ప్రతి అలవాటులోనూ, ప్రతి చర్యలోనూ వ్యాధిని పసిగట్టి, దానికొక పేరు తగిలించడం పాశ్చాత్యదేశాల్లో అలవాటు. ప్రయోజనంతో సంబంధం లేకుండా పాతదేదైనా సరే దాచే అలవాటుకు వారు ‘హోర్డింగ్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. మనం గుర్తించంగానీ... మన పాలకులకు చట్టాల విషయంలో ఇలాంటి బలహీనత దండిగా ఉంది. లేనట్టయితే వలసపాలనను వదుల్చుకుని 67 ఏళ్లు దాటుతున్నా వారు తీసుకొచ్చిన అనేకానేక చట్టాలను ఇప్పటికీ భద్రంగా అలాగే ఉంచడం సాధ్యమయ్యేది కాదు. ఎన్డీయే సర్కారు ఇటీవల ఇలాంటి చట్టాలపై దృష్టి సారించింది. కాలదోషం పట్టిన చట్టాల పని పట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనల మేరకు అన్ని మంత్రిత్వ శాఖలూ ఆ పనిలోబడ్డాయి.
మీ మీ శాఖల్లో సమీక్షలు నిర్వహించి ఈ తరహా చట్టాలుంటే ఒక జాబితా తయారుచేసి ఇవ్వాలని ఇందుకోసం ప్రత్యేకించి ఏర్పాటుచేసిన కమిటీ వివిధ శాఖలకు వర్తమానం పంపింది. వీటిల్లో సవరించాల్సినవేమిటో, పూర్తిగా రద్దుచేయాల్సినవేమిటో కమిటీ పరిశీలిస్తుంది. నిజానికి వాజపేయి ప్రభుత్వం ఉండగా ఒకసారి ఇలాంటి కసరత్తు జరిగింది. దాదాపు 1,382 చట్టాలను రద్దు చేయొచ్చని ఆ కమిటీ సూచించింది కూడా. అయితే పదిహేనేళ్లవుతున్నా అందులో కేవలం 415 చట్టాలను మాత్రమే ఇప్పటికి రద్దుచేయగలిగారు. వాస్తవానికి ఇప్పుడున్న చట్టాల్లో 10 శాతం నేరుగా రద్దుచేయాల్సినవి కాగా, మరో 40 శాతం చట్టాల్లో చాలాభాగం అసంగతమైనవి, పరస్పర విరుద్ధమైనవి ఉన్నాయి.
ఈ చట్టాల్లో చాలామటుకు పురావస్తు శాలకు తరలించాల్సినవి. ఇందులో పరస్పర విరుద్ధమైనవి సరేసరి...అర్ధంలేనివి, అనర్థదాయకమైనవి, ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు 1887లో తీసుకొచ్చిన భారతీయ సెరైస్(హోటళ్ల) చట్టం బాటసారులకు మంచినీళ్లడిగితే ఇవ్వకపోవడం నేరమని చెబుతున్నది. బాటిళ్లలో నీరు కొనుక్కోవడం సర్వసాధారణమైపోయిన ప్రస్తుత దశలో ఎవరైనా హోటల్‌కు వెళ్లి మంచినీళ్లడగడం, వారు ఇవ్వకపోతే కేసు పెట్టడం ఊహించగలమా? ఒకవేళ అలా కేసు పెడితే స్వీకరించేవారుంటారా? అయితే, ఈ చట్టంకింద దేశ రాజధానిలో ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌పై కొన్నేళ్లక్రితం కేసు నమోదైంది. ఆ హోటల్ యాజమాన్యం అడిగిన మొత్తాన్ని లంచంగా ఇవ్వలేదన్న కారణంతో ఒక మున్సిపల్ అధికారి ఈ చట్టం బూజు దులిపాడు.
చట్టమంటూ ఉండి, దానిద్వారా వేధించడానికి అవకాశం దొరికితే వదులుకునేదెవరు? 1860నాటి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లను శోధిస్తే అందులో పురుషుల నడవడికి సాధికారత కల్పించేవి, మహిళలకు అన్యాయం చేసేవి చాలా ఉన్నాయి. 1875నాటి ఇండియన్ మెజారిటీ చట్టం ఆడపిల్లలకు 18 ఏళ్లవయసు, మగపిల్లలకు 21 ఏళ్లు వస్తేగానీ పెళ్లి చేయకూడదంటున్నది. కానీ, 18 ఏళ్ల యువకుడు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చని మరోచోట ఉన్నది. బెంగాల్ బాండెడ్ వేర్‌హౌస్ అసోసియేషన్ చట్టం 176 ఏళ్లనాటిది. ఆ వేర్‌హౌస్ తన స్థిరాస్తిని అమ్మదల్చుకుంటే ఈస్టిండియా కంపెనీకి అమ్మాలని నిర్దేశిస్తున్నది. ఆత్మహత్య నేరం కాదు...కానీ, ఆత్మహత్యాయత్నం నేరమని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 అంటున్నది.
ఈ సెక్షన్‌కింద మణిపూర్ ఉద్యమకారిణి ఇరోం షర్మిలను మన ప్రభుత్వాలు గత 14 ఏళ్లుగా నిరవధికంగా జైల్లో ఉంచుతున్నాయి. ఇది చెల్లదని ఈమధ్యే స్థానిక కోర్టు తీర్పునిచ్చినా మళ్లీ ఆ చట్టంకిందే ప్రభుత్వం అరెస్టుచేసింది. ఆమె రద్దు చేయాలని కోరుతున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అనుమానం వస్తే ఎవరినైనా కాల్చిచంపే హక్కును యూనిఫాంలో ఉండేవారికి కట్టబెడుతున్నది. 1918నాటి రాజద్రోహ చట్టం ఈనాటికీ అసమ్మతిని అణిచేయడానికి ప్రభుత్వాలకు ఉపయోగపడుతున్నది. జైల్లో గాంధీ టోపీ ధరిస్తే 1911నాటి చట్టం ప్రకారం నేరం! ప్రైవేటు వ్యక్తులు కొరియర్ సర్వీసులు నిర్వహించడం ఇండియన్ పోస్టాఫీసు చట్టం, 1898 ప్రకారం నేరం.
అయితే, కొరియర్ సర్వీసులు తాము పంపిణీ చేసే ఉత్తరాలకూ, ఇతరత్రా పార్సిళ్లకూ ‘ముఖ్యమైన డాక్యుమెంట్ల’న్న ముసుగేసి వ్యాపారం నడుపుకుంటున్నాయి. ఎవరికో ఆగ్రహం వచ్చి, అంతు చూద్దామనుకుంటే ఈ వ్యాపారం ఎప్పుడైనా మూతబడే ప్రమాదం ఉంటుంది. 1923నాటి అధికార రహస్యాల చట్టం ప్రభుత్వ కార్యాలయాలనుంచీ, అధికారులనుంచీ ‘సమాచారాన్ని పొందడం’ నేరమంటున్నది. సమాచార హక్కు చట్టం వచ్చి దశాబ్దం దాటుతున్నా ఈ చట్టానికి నూకలు చెల్లలేదు! ఇలాంటి అనేకానేక చట్టాలు క్షేమంగా ఉండగా ఇప్పుడు సర్వత్రా వినియోగంలోకొచ్చిన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, ఎలక్ట్రానిక్ డేటా బదిలీ వగైరాలను క్రమబద్ధీకరించే ప్రత్యేక చట్టమేమీ లేదు. మన రాజకీయ, సామాజిక రంగాల్లో జాతీయోద్యమం ప్రవేశపెట్టిన అనేకానేక ఉన్నత విలువలనూ, ప్రజాస్వామిక ఆకాంక్షలనూ ఈ చట్టాలు అపహాస్యం చేస్తున్నాయి.
ఆ ఉద్యమం ద్వారా సమకూడిన హక్కులను కాలరాస్తున్నాయి. అయినా ఇన్నేళ్లుగా మన పాలకులకు అవేమీ పట్టలేదు. అవసరమైన చట్టాలు తీసుకురావడం, వాటిని అమలు చేయడం ప్రభుత్వాల విధి అని రాజ్యాంగం చెబుతున్నది. కానీ, నిర్ణీత కాలవ్యవధిలో చట్టాలను సమీక్షించడం, వాటిల్లో పనికిమాలినవాటిని తొలగించడం కూడా పాలకుల విధుల్లో భాగం చేస్తే బాగుండేదేమో! చేయాల్సిన పనుల్లోనే ఎక్కడలేని అలసత్వాన్నీ ప్రదర్శించే మన పాలకులు... ప్రత్యేకించి చెప్పకపోతే చేస్తారని ఆశించగలమా? ఇలాంటి దశలో చట్టాలను జల్లెడపడుతున్న మోడీని అభినందించాలి. ఈ ప్రక్రియలోనే నిరంకుశ చట్టాలు కూడా కనుమరుగు కావాలని ఆశించాలి.
చట్టాలపై బ్రహ్మాస్త్రం!
Published Tue, Sep 2 2014 12:47 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement