అవిశ్వాసానికి అనుమతి | No-Confidence Motion Moved Against Modi Govt | Sakshi
Sakshi News home page

అవిశ్వాసానికి అనుమతి

Published Thu, Jul 19 2018 2:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

No-Confidence Motion Moved Against Modi Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అనుమతించని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. శుక్రవారం (జూలై 20న) చర్చతోపాటు ఓటింగ్‌ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సభాపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, బి.శ్రీరాములు, సి.ఎస్‌.పుట్టరాజు ఇచ్చిన రాజీనామాలు ఆమోదించినట్లు సభకు వెల్లడించారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు  కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. శుక్రవారం జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. విశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి.

కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ..
‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ రావు, తోట నర్సింహం, తారిఖ్‌ అన్వర్, మహ్మద్‌ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్, కేసీ వేణుగోపాల్‌ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తూ నోటీసులందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్‌ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్‌ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఇందులో ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక కూడా ఉన్నారు. అధికార బీజేపీ సహా.. శివసేన, టీఆర్‌ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు కూర్చున్నారు. మొత్తంగా విపక్షాలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు లేచి నిలుచున్నారు. సభాపతి వారిని లెక్కించి నిబంధనల ప్రకారం అవసరమైన (50 మందికి పైగా) సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

పాలేవో, నీళ్లేవో తేలిపోతాయ్‌: కేంద్రం
ఈనేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ లేచి మాట్లాడారు. ‘విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలేవో నీళ్లేవో తెలిసిపోతాయి’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభాపతి జీరో అవర్‌ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడారు. తాను అవిశ్వాస తీర్మానానికి ముందుగానే నోటీసులు ఇచ్చానని, పెద్ద పార్టీ అయినందున తాను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

దీనికి సభాపతి బదులిస్తూ నోటీసులు ఇచ్చిన అందరి పేర్లు ప్రస్తావించానని, పార్టీ పరిమాణాలతో సంబంధం లేకుండా.. అందరి కంటే ముందుగా ఇచ్చిన వారినే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తానని తెలిపారు. సభ వాయిదా పడి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి ప్రారంభమైన అనంతరం.. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ, ఓటింగ్‌ ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ శుక్రవారం నాడు చర్చ ఆలస్యమైతే.. ఓటింగ్‌ సోమవారం జరిగే అవకాశం ఉంది.

మమత మద్దతు
ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన పార్టీలకు తమ మద్దతుంటుందని తృణమూల్‌ చీఫ్‌ మమత బెనర్జీ స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు కట్టుబడి ఉన్నందున సంపూర్ణ మద్దతుంటుందని ఆమె కోల్‌కతాలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది అందుకే ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. సభలో బీజేపీకి మద్దతున్నప్పటికీ.. బయట పూర్తి వ్యతిరేకత ఉంది’ అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తృణమూల్‌ ఎంపీలంతా శుక్రవారం సభకు హాజరవ్వాలని.. చర్చ, ఓటింగ్‌లో పాల్గొనాలని ఆ పార్టీ విప్‌ జారీ చేసింది.  



దేనిపైనైనా చర్చకు సిద్ధం: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. రాజకీయ పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే పలు అంశాలపై దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం సభ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు.


విస్తృతమైన అంశాలపై సభలో కూలంకశంగా చర్చ జరిగేలా ఎంపీలు వ్యవహరించాలని.. రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన అంశాలపై సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు విపక్షాలు సహకరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయ పార్టీ సభ్యుడైనా, దేశానికి లాభం చేసే ఏ అంశాన్నైనా సభ దృష్టికి తెస్తే.. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలాంటి చర్చల ద్వారా ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు అందుతాయి’ అని మోదీ పేర్కొన్నారు.  

అవిశ్వాసం నెగ్గుతుంది: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రాజీవ్‌ సాతవ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేకపోయారనీ, ఇది గారడీ ప్రభుత్వమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయింది. పైపెచ్చు, స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిన ధనం 50శాతంపైగా పెరిగింది.

యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చి 50 నెలలు గడిచినా ఒక్కటీ నెరవేరలేదు. కశ్మీర్‌ సమస్య రగులుతూనే ఉంది. దళితులపై దాడులు పెచ్చుమీరాయి’ అని విమర్శలు గుప్పించారు. అంతకుముందు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేందుకు సభలో అవసరమైన సంఖ్యాబలం లేదని మీడియా ప్రశ్నించగా.. ‘మాకు బలం లేదని ఎవరన్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభలో ఉండాలంటూ తన సభ్యులకు కాంగ్రెస్‌ విప్‌ కూడా జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగ్‌కు స్పీకర్‌ అంగీకరించిన నేపథ్యంలో బుధవారం వరకు అవిశ్వాసానికి అనుకూల, వ్యతిరేక, తటస్థ పార్టీల వివరాలను ఓసారి పరిశీలిస్తే..



పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, విజయ్‌ గోయల్, జితేంద్రసింగ్, మేఘ్వాల్‌ 


        పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement