కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు : రాహుల్‌ | Rahul Gandhi Fires On Narendra Modi Government | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు : రాహుల్‌

Published Sun, Feb 17 2019 3:51 AM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

Rahul Gandhi Fires On Narendra Modi Government - Sakshi

జగదల్‌పూర్‌: అనిల్‌ అంబానీ, విజయ్‌ మాల్యా వంటి పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం..రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా ధురగాన్‌ గ్రామంలో జరిగిన గిరిజనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, మోహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచి పెడుతోంది. 

కానీ రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది’అని రాహుల్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు కనీస ఆదాయం హామీ కింద వారి ఖాతా ల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేయడం, 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా ధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం..బడా వ్యాపార వేత్తలకు భారీ రాయితీలు ఇస్తోందని రాహుల్‌ ఆరోపించారు. ‘నోట్ల రద్దు తర్వా త అర్ధరాత్రి తీసుకొచ్చిన గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రం గా నష్టపోయాయి. మేం అధికారంలోకి వస్తే జీఎస్టీని ‘సచ్చా’జీఎస్టీగా మారుస్తాం’అని పేర్కొన్నారు.  

టాటా స్టీల్‌ భూముల పత్రాల అందజేత 
బస్తర్‌ ప్రాంతంలోని లోహండిగూడలో టాటా స్టీల్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో 2008లో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు సంబంధించిన పత్రాలను, అటవీ హక్కుల ధ్రువపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలను ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement