారు. ఎన్నికల్లో తమపై అపార ప్రేమను ప్రదర్శించిన ప్రజలు ఈ నిర్ణయాలకు కలవరపడినా ఫలితాలు చూశాక తిరిగి తమను ఇష్టప డతారని మోడీ అంటున్న మాటల్లోని నిజానిజాల సంగతలా ఉంచి... నిర్ణయాలు ఎలాంటివైనా వాటిని అమలుపరిచే తీరు సక్రమంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఊగిసలాడే పాలకులు పోయి నిర్ణయాత్మ కంగా వ్యవహరించేవారు రావాలని ప్రజలు ఆశించారు తప్ప ఇలా పెడ దోవన వెళ్లాలని కోరుకోలేదు. యూపీఏ పాలనలో రైల్వే శాఖ వట్టిపో యిందని, దాన్ని పట్టాలెక్కించాలంటే ఇది తప్పనిసరని ప్రభుత్వ పెద్దలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. నిరుడు జనవరిలో యూపీఏ సర్కారు రైల్వేచార్జీలను పెంచినప్పుడు ఆ నిర్ణయాన్ని విమ ర్శిస్తూ నరేంద్రమోడీ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇప్పుడొచ్చిన అధి కారం ఆ అభిప్రాయాన్ని ఎలా మార్చేయగలదో అనూహ్యం. పెంచిన చార్జీలవల్ల రూ. 8,000 కోట్ల ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. రవాణా చార్జీల పెంపువల్ల వివిధ సరుకుల ధరలు మరింత పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చవుతుంది. రైల్వేలు నష్టాల్లో కూరుకుపోయిన మాట వాస్తవమే. కానీ, అందుకు కారణాలు చాలా ఉన్నాయి.
ముఖ్యంగా రైల్వే మంత్రులుగా ఉన్నవారు లాభనష్టాలతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టుల్ని తమ రాష్ట్రాలకు తరలించుకుపోవడం... ప్రయాణికులు లేకున్నా, పైసా ఆదాయం రాకున్నా ప్రతిష్టకుపోయి దురంతోలు, సూపర్‌ఫాస్ట్‌లు తమ ప్రాంతాలకు మళ్లించడంవంటి చర్యలు రైల్వేలను కుంగదీశాయి. ఇవిగాక అడ్డూ ఆపూ లేకుండా చేసే వృథా వ్యయం అదనం. వీటన్నిటి పర్యవసానంగా రైల్వేలు సంపా దించే ప్రతి రూపాయిలో దాదాపు 89 పైసలు ఖర్చులకే పోతున్నాయి. జోన్లవారీగా చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ జోన్లలో ఆదాయ వ్యయాలు చెల్లుకు చెల్లవుతున్నాయి. అధికాదాయం తెస్తున్నది దక్షిణ మధ్య రైల్వేనే! వీటన్నిటినీ ఓపిగ్గా సమీక్షించి లోపాలు సరిచేయాల్సింది పోయి ఎప్పటిలా ప్రయాణికులను చావబాదడమే పరిష్కారమన్నట్టు ఎన్‌డీఏ సర్కారు వ్యవహరించింది. ఈ తరహా పోకడలు తమను నమ్ముకున్న ప్రజలకు చేటు కలిగిస్తాయని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.
ఇదేం బాదుడు?!
Published Sun, Jun 22 2014 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement