petrol rate
-
‘చమురు’ ధరతో ఆటలు!
ఈమధ్య కాలంలో పైపైకి పోవడం తప్ప కిందకు దిగడం తెలియని పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం హఠాత్తుగా రూటు మార్చుకుని తగ్గుముఖం పట్టాయి. ప్రతి లీటర్‌కూ వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ. 2.50 కోత విధించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటమే ఇందుకు కారణం. అంతేకాదు...రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తాము వసూలు చేసే వ్యాట్‌లో లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం వెనువెంటనే దాన్ని శిరసావహించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో వెళ్తే ఈ రెండింటి ధరలూ లీటర్‌కు రూ. 5 మేర తగ్గుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పెట్రో ధరలు డజనుసార్లు పెరిగాయి. ఇలా పెరిగిన ప్రతిసారీ జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. గత నెల 11న విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునివ్వగా పుండు మీద కారం జల్లినట్టు అదే రోజు పెట్రో ధరలు మరికాస్త పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు బ్యారెల్ ధర 86 డాలర్లుంది. నాలుగేళ్లలో ఇది అత్యధికం. దీనికితోడు రూపాయి విలువ నానాటికీ దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే దాని ప్రస్తుత విలువ రూ. 73.81. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల పెంపు పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయి. సరుకు రవాణా చార్జీలు తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి రిజర్వ్‌బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతుంది. దాని ప్రభావం వల్ల వృద్ధి మందగిస్తుంది. ఇలా ఒకదానికొకటి ముడి పడి ఉండే అనేక పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అంతర్జాతీయ పరిణామాలవల్ల చమురు ధరలు తగ్గటం మొదలయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 115 డాలర్లుంటే ఏడాది తిరిగేసరికల్లా అది 53.36 డాలర్లకు చేరుకుంది. మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడతాం గనుక ఇలా ధరలు పడిపోవడం వల్ల ఒక్కసారిగా మన కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం ప్రారంభించింది. లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం మొదలైంది. అయితే మోదీ ప్రభుత్వం చమురు ధరల తగ్గుదలను వినియోగదారులకు బదిలీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ పోయి భారీ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టింది. 2014 నవంబర్ మొదలు 2016 జనవరి వరకూ 9 సార్లు ఈ సుంకాన్ని పెంచింది. నిరుడు అక్టోబర్‌లో ఒక్క సందర్భంలో మాత్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. గత ఏడు నెలల్లో పెట్రోల్‌పై లీటర్‌కు దాదాపు రూ. 6, డీజిల్‌పై లీటర్‌కు దాదాపు 6.50 చొప్పున పెరిగింది. ఈ పెట్రో ధరల పెరుగుదలలో రాష్ట్రాల పాత్ర తక్కువేమీ కాదు. అవి వ్యాట్(విలువ ఆధారిత పన్ను) పేరుతో బాదుతుంటాయి. సరుకు విలువను బట్టి ఈ పన్ను విధిస్తారు గనుక కేంద్రం పెట్రో ధరలు పెంచినప్పుడల్లా రాష్ట్రాలకు పండగే. వ్యాట్ ద్వారా వాటి ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ వ్యాట్ అన్నిచోట్లా ఒకేలా లేదు. పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ విధించే రాష్ట్రాల్లో అగ్ర స్థానం మహారాష్ట్రది. అది పెట్రోల్‌పై 38.11 శాతం, డీజిల్‌పై 24.78 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్ 35.77 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా...డీజిల్‌పై మాత్రం అందరికన్నా ఎక్కువగా 28.08 శాతం వసూలు చేస్తోంది. కనుకనే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ. ప్రతి పెట్రోల్ బంక్ వద్దా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు ఆ ధరలో ఎవరి వాటా ఎంతో వివరంగా ప్రదర్శిస్తే అందరి వేషాలూ బయటపడతాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా విధించిన వ్యాట్ ద్వారా రూ. 1,208 కోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన బృందం నివేదిక అంచనా వేసింది. చమురుపై విధించే వ్యాట్ ద్వారా రూ. 10,800 కోట్లు ఆర్జించాలని 2018–19 బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకోగా ఆ లక్ష్యానికి మించే ఆదాయం లభిస్తుందని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఒకపక్క జనంపై ఇలా ఎడాపెడా వ్యాట్ పేరుతో బాది భారీగా ఆదాయం గడిస్తూ బిచ్చం వేసినట్టు లీటర్‌కు రూ. 2 తగ్గించామని బాబు సర్కారు ఆర్భాటంగా గత నెలలో ప్రకటించింది. ఇప్పటివరకూ పొందిన ఆదాయాన్ని, ఆ రాష్ట్రం పెట్టుకున్న లక్ష్యాన్ని బేరీజు వస్తే పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 3, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 వరకూ తగ్గించవచ్చునని ఎస్బీఐ అధ్యయన నివేదిక లెక్కేసింది. చమురుపై మొత్తంగా రాష్ట్రాల ఆదాయం రూ. 23,000 కోట్లు దాటుతుందని ఆ నివేదిక చెబుతోంది. ఇప్పుడు హఠాత్తుగా ధరల్ని తగ్గించడానికి త్వరలో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు, అటుపై వచ్చే సార్వత్రిక ఎన్నికలు కారణమని సులభంగానే అర్ధమవుతుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం రూ. 2.50లో కేంద్రం వాటా రూ. 1.50 మాత్రమే. మరో రూపాయిని చమురు సంస్థలు భరిస్తాయి. 2013 జనవరిలో అప్పటి యూపీఏ సర్కారు పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తేసింది. ఇకపై అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఆ ధరలుంటాయని చెప్పింది. ఎన్డీఏ సర్కారు వచ్చిన వెంటనే డీజిల్‌పై కూడా నియంత్రణ తొలగించింది. ఆ విధానానికే కట్టుబడి ఉంటే ఈపాటికల్లా చమురు ధరలు బాగా తగ్గాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగంపై ఆధారపడి ఏటా లక్షల కోట్ల మేర ఆదాయం గడిస్తున్న తీరు సరికాదని గతంలో రంగరాజన్ కమిటీ హితవు పలికింది. ఇతరేతర రంగాల ద్వారా వనరులు పెంచుకోవాలని సూచించింది. కానీ ఆ కమిటీ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గించటం మంచిదే. కానీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చమురు ధరలు మరింత తగ్గేలా చూడాలి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. -
విజయవాడలో సీపీఎం నేతల అరెస్ట్
సాక్షి, విజయవాడ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు రోడ్డులోని అప్సర సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ..కేంద్రం చీటికి మాటికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డీ విరుస్తుందని మండిపడ్డారు. పెట్రోల్ ధర రూ.31 ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాభై రూపాయలను పన్ను రూపంలో వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని, లేనట్లయితే ఆందోళనలు కొనసాగిస్తామని మధు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నేతల్లో మధు, బాబూరావు, కాశీనాధ్, తదితర నాయకులు ఉన్నారు. -
తక్కువ ధర: పెట్రోల్, డీజిల్ కోసం క్యూ!
కర్ణాటకలో లీటరుపై రూ.6.70 నుంచి రూ.7దాకా తక్కువ ధర ఏపీలో అమరావతి నిర్మాణం పేరిట 4శాతం అదనపు పన్నులు దీంతో సరిహద్దుల్లోని బంకులకు వెళుతున్న జనం పలమనేరు: పలమనేరు ప్రాంతపు వాహనదారులు పెట్రోలు, డీజల్ కోసం పొరుగున ఉన్న కర్ణాటకపై ఆధారపడుతున్నారు. వీలున్నప్పుడల్లా కర్ణాటకకు వెళ్లి తమ వాహనాల ట్యాంకుల నిండా పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ కంటే.. కర్ణాటకలో డీజల్, పెట్రోలు ధరలు తక్కువగా ఉండటమే.. ఇక్కడి కంటే కర్ణాటకలో లీటరు డీజిల్, పెట్రోల్ రూ.6.70 నుంచి రూ.7 దాకా తక్కువగా లభిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత పన్ను నాలుగు శాతానికి అదనంగా 4శాతం (మొత్తం 8శాతం) వసూలు చేస్తుండటంతో ధరల్లో ఈ వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న పెట్రోలు బంకుల్లో కళకళలాడుతుండగా స్థానిక బంకులు మాత్రం వెలవెలబోతున్నాయి. పలమనేరులో శుక్రవారం పెట్రోలు లీటరు రూ.70.80 కాగా కర్ణాటకలో రూ.64.10. ఇక ఏపీలో డీజల్ లీటరు రూ.62.63 కాగా కర్ణాటకలో రూ. 55.93. మొత్తం మీద రూ. 6.75 వరకు అక్కడ తక్కువకు పెట్రోల్, డీజిల్ లభిస్తున్నాయి. ఏడాదిగా తగ్గిన అమ్మకాలు.. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి మండలాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఇక్కడ 90 పంచాయితీలుండగా సగం పల్లెలకు నియోజకవర్గ కేంద్రం కంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దే దగ్గరగా ఉంది. వీకోట పట్టణానికి ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంది. దీంతో స్థానికంగా అధిక ధరతో కొనే బదులు కర్ణాటకలో కొంటే డబ్బు ఆదా అవుతుందని ప్రజలు పొరుగురాష్ట్రం బాటపడుతున్నారు. నియోజకవర్గంలో 15 పెట్రోలు బంకులున్నాయి. గతంలో ధరల వ్యత్యాసం లేనపుడు ఇక్కడ రోజుకు సగటున 80వేల లీటర్ల చమురు విక్రయాలు సాగుతుండేవి. ప్రస్తుతం ధరల వ్యత్యాసంతో రోజుకి 40 వేల లీటర్లకు పడిపోయింది. సరిహద్దుల్లో బోర్డులు పెట్టుమరీ అమ్మకాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని నంగిళి, ముళభాగిలు, తిమ్మరాజుపల్లి, వీకోట సరిహద్దు, రాజుపల్లిలో సరిహద్దుల అటువైపు ఉన్న పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టి మరీ విక్రయాలు సాగించడం విశేషం. దీంతో వాహనదారులు తమ వాహనాలను అక్కడికి తీసుకెళ్ళి ఫుల్ట్యాంకు చేయించుకుంటున్నారు. జీఎస్టీ అమలైనా లాభమేమి? నిత్యావససరాలైన పెట్రోలు, డీజల్‌పై జీఎస్టీ లేకపోవడంతో రాష్ట్రాలు ఇస్టానుసారంగా పన్నులను పెంచుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం సెంట్రల్ టాక్స్ 11.80శాతం, ఎక్సైజ్ డ్యూటీ 9.75శాతం, వ్యాట్ సెస్ 4శాతం, స్టేట్ టాక్స్ 8శాతంగా ఉన్నాయి. దీనికితోడు ఏపీలో అదనపు పన్నుల కారణంగానే ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో దీనిని అమలుచేయకపోవడమేమిటని వాహనదారులు నిలదీస్తున్నారు. -
రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: స్వాతంత్రదినోత్సవ కానుకగా వాహన వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా పెట్రోల్ ధరను తగ్గించాలని దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.18 పైసలు తగ్గిస్తున్నట్టు దేశీయ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ పట్టణాల్లో పెట్రోల్ ధరలు సుమారు 2 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. 14 తేది అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పెట్రోల్ ధర తగ్గించడం ఇది రెండవసారి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు దిగి రావడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలపడటం లాంటి అంశాలు పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమయ్యాయని కంపెనీలు తెలిపాయి. -
పెట్రోల్ ధర తగ్గింపు
కడప సిటీ, న్యూస్‌లైన్: కేంద్రప్రభుత్వం ప్రజలపై ఏదో విధంగా భారాలను మోపుతూ ఆర్థిక పరిస్థితులు సరిచేసుకుంటోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో పెట్రోలుపై రూ.12లు పెంచుతామని, ఇంతకు మించి పెంచమని భరోసాను అందించింది. రెండు నెలలకొకమారు పెట్రోల్ ధరను పెంచుతూ వచ్చింది. ఈ సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే పెట్రోల్ ధరను తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో సరాసరి రూ.81.93 వంతున లీటరు పెట్రోలును విక్రయిస్తున్నారు. కేంద్రం పెట్రోలుపై రూ.3.05పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధర స్థానిక పన్నులను తీసివేస్తే సుమారు రూ.78.49లుగా విక్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర సరాసరి రూ.56గా విక్రయిస్తున్నారు. 0.50పైసలును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో లీటరు డీజిల్ ధర స్థానిక పన్నులతో కలుపుకొని సుమారు రూ.56.57 పైసలుగా విక్రయిస్తారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు లక్ష లీటర్ల పెట్రోల్ వినియోగంలో ఉంది. అలాగే ప్రతిరోజూ 2.50లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తగ్గించిన పెట్రోల్ ధర స్థానిక పన్నులను తీసివేస్తే లీటర్‌కు సుమారు రూ.3.44 వంతున తగ్గే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని వినియోగదారులకు నెలకు రూ.1,03,20,000 వంతున ప్రజలకు ఊరట కలగనుంది. అయితే పెరిగిన డీజిల్ ధరలతో రోజుకు సుమారు రూ.1,42,500లు ప్రజలపై అదనపు భారం పడనుంది.