‘భూసేకరణ’పై పట్టుదల
మొత్తానికి ఈమధ్య వరసబెట్టి జారీచేసిన ఆర్డినెన్స్‌లను గట్టెక్కించుకోవడం లో ఎన్డీయే ప్రభుత్వం దాదాపు విజయం సాధించింది. ఆరు ఆర్డినెన్స్‌ల్లో అయిదిం టికి సంబంధించిన బిల్లులపై శుక్రవారంతో ముగిసిన బడ్జెట్ సమావేశాల తొలి దశలో ఉభయ సభల ఆమోద ముద్ర పడింది. భూసేకరణ చట్టానికి సవరణలు తెస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ఒక్కటే వచ్చే నెల 20నుంచి సాగే మలి దశ సమావేశాల్లో అవుననిపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు దేశంలోని అందరి దృష్టీ ఈ ఆర్డినెన్స్‌పైనే పడింది. రైతులు, అన్నా హజారేవంటి సామాజిక ఉద్యమ నేతలు, వివిధ పార్టీల నాయకులు దానికి వ్యతిరేకంగా తమ తమ స్థాయిల్లో ఇప్పటికే ఉద్యమిస్తున్నారు. అటు ఎన్డీయే సర్కారు ఆ ఆర్డినెన్స్‌పైనే తన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించి పని చేస్తున్నది. అందులోని కొన్ని అంశాలకు సంబంధించి బిల్లులో సవరణలకు సిద్ధపడ టంతోపాటు ‘ఫ్లోర్ మేనేజ్‌మెంట్’ను కూడా చాకచక్యంగా నిర్వహించి లోక్‌సభలో దాన్ని ఇప్పటికే ఆమోదింపజేసుకుంది. ఇక ఇప్పుడు విపక్షం బలంగా ఉన్న రాజ్య సభలో కూడా బిల్లును గట్టెక్కించాల్సి ఉంది.
ఆదివారం ఆకాశవాణి ద్వారా రైతులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 35 నిమిషాల ప్రసంగాన్ని వింటే భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర ప్రభు త్వం ఎంత పట్టుదలగా ఉన్నదో అర్ధమవుతుంది. ఆ చట్టంపై తప్పుడు ప్రచారం సాగుతున్నదని ఆయన చెప్పడంతోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రెండేళ్లక్రితం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలోని లొసుగులను కూడా ఎత్తిచూపారు. రైల్వేలు, మైనింగ్, జాతీయ రహదార్ల నిర్మాణంవంటి ప్రజాప్రయో జనం ముడిపడి ఉండే 13 అంశాల్లో ప్రభుత్వం భూమిని సేకరించే పక్షంలో నామమాత్రపు పరిహారాన్ని మాత్రమే ఆ చట్టం నిర్దేశించడాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పినదాంట్లో నిజముంది. ఆ అంశాన్నీ, దాంతోపాటు మరికొన్ని ఇతర విషయాలనూ కూడా అప్పట్లో సామాజిక ఉద్యమకారులు గట్టిగా వ్యతిరేకించారు. దురదృష్టమేమంటే...దాన్ని సరిచేయడానికి ముందుకొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మిగిలిన విషయాలను వదిలేయడమే కాక...పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చే కొన్ని కొత్త అంశాలను ఆర్డినెన్స్ ద్వారా జొప్పించింది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల నిమిత్తం సేకరించే భూములకు నాలుగు రెట్ల పరిహారాన్ని ఇస్తామ నడం బాగానే ఉన్నా....పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ, గ్రామీణ మౌలిక వసతుల వంటి ప్రయోజనాలకు భూమిని సేకరించినప్పుడు భూయజమానుల అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్ అంటున్నది. అలాగే...మెజారిటీ భూయజమానుల అంగీకారం, ఆయా ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) తప్పనిసరన్న 2013నాటి చట్ట నిబంధనలు నీరుగారాయి. సంఘ్ పరివార్ సంస్థలైన కిసాన్ సంఘ్ వంటివి కూడా ఇలాంటి మార్పులను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
దేశంలోని భూమి అంతటికీ రాజ్యమే అసలైన హక్కుదారన్న భావనే భూసేక రణకు ప్రధాన ప్రాతిపదిక. ఇది పూర్తిగా వలస పాలకులు ఈ దేశంలో ప్రవేశపెట్టిన తప్పుడు భావన. భారత్‌లో తమకు కావలసినంత భూమిని ఎలా పడితే అలా స్వాధీనం చేసుకోవడం కోసమే బ్రిటిష్ వలసపాలకులు దీన్ని మనపై రుద్దారు. ఇలా ఏకపక్షంగా చిత్తంవచ్చినట్టు భూమిని స్వాధీనం చేసుకునే పరిస్థితి బ్రిటన్‌లో మొదటినుంచీ లేదు. ఏదైనా ప్రత్యేకమైన ప్రయోజనం కోసం భూమిని సేకరించ వలసివస్తే దానికోసం విడిగా చట్టం చేయడం తప్ప సర్కారీ కబ్జాకు అక్కడ వీలుం డదు. తమ దేశంలో ఒక రీతిలో, తాము వలస ప్రాంతాలుగా చెరబట్టిన దేశాల్లో మరో రీతిలో వారు వ్యవహరించారు. 120 ఏళ్ల తర్వాత మొదటిసారి తీసుకొచ్చిన చట్టంలో యూపీఏ ప్రభుత్వంగానీ...మొన్నటి ఆర్డినెన్స్‌లో ఎన్డీయే ప్రభుత్వంగానీ దీన్ని సవరించడానికి ప్రయత్నించలేదు. పైగా భూసేకరణ చుట్టూ రేగుతున్న వివాదాన్ని అభివృద్ధికీ...అభివృద్ధిలేమికీ, రైతుకూ...పారిశ్రామికవేత్తకూ మధ్య వైరుధ్యంగా చూపుతున్నారు. ఇలా చేయడంలో విషయాన్ని పక్కదారి పట్టించే వ్యూహం ఉన్నది. దేశాన్ని అభివృద్ధి పరిచేందుకూ, పారిశ్రామికంగా ముందంజలో నిలిపేందుకూ తాము భూముల్ని సేకరించవలసివస్తున్నదని పాలకులు చెబుతారు. పారిశ్రామికవేత్తలు సైతం తమకు ప్రభుత్వం భూములు సమకూర్చిపెట్టకపోతే పరిశ్రమల స్థాపన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తారు. సారాంశంలో...భూసేకరణను వ్యతిరేకిస్తున్నవారిని అభివృద్ధిని అడ్డుకుంటున్నవారిగా జమకడతారు. అభివృద్ధి ఫలాలు నిజంగా సామాన్య రైతాంగానికి దక్కాలని ప్రభుత్వం అనుకున్నపక్షం లో... తమ భూముల్ని ఏం చేసుకోవాలో, పారిశ్రామికవేత్తలకు ఏ ధరకు అమ్ము కోవాలో నిర్ణయించే అధికారాన్ని రైతులకే విడిచిపెట్టాలి. వారి అభీష్టాన్ని కాదని చేసే భూ సేకరణవల్ల నిజమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యపడదని బెంగాల్‌లోని సింగూర్, నందిగ్రామ్ భూ పోరాటాలు నిరూపించాయి. ఆనాటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సింగూర్‌లో టాటాలకు భూసేకరణ చేసి ఇచ్చినా అక్కడ పరిశ్రమ స్థాపన వారికి అసాధ్యమైందని గుర్తుంచుకోవాలి. దేశంలో 676 జిల్లాలుంటే దాదాపు 165 జిల్లాల్లో జరిగిన భూసేక రణ వివాదాల నడుమ ఎటూ తేలకుండా ఉన్నదని మర్చిపోకూడదు. ‘ఫ్లోర్ మేనేజ్‌మెంటు’ చేసుకుని ఎలాంటి బిల్లులనైనా చట్టాలుగా మార్చుకునే సామర్థ్యం పాలకులకు ఉండొచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో జనాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఎలాంటివారికైనా కుదరని పని. దేశ మంతా కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని...యూరియా ధరలు పెరిగి... పంటలకు కనీస మద్దతు ధర కరువై ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదు కోవడానికి, వారి సమస్యలను గుర్తించి సరిచేయడానికి బదులు భూసేకరణపై వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలై ఉండటం న్యాయం కాదని ఎన్డీయే ప్రభుత్వం గుర్తించాలి.