న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపాన ఉన్న ఛత్రంలో సెప్టెం బరు 8న స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఒకప్పుడు ఆ ఛత్రంలో ఉండిన బ్రిటిష్ రాజు 5వ జార్జ్ విగ్రహం తొలగింపుతో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలన్న విషయమై దశాబ్దాల తరబడి సాగిన ఊగిసలాట అనంతరం తీసు కున్న సముచిత నిర్ణయం ఇది. స్వాతంత్య్ర సాధన కోసం సాయుధ మార్గాలను అన్వేషిస్తూ నేతాజీ 1941 జనవరి 26న భారతదేశాన్ని వీడి ప్రవాసం వెళ్లిన అనంతరం ఇన్నేళ్లకు న్యూఢిల్లీలో తొలిసారిగా ఏర్పాటైన ఆ యోధుడి గర్వస్థలి ఇది! 1947కి ముందే అండమాన్‌ను వలస పాలన నుంచి విముక్తం చేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు బోస్‌ను ‘అఖండ భారత్‌కు తొలి అధిపతి’గా మోదీ ప్రశంసించడం కూడా సరైనదే. అదే సమయంలో మనం స్వతంత్ర భారతిపై బోస్ ఆలోచనలు ఏమిటన్నవి మననం చేసుకోవాలి.
స్వాతంత్య్రానంతరం భారత భద్రతా బలగాలు ఎలా ఉండాలనే విషయమై నేతాజీ ఐరోపాలో ఉన్నప్పుడే ప్రయోగాత్మకమైన ఆలోచనలు చేశారని చాలామందికి తెలియకపోవచ్చు. 1943 అక్టోబరు 21న షోనన్ (సింగ పూర్)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వరంగంగా బోస్ 1943 ఆగస్టు 25న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి నాయకత్వం వహించడానికి చాలాముందే ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆనాటికి బెర్లిన్‌లో ఉంటున్న దివంగత భారతీయ పాత్రికేయుడు ఏసీఎన్ నంబియార్‌తో భవిష్యత్ స్వతంత్ర భారత విదేశాంగ విధానం, రక్షణ, అంతర్గత పాలనపై తన ఆలోచనలను బోస్ 1934 నుండీ నిరంతరంగా పంచుకుంటూ వచ్చారు.
1942–1945 మధ్య కాలంలో నంబియార్ ఐరోపాలో బోస్‌కు సహాయకారిగా ఉన్నారు. బోస్ ఆయనను 1942 జనవరిలో పూర్తి దౌత్య హోదాతో బెర్లిన్‌లోని జర్మనీ విదేశాంగ కార్యాలయానికి అను బంధంగా ఉన్న ‘ఆజాద్ హింద్ ఆఫీస్’కు తన డిప్యూటీగా నియమించుకున్నారు. 1943 ఫిబ్రవరి 8న బోస్ రహ స్యంగా ఐరోపాను విడిచిపెట్టారు. బోస్‌తో నంబియార్ జర్మనీ, జపాన్‌లలోని ఫౌజ్ యంత్రాంగం ద్వారా మంత నాలు జరుపుతుండేవారు. బోస్‌కు ఆయన చివరి సమా చారం 1945 జనవరి 12న జర్మనీ పడవ యు–234 ద్వారా బట్వాడా అయింది. అయితే ఆ పడవ 1945 మే 14న అమెరికా నౌకాదళానికి పట్టు బడటంతో ఆ సమాచారం బోస్‌కు చేరలేదు.
గాంధీజీ ప్రబోధించిన మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర భారతావనిలో అన్ని పాలనా వ్యవస్థలను నిర్మించడం బోస్ పథకం అని నంబియార్ నాతో చెప్పారు. జర్మనీలో బోస్ చేపట్టిన ప్రారంభ కార్యకలాపాలలో ఒకటి, 1941 డిసెంబర్ నుంచి భారత సైనిక దళాన్ని పటిష్టం చేసుకుంటూ రావడం. అందుకోసం ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలను జర్మనీ సహకారంతో వాలంటీర్లుగా తీసుకున్నారు. ఏడాది లోనే దాదాపు 4,000 మంది బోస్ దళ వాలంటీర్లుగా చేరారు.
‘‘భారతదేశంలోని ప్రధాన సామాజిక వర్గాలతో బోస్ దళం సమీకృతంగా ఉండేది. ఆ వర్గాలలోని అల్పసంఖ్యాకులైన ముస్లిం, సిక్కు ప్రతినిధుల సంక్షేమం కోసం బోస్ శ్రద్ధ వహించారు. అంతే కాదు, బోస్ తన కొత్త సైన్యాన్ని మతం, కులం లేదా ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లుగా విభజించాలని అనుకోలేదు. తన దళంలో మైనారిటీల మనోభావాలు దెబ్బతినకుండా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను బోస్ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ముస్లింలు నిరసించిన ‘వందేమాతరం’కు బదులుగా రవీంద్రనాథ్ టాగూర్ ‘జనగణమన’ను ఎంచుకున్నారు. మైసూర్‌కు చెందిన బ్రిటిష్ వ్యతిరేక యోధుడు టిప్పు సుల్తాన్ స్ఫూర్తిని సైన్యంలో ప్రేరేపించ డానికి ఆజాద్ దళ త్రివర్ణ పతాకం మధ్యలో దుముకుతున్న పులిని చేర్చారు’’ అని చరిత్రకారుడు సుగతా బోస్ తెలి పారు. తర్వాత పులి గుర్తుకు బదులుగా గాంధీజీ ‘చరఖా’ వచ్చింది.
ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వేర్వేరు భాషల వల్ల కూడా సైనిక దళ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని బోస్ బలంగా నమ్మారు. ఆ పరిస్థితిని నివారించేందుకు రోమన్ లిపిలో రాసిన హిందుస్థానీ భాషను దళాల ఉమ్మడి మాధ్యమంగా బోస్ స్వీకరించారని ఫౌజ్‌కు 1941–45 మధ్య హిందీ–జర్మన్ అనుసంధాన వ్యాఖ్యాతగా పనిచేసిన ఆక్స్‌ఫర్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ లెక్చరర్ రుడాల్ఫ్ హార్టోగ్ తెలిపారు. హిందువులు, ముస్లిములు మాట్లాడే భాషలను హిందూస్థానీగా సమ్మిళితం చేయడం ద్వారా తన సైనిక దళంలో బోస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సంస్కృతుల మధ్య సమైక్యతను సాధించారని హార్టోగ్ రాశారు. 1939 తర్వాత కాంగ్రెస్‌లోని మితవాద నాయకులతో విభేదించిన కారణంగా గాంధీజీకి బోస్ దూరమైనప్పటికీ, అది ఆయన పట్ల బోస్‌కు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన ప్పుడు బోస్ ‘ఆజాద్ హింద్ రేడియో’ ద్వారా గాంధీజీ ఆదేశాలను విధిగా పాటించాలని భారతీయులందరికీ స్పష్టమైన పిలుపు నిచ్చారు. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు)
1944 జూలై 6న బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్‌కు గాంధీజీ ఆశీర్వాదం కోసం సింగపూర్ నుండి ప్రత్యేక రేడియో ప్రసంగం చేశారు. ‘‘జాతిపితా, భారతదేశ విముక్తి కోసం ఈ పవిత్ర యుద్ధంలో మేము మీ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలు కోరుతున్నాము’’ అని బోస్ తన ప్రసంగంలో అన్నారు. 2012లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, గాంధీజీని ఎవరైనా ‘జాతిపిత’ అని సంబోధించిన తొలి సందర్భం అది! ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేతాజీ ప్రాధాన్యాలను అనుసరించాలనుకుంటే, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. లేదంటే, మత సామరస్యం అన్నది ఒక నినాదంలా మాత్రమే మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...)
- వప్పల బాలచంద్రన్
కేబినెట్ సెక్రటేరియట్ మాజీ ప్రత్యేక కార్యదర్శి
(‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment