ఢిల్లీ రోడ్ల వెంట కదం తొక్కిన రైతులు, కార్మికులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని కార్మికులకు కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలు ఉండాలన్నది బుధవారం నాడు ఢిల్లీని ముట్టడించిన కార్మికుల, కర్షకుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. నెలకు 18 వేల రూపాయలన్నది ఎలా ప్రామాణికం? దేశంలో ప్రస్తుతం కనీస వేతన ఎంత ఇస్తున్నారు? దాన్ని ఎలా లెక్కిస్తున్నారు. ఏటా కనీస వేతనం పెరుగుతున్నదా ? తగ్గుతున్నదా? ఇతర దేశాల్లో ఈ వేతనం ఎలా ఉంది?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించింది. తమకు కూడా అంతే వేతనాన్ని కనీస వేతనంగా ఇప్పించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రకారమే ఇప్పటికీ దేశంలో కనీస వేతనాన్ని అంచనా వేస్తున్నారు. నాటి చట్టానికే పలుసార్లు మార్గదర్శకాలను మారుస్తూ వచ్చారు తప్ప, చట్టం స్వరూపాన్ని ఇప్పటికీ మార్చలేక పోయారు. పర్యవసానంగా గత మూడు దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పెరగాల్సిన కార్మికుడి వేతనం (విలువ ఆధారిత సూచిక ప్రకారం...ఉత్పత్తులు, వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకొని విలువను అంచనా వేస్తారు) తగ్గుతూ వస్తోంది. దీని అర్థం దేశం సాధిస్తున్న ఆర్థిక ఫలితాల్లో కార్మికుడికి సరైన భాగం లభించడం లేదు. ఫలితాల్లో ఎక్కువ భాగం యజమానులకే వెలుతోంది.
1981–1982 సంవత్సరం నుంచి 2011–12 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఆర్థిక పురోభివద్ధి గణాంకాల ప్రకారం కంపెనీల ఉత్పత్తి, లాభాలు ఎంతో పెరిగినా కార్మికుల కనీసవేతనాలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. 2009–-2010లో ఆర్థిక పురోభివద్ధి విలువలో కార్మికుడి వేతనాల శాతం 11.9 శాతం ఉన్నట్లు తేలింది. అంతకు దశాబ్దం క్రితం 15 శాతం ఉండగా,ఆ తర్వాత తగ్గింది. అభివద్ధి చెందిన దేశాల సంగతి పక్కన పెడితే వర్ధమాన దేశాలకన్నా భారత కార్మికుల వేతనాలు ఎంతో తక్కువ. ఆర్థిక పురోభివద్ధి విలువ ఆధారిత వేతనాల పద్ధతి మన దేశంలో లేకపోవడంతో వేతనాలు తగ్గడం కనిపిస్తోంది.
1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రమాణాల ప్రకారం నేడు కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా ఉంది. దీన్ని నెలలోని 31 రోజులకు లెక్కిస్తే 5,456 రూపాయలు మాత్రమే. ఈ కనీస వేతనాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన చట్టంలో లేకపోయినప్పటికీ కేంద్రం పరిధిలోని ఓ కంపెనీ తన కార్మికుడికి ఈ కనీస వేతనం ఇస్తే సరిపోతుందన్నమాట.
రోజువారిగా ఓ కార్మికుడు తీసుకునే కాలరీల ఆహారం, నలుగురు సభ్యులుగల కుటుంబంలో వారందరి బట్టలకయ్యే గుడ్డా, ఉండటానికి అద్దె, ఇద్దరు పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రమాణంగా తీసుకొని దినసరి వేతనాలను లెక్కించే బరువు బాధ్యతలను పార్లమెంట్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. తర్వాత సవరించిన ప్రమాణాల్లోఓ కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పనిచేసినా, ఒకరి వేతనాన్నే పరిగణలోకి తీసుకోవాలని, కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ఆహారాన్ని 2700 కాలరీలుగా లెక్కించాలని, వారికి ఏడాదికి 72 యార్డుల గుడ్డ ఖర్చు అవుతుందని, ఇద్దరి పిల్లల చదువు, నలుగురి ఆరోగ్యానికయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోవాలని, ఇంట్లో వంటకయ్యే ఖర్చును 20 శాతంగా తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించాలని (అంటే కనీస వేతనంలో 20 శాతం డబ్బులను చెల్లిస్తే వారి ఇంధనపు ఖర్చు వెళ్లిపోవాలి) సూచనలున్నాయి.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తేనే నేడు కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా తేలింది. కార్మికుడి కనీస అవసరాలను దష్టిలో పెట్టుకొని కనీస వేతనాన్ని లెక్కించే ఈ పద్ధతిని మార్చుకోవాలని, దేశం సాధిస్తున్న ఆర్థిక వద్ధిలో వాటా పద్ధతిన కార్మికుడికి వేతనాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆర్థిక నిపుణులు ఆందోళన చేస్తుండడంతో కనీస వేతనాలను నిర్ణయించే పూర్తి అధికారం ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి అప్పగిస్తూ గతంలో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. అది ఇప్పటికీ పార్లమెంట్‌లో మూలన పడి ఉంది. మనకంటే ఆర్థికంగా ఎంతో అభివద్ధి సాధిస్తున్న చైనాలో కార్మికుడి కనీస వేతనం నెలకు 22 వేల రూపాయలుంది. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో గంటకు ఏడున్నర డాలర్ల నుంచి ఎనిమిది డాలర్ల వరకు కనీస వేతనం ఉంది. అంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే ఓ కార్మికుడికి నెలకు లక్షా ఇరవై వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుంది. అమెరికాకన్నా కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా దేశాల్లో కనీస వేతనాలను చట్టబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు.
కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలు చేయాలన్న డిమాండ్‌తోపాటు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచాలని, వ్యయసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీల అటవి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఒకటిన్నర లక్షల మంది కార్మికులు, కర్షకులు బుధవారం ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఇవే డిమాండ్లపై దాదాపు ఆరు నెలల క్రితం మార్చిలో 40 వేల మంది రైతులు మహారాష్ట్రలో 180 కిలోమీటర్ల పాద యాత్ర జరిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే అందులో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని నాటి ర్యాలీలో పాల్గొని నేటి ర్యాలీలో కూడా పాల్గొన్న నాసిక్ నుంచి వచ్చిన సోమ్‌నాథ్ మంకర్ లాంటి వారు చెబుతున్నారు. సీపీఎం నాయకత్వంలోని యూనియన్ల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు, కర్షకులు ర్యాలీకి తరలి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment