sumithra mahajan
-
కాంగ్రెస్ సహాయం తీసుకున్నాను
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకుల సహకారం తీసుకున్నానని లోక్‌సభ మాజీ స్పీకర్, ప్రముఖ బీజేపీ నాయకురాలు సుమిత్రామహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో గతేడాది వరకు బీజేపీ ప్రభుత్వం ఉంది. 15 ఏళ్లు తామే అధికారంలో ఉన్నా, పార్టీ క్రమశిక్షణకు లోబడి కొన్ని సమస్యలను బహిరంగంగా ప్రస్తావించలేదని ఆమె వెల్లడించారు. ఇండోర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విపక్ష కాంగ్రెస్ నాయకులను సమస్యలను ప్రస్తావించమని కోరానని తెలిపారు. అనంతరం వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరేదానినని వ్యాఖ్యానించారు. సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్ సోమవారం స్పందిస్తూ.. సుమిత్రా మహాజన్ ఎప్పుడూ ఇండోర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారని ప్రశంసించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకోవాలని, పార్టీల క్రమశిక్షణను ఉల్లంఘించే నాయకులు ఆమెను చూసి నేర్చుకోవాలని సూచించారు. కాగా, ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిబంధన కారణంగా ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. -
బరిలో లేకున్నా బిజీయే!
ఇండోర్(మధ్యప్రదేశ్)లోని బీజేపీ కార్యాలయం నిండా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఓ గది సందర్శకులతో హడావుడిగా ఉంది. వందల మంది పార్టీ వాళ్లు, ఇతరులు ఆ గదిలోకి వెళ్లి వస్తున్నారు. పక్కనున్న ఇతర నేతల గదులు ఎవరూ లేక బోసిపోయాయి. సందడిగా ఉన్న ఆ గదిలో ఉన్నది సుమిత్రా మçహాజన్. ఇండోర్ సిట్టింగ్ ఎంపీ. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. అయినా పార్టీ శ్రేణులు, జనం ఆమెతోనే ఉంటున్నారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయిన 76 ఏళ్ల సుమిత్రా మహాజన్. లోక్‌సభకు స్పీకర్‌గా చేసిన రెండో మహిళ. మీరా కుమార్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన మçహాజన్ సభను నడిపించడంలో ఒక అమ్మ లా వ్యవహరించారు. ఆమె హయాంలో లోక్‌సభ ఎన్నో కీలక బిల్లులు ఆమోదించింది. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని మçహాజన్ రాజకీయంగా రాణించడమే కాక నియోజకవర్గం ఆదరాభిమానాలు విశేషంగా చూరగొన్నారు. అందరూ ఆమెను ఆప్యాయంగా ‘తాయి’ అని పిలుస్తారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చిన వాళ్లందరికీ ఎన్నికలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూన్నారు. ఎన్నికల్లో ఎవరెవరు ఎలా పని చేయాలో చెబుతున్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేను ఖాళీగా కూర్చుంటాననుకోకండి. రోజూ అనేక మందిని కలుస్తున్నాను. పార్టీ యూనిట్లలో రోజువారీ సమావేశాలు జరుపుతున్నాను. ఆఫీసులోనే నాకు గంటలు గంటలు గడిచిపోతున్నాయి అంటున్నారు మçహాజన్. తాను పనిలో బిజీగా ఉండటమే కాకుండా ఎవరైనా పనిలేకుండా కనిపిస్తే వాళ్లకి ఏదో ఒక పని అప్పచెబుతానని నవ్వుతూ చెప్పారు లోక్‌సభ స్పీకర్. ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాననే బాధకాని, నిస్పృహ కాని ఆమెలో ఏ కోశానా కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధిగా ఉన్నా, మామూలు మహిళగా ఉన్నా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానన్నారామె. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయినప్పుడే ఎన్నికల్లో పోటీ చేయకూడదని దాదాపుగా నిర్ణయించుకున్నానని మçహాజన్ చెప్పారు. ఈ సారి మçహాజన్ పోటీలో దిగకపోవడం పట్ల నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాయి ఇండోర్‌లో ఒక భాగం. ఆమె ఎన్నికల్లో నిలబడకపోవడం విచారకరం. ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా మçహాజన్ మా మనిషే అని పలువురు వ్యాఖ్యానించారు. కొత్తవాళ్లకు చోటిస్తూ తాను పక్కకి తప్పుకోవడం మంచి నిర్ణయమని కొందరన్నారు. ఎన్నికల్లో నిలబడకపోయినా ఎన్నికల వేడినుంచి మాత్రం ఆమె తప్పించుకోలేకపోతున్నారు. -
ఒక్కసారే చాన్స్!
పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన పదవి స్పీకర్ పదవి. పార్లమెంటు మొత్తానికీ స్పీకర్ అత్యున్నతాధికారి. అధికారంలో ఉన్న పార్టీ అభీష్టానికి అనుగుణంగా సీనియర్ లోక్‌సభ సభ్యులను స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. గత పదహారు లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్ పదవి వరించిన పరిస్థితి మన దేశంలో లేదు. గత రెండు దశాబ్దాల్లో అయితే స్పీకర్ గా ఉన్న ఏ ఒక్కరూ లోక్‌సభకు తిరిగి ఎన్నికవలేదు. గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. మొత్తం 16 లోక్‌సభల్లో నీలం సంజీవరెడ్డిని మాత్రమే రెండు సార్లు స్పీకర్ పదవి వరించింది. ఒకసారి స్పీకర్‌గా పనిచేసినవారిలో తిరిగిపోటీ చేసిన కొందరు ఎన్నికల్లో ఓడిపోవడం, కొందరు అసలు పోటీయే చేయకపోవడం, మరికొందరికి పార్టీ తిరిగి సీటు ఇవ్వకపోవడం దీనికి కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2014లో పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కి సీటు కేటాయించలేదు. ఇండోర్ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో తాను అసలు పోటీయే చేయనని సుమిత్రా మహాజన్ తాజాగా ప్రకటించారు. 67 ఏళ్ళ లోక్‌సభ చరిత్రలో సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ద్వితీయ మహిళ. సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్ మీరా కుమార్ తొలి మహిళా స్పీకరే కాకుండా తొలి దళిత మహిళా స్పీకర్‌గా కూడా రికార్డుకెక్కారు. మీరా కుమార్ కన్నా ముందు తొలి కమ్యూనిస్టు దిగ్గజం అయిన సోమనాథ్ ఛటర్జీ సీపీఎం నుంచి లోక్‌సభ స్పీకర్ పదవిని అలంకరించారు. అయితే ఛటర్జీ కష్టాలు కూడా అదే లోక్‌సభలో ప్రారంభం అయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వామపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించినప్పుడు స్పీకర్‌గా రాజీనామా చేసి, లోక్‌సభ సభ్యుడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. అయితే సోమనాథ్ ఛటర్జీ మార్క్సిస్టు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి స్పీకర్ పదవి హుందాతనాన్ని కాపాడారు. అంతేకాకుండా తాను ఆపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. పార్టీ బహిష్కరణ తరువాత కమ్యూనిస్టు దిగ్గజం ఛటర్జీ రాజకీయ ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. శివసేన వ్యవస్థాపకుల్లో ఒకరు, శివసేన అధినాయకుడు బాల్ థాకరే అతి సన్నిహితుడూ అయిన మనోహర్ జోషీ సోమనాథ్ ఛటర్జీకన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్ పదవిని చేపట్టడానికన్నా ముందు మనోహర్ జోషీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్‌జోషీ గెలిచారు. అయితే జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మనోహర్ జోషీని స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోషీ అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా శివసేన సీనియర్ నాయకుడు కూడా కావడంతో ఆయనను స్పీకర్ పదవి వరించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో జోషీ ఓడిపోవడంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టలేదు. భారత చట్టసభల తొలి స్పీకర్ జీఎస్. మాల్వంకర్ 1952లో ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణించారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల తరువాత తొలి లోక్‌సభకు కేఎస్.హెగ్డే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన కూడా తిరిగి రెండోసారి లోక్‌సభకు ఎన్నిక కాలేదు. -
విజయానికి మారు పేర్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత తేలికయిన విషయమేమీ కాదు. కానీ, కొందరు రాజకీయ నేతలు గెలుపునే అలవాటుగా మార్చుకున్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇంత ఈజీయా అనుకునేలా దశాబ్దాలపాటు కొనసాగారు. కొందరు ఇంకా కొనసాగుతున్నారు. ఉదాహరణకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. బీజేపీకి చెందిన ఈమె ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, కాంగ్రెస్‌కు చెందిన కె.హెచ్.మునియప్ప కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు క్రమం తప్పకుండా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా 8వసారీ బరిలో నిలిచారు. వీరందరినీ మించి ఇంద్రజిత్ గుప్తా 11 పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారతంలో లోక్‌సభ సభ్యులుగా అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న కొందరు హేమాహేమీల వివరాలివీ.. ఇంద్రజిత్ గుప్తా, మనేకా గాంధీ, కమల్ నాథ్ -
ఎంపీల తీరు స్కూల్ పిల్లల కన్నా దారుణం
-
స్కూల్ పిల్లల కన్నా దారుణం
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుల ప్రవర్తన స్కూల్ పిల్లల కన్నా దారుణంగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. రఫేల్ విమానాల కొనుగోలు వివాదంపై అధికార, ప్రతిపక్షాలు సభలో సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన కన్నా స్కూల్ పిల్లలు నయం అని నాకు ఓ మెసేజ్ వచ్చింది. స్కూల్ పిల్లల కన్నా మనం దారుణమా?’అని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే రఫేల్ వివాదంపై ఇరు పక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో ప్రారంభమైన కొద్ది సేపటికే ఇరు సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో కూడా రఫేల్, కావేరీ వివాదంపై ఆందోళనలు కొనసాగాయి. తుపానులు వంటి పలు అత్యవసర అంశాలపై చర్చ జరిగేలా సభ నడిచేలా సహకరించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు. సంబంధిత పత్రాలను మంత్రులు ప్రవేశపెట్టగానే డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు కావేరీ సమస్యపై చర్చకు పట్టుపట్టారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. రఫేల్ వివాదంలో ప్రభుత్వంపై సభా హక్కుల నోటీసులు జారీ చేశామని, దానిపై చర్చ జరగాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. -
సంస్కరణలకు భారత్ మద్దతు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గ్యుటెరస్‌కు ఐరాస సీనియర్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో ఆయన భేటీ అవుతారు. భారత పర్యటన సందర్భంగా గ్యుటెరస్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రపంచం మునుపెన్నడూ చూడని సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాసను తీర్చిదిద్దాలి. నా సిఫార్సులకు ఐరాసలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారత్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం భారత్ ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా భిన్నధ్రువ ప్రపంచాన్ని నిర్మించడం అసాధ్యం. ఇండియా ప్రపంచ శక్తిగా మారుతోంది’ అని పేర్కొన్నారు. -
బాధితుల్ని ఆదుకోండి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేరళను ఉదారంగా ఆదుకోవాలని పార్లమెంటు ఉభయసభల స్పీకర్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సభ్యులందరూ తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సాయం చేయాలని కోరారు. సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్య భేటీ అయ్యారు. ఎంపీలందరూ ఓ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉభయసభల స్పీకర్లు కోరారు. కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. మానవుల కారణంగా లేదా ప్రకృతి ప్రకోపం వల్ల విపత్తులు సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు సభ్యుడు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ కేటాయించవచ్చని తెలిపారు. అదే తీవ్ర విపత్తు సంభవిస్తే గరిష్టంగా రూ.కోటి వరకూ సాయం చేయొచ్చని వెల్లడించారు. -
సభా మర్యాదలు పాటించాలి
న్యూఢిల్లీ: మోదీని కౌగిలించుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్‌ను మందలించారు. సభ్యులంతా సభా మర్యాదలు పాటించాలని ఆమె కోరారు. రాహుల్ ఎవరిని కౌగిలించుకున్నా తానేమీ వ్యతిరేకిని కాననీ, అయితే సభలో మర్యాదతో నడచుకోవాలని ఆమె కోరారు. తనకెవరూ శత్రువు కాదనీ, రాహుల్ తన కొడుకులాంటి వాడని ఆమె పేర్కొన్నారు. ఆయన మోదీని కౌగిలించుకోవడం తనకు ఓ డ్రామాలా అనిపించిందన్నారు. హోదాపై మాట లేదు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. గంటకుపైగా ప్రసంగించినా ఎక్కడా ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి చిన్న మాట కూడా ఎత్తలేదు. కేవలం గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ తీరును ఆయన వివరించారని చెప్పి ముగించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన అన్ని హామీలనూ బీజేపీ సమ్మతించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, ఆర్థిక లోటు భర్తీ హామీలను అమలు చేసేందుకు బీజేపీ అంగీకరించిందని అన్నారు. ఏపీకిచ్చిన హామీలను 2016లో మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో తిరిగి ప్రస్తావించారన్నారు. -
అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అనుమతించని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. శుక్రవారం (జూలై 20న) చర్చతోపాటు ఓటింగ్ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సభాపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, బి.శ్రీరాములు, సి.ఎస్.పుట్టరాజు ఇచ్చిన రాజీనామాలు ఆమోదించినట్లు సభకు వెల్లడించారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. శుక్రవారం జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. విశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. ‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ రావు, తోట నర్సింహం, తారిఖ్ అన్వర్, మహ్మద్ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, కేసీ వేణుగోపాల్ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తూ నోటీసులందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఇందులో ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక కూడా ఉన్నారు. అధికార బీజేపీ సహా.. శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు కూర్చున్నారు. మొత్తంగా విపక్షాలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు లేచి నిలుచున్నారు. సభాపతి వారిని లెక్కించి నిబంధనల ప్రకారం అవసరమైన (50 మందికి పైగా) సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. పాలేవో, నీళ్లేవో తేలిపోతాయ్: కేంద్రం ఈనేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ లేచి మాట్లాడారు. ‘విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలేవో నీళ్లేవో తెలిసిపోతాయి’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభాపతి జీరో అవర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడారు. తాను అవిశ్వాస తీర్మానానికి ముందుగానే నోటీసులు ఇచ్చానని, పెద్ద పార్టీ అయినందున తాను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి బదులిస్తూ నోటీసులు ఇచ్చిన అందరి పేర్లు ప్రస్తావించానని, పార్టీ పరిమాణాలతో సంబంధం లేకుండా.. అందరి కంటే ముందుగా ఇచ్చిన వారినే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తానని తెలిపారు. సభ వాయిదా పడి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి ప్రారంభమైన అనంతరం.. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ, ఓటింగ్ ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ శుక్రవారం నాడు చర్చ ఆలస్యమైతే.. ఓటింగ్ సోమవారం జరిగే అవకాశం ఉంది. మమత మద్దతు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన పార్టీలకు తమ మద్దతుంటుందని తృణమూల్ చీఫ్ మమత బెనర్జీ స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు కట్టుబడి ఉన్నందున సంపూర్ణ మద్దతుంటుందని ఆమె కోల్‌కతాలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది అందుకే ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. సభలో బీజేపీకి మద్దతున్నప్పటికీ.. బయట పూర్తి వ్యతిరేకత ఉంది’ అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీలంతా శుక్రవారం సభకు హాజరవ్వాలని.. చర్చ, ఓటింగ్‌లో పాల్గొనాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. దేనిపైనైనా చర్చకు సిద్ధం: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. రాజకీయ పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే పలు అంశాలపై దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం సభ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. విస్తృతమైన అంశాలపై సభలో కూలంకశంగా చర్చ జరిగేలా ఎంపీలు వ్యవహరించాలని.. రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన అంశాలపై సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు విపక్షాలు సహకరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయ పార్టీ సభ్యుడైనా, దేశానికి లాభం చేసే ఏ అంశాన్నైనా సభ దృష్టికి తెస్తే.. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలాంటి చర్చల ద్వారా ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు అందుతాయి’ అని మోదీ పేర్కొన్నారు. అవిశ్వాసం నెగ్గుతుంది: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రాజీవ్ సాతవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేకపోయారనీ, ఇది గారడీ ప్రభుత్వమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయింది. పైపెచ్చు, స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన ధనం 50శాతంపైగా పెరిగింది. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చి 50 నెలలు గడిచినా ఒక్కటీ నెరవేరలేదు. కశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది. దళితులపై దాడులు పెచ్చుమీరాయి’ అని విమర్శలు గుప్పించారు. అంతకుముందు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేందుకు సభలో అవసరమైన సంఖ్యాబలం లేదని మీడియా ప్రశ్నించగా.. ‘మాకు బలం లేదని ఎవరన్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభలో ఉండాలంటూ తన సభ్యులకు కాంగ్రెస్ విప్ కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగ్‌కు స్పీకర్ అంగీకరించిన నేపథ్యంలో బుధవారం వరకు అవిశ్వాసానికి అనుకూల, వ్యతిరేక, తటస్థ పార్టీల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, విజయ్ గోయల్, జితేంద్రసింగ్, మేఘ్వాల్ పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ -
‘ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ దేవాలయం లాంటిదని అలాంటి చోట ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చర్చలు జరగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై మహాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘విజన్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన వర్క్ షాప్‌లో పాల్గొన్న స్పీకర్ పార్లమెంట్ కార్యకలాపాలపై మాట్లాడారు. సమస్యల గురించి చర్చించాల్సిన చోట సభ్యుల మధ్య వాగ్వాదాలు జరుతున్నాయని మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్న విషయం ఎంపీలు గుర్తెరిగి ప్రవర్తించాలని, ఎన్నికల సమయంలో సభను అర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొన్నారు. ఎంపీలందరూ సభ రూల్స్ పాటించాలని, వెల్ లోపలికి వచ్చి అవాంతరం కలిగించి సభా మర్యాదలకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు. సభ్యుల చర్యల వల్ల గత బడ్జెట్ సమావేశంలో 127 గంటల సమయం వృథా అయిందని, 29 సార్లు సమావేశమైతే కేవలం 0.58 శాతం ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహాజన్ పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష, అధికార పక్షాలు మహిళా రిజర్వేషన్లకు సహకరించాలని ఆమె ఎంపీలను కోరారు. మీడియా ప్రసారాలపై స్పీకర్ ఆగ్రహించారు. సభలో మంచి చర్చ జరిగినప్పుడు ప్రచారం చేయ్యరని, సభ్యుల మధ్య వాగ్వాదం జరిగితే పదేపదే ప్రసారం చేస్తారని అన్నారు. -
పోటీతత్వంతో అభివృద్ధి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందాయాని, మరికొన్ని జిల్లాలు వెనకబడి ఉంటాయని మోదీ అన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నట్లే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందన్నారు. పోటీ తత్వం వల్ల రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. -
పులివెందుల ఘటనపై అవినాష్‌రెడ్డి ఫిర్యాదు
వైఎస్సార్ జిల్లా : తనకు జరిగిన అవమానంపై లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన చేతిలోని మైక్ లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక రౌడీ షీటర్ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సభలో వందల సంఖ్యలో టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనతో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడినే అవమానించారన్నారు. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్‌లు జత చేసి స్పీకర్‌కు పంపారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు. -
మోదీకి థ్యాంక్స్.. లోక్‌సభలో లొల్లి.. గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీని తాకింది. పార్లమెంటులోని లోక్‌సభలో ఎన్నికల ఫలితాలు ధుమారం రేపాయి. ప్రతిపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి లేచి బెంచ్‌లపై నిల్చొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇంతకీ సభలో ఏం జరిగిందంటే.. సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే, లోక్‌సభ ప్రారంభంకాగానే ట్రెజరీ విభాగానికి చెందిన బీజేపీ ఎంపీ కిరిట్ సోమయా తొలి ప్రశ్న అడగాల్సి ఉంది. అయితే, ఆయన అందుకు బదులు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయింది, గుజరాత్లో మరోసారి బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నేను ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఆయన చర్యను తప్పుబట్టాయి. వెంటనే తమ స్థానాల్లో నుంచి నిల్చొని కేంద్రం వ్యతిరేక నినాదాలు చేశాయి. స్పీకర్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో సభను వాయిదా వేశారు. -
పీసీఐ సభ్యులుగా ముగ్గురు ఎంపీలు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యులు టీజీ వెంకటేశ్ బాబు (అన్నాడీఎంకే), మీనాక్షి లేఖి (బీజేపీ) , ప్రతాప్ సింహ (బీజేపీ)లను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు స్పీకర్ సుమిత్రా మహాజన్ నామినేట్ చేశారు. నిబంధనల ప్రకారం పీసీఐలో 28 మంది సభ్యులు ఉండాలి. వారిలో ముగ్గురు లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అయ్యుండాలి. లోక్‌సభ సభ్యులను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ సభ్యులను రాజ్యసభ అధ్యక్షుడైన ఉప రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. -
దుర్గమ్మ సేవలో లోక్‌సభ స్పీకర్
విజయవాడ : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనకదుర్గ అమ్మ వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ఈవో, వేద పండితులు ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. -
వాయిదాలతో కాలక్షేపం!
అనుకున్నట్టే పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు వాయిదాలతో మొదల య్యాయి. చివరి వరకూ అవి ఈ మాదిరిగానే కొనసాగి ముగిసేలా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిలదీస్తామని సమావేశాలకు చాలాముందే కాంగ్రెస్ చెప్పింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఆ పార్టీతోపాటు విపక్షాలన్నీ ఉత్తరాఖండ్‌పై చర్చకు పట్టు బట్టాయి. అటు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది గనుక వీలుపడదని స్పష్టం చేసింది. కనుక సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని అందరూ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం స్పీకర్ చెప్పినా ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ సంగతి అధికార పక్షానికి కూడా తెలియకపోలేదు. దేశంలో కరువు పరిస్థితి, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని ఆహ్వానించడంలాంటి అంశాలు ఇప్పటికే ఉండగా అదనంగా అరుణాచల్, ఉత్తరాఖండ్ సంక్షోభాలు వీటికొచ్చి చేరడంవల్ల సమావేశాలు సక్రమంగా సాగబోవని ప్రభుత్వ పెద్దలు ముందే గ్రహించారు. అందుకే పార్లమెంటులో కొత్తగా ఐఐఎం బిల్లు మాత్రమే ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు యూపీఏ హయాంలో ఇష్రాత్జహాన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి అఫిడవిట్లలో సవరణలు, అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంవంటి అంశాలను లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని వ్యూహం పన్నింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వివిధ మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ కమిటీలు అధ్యయనం చేసి ఆయా శాఖల నుంచి వచ్చిన పద్దుల్ని పరిశీలించి, చర్చించి అవసరమైన ఆమోదం ఇచ్చేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈసారి ఫిబ్రవరి 23న మొదలైన బడ్జెట్ సమావేశాలు మార్చి 16 వరకూ కొనసాగాయి. 40 రోజుల వ్యవధి తర్వాత సోమవారం రెండో దశ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఇవి వచ్చే నెల 13 వరకూ కొనసాగవలసి ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు ఉభయ సభలనూ కేవలం రెండు చట్టసభలుగానే చూడలేదు. దేశంలో జరగాల్సిన సామాజిక, ఆర్ధిక మార్పులకు వాటిని సాధనాలుగా భావించారు. దేశాన్ని పట్టిపీడించే సమస్యలపై అవి కూలంకషంగా చర్చించి సామరస్యపూర్వకమైన పరిష్కారాలకు తోడ్పడతాయని విశ్వసించారు. ఎన్నికయ్యే ప్రతినిధులు విశాల ప్రజానీకం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని వారు కోరుకున్నారు. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. బాధ్యతాయుతమైన చర్చలకు బదులు చట్టసభలు బలాబలాల్ని తేల్చుకునే వేదికలవుతున్నాయి. సభలో మెజారిటీ ఉన్నది గనుక ఏమైనా చేయొచ్చునన్న ధోరణి పాలకపక్షంలో ప్రబలుతున్నది. ఇప్పుడు అరుణాచల్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రపతి పాలన విధింపు వ్యవ హారాన్నే చూస్తే ఆ చర్యలు మహాపరాధమన్నట్టు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్...తన ఏలుబడిలో అలాంటి పాపాలకు అనేకానేకసార్లు ఒడిగట్టింది. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా మారింది లేదు. కేరళలో 1951లో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అది మొదలు ఇంతవరకూ మొత్తంగా 111సార్లు దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. అందులో సింహభాగం కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధింపును వ్యతిరేకించే ముందు ఇలాంటి నేరాలు గతంలో తాము కూడా చేశామని అంగీ కరించి, క్షమాపణలు కోరడం ఆ పార్టీ కనీస బాధ్యత. అంతేకాదు... భవిష్యత్తులో ఆ నేరం ఎన్నడూ చేయబోమని కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చెప్పడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నట్టు కనబడదు. అటు విపక్షంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్టు కనబడిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకొచ్చి అలాంటి పని చేయడానికి వెరవలేదు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం పర్యవసానంగా రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదని బీజేపీ వాదిస్తున్నది. అందులో నిజం ఉందనుకున్నా ఆ ప్రభుత్వాలు మైనారిటీలో పడ్డాయో లేదో తేలాల్సింది రాజ్భవన్లలో కాదు... అక్కడి చట్టసభల్లో! అలా తేలాక తీసుకోవాల్సిన చర్యను ముందే తీసుకోవడం రాజ్యాంగపరంగా, నైతికంగా మాత్రమే కాదు...రాజకీయంగా కూడా తప్పిదమని పాలకులు గుర్తించలేకపోయారు. దేశంలో పది రాష్ట్రాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక లక్షలాదిమంది జనం వలస బాట పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి ఉపశమన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. అందుకు తోడ్పడవలసిన పార్లమెంటు సమావేశాలు కాస్తా కీచులాటల్లో చిక్కుకోవడం బాధాకరం. ఇవి సక్రమంగా సాగకపోతే గత ఏడాదిన్నరలో వరసగా మూడు సమావేశాలు వాయిదాల్లో గడిచినట్టవుతుంది. ఇది ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీయడమే కాదు...ప్రపంచ దేశాల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను నగుబాటు పాలుచేస్తుంది. సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతోసహా ఎన్నో కీలక బిల్లులు అనిశ్చితిలో పడిపోయిన ఇలాంటి తరుణంలో ఇరుపక్షాలూ ప్రతిష్టకు పోకుండా ఒక అవగాహనకొచ్చి సమావేశాలు సజావుగా సాగడానికి కృషి చేయాలి. అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి. -
లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్య ధోరణి నెలకొంది. లలిత్ మోదీ అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. రెండున్నర గంటలపాటు సభలో ఈ అంశంపై చర్చ జరగనుంది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే చర్చ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభ కొద్దిసేపు వాయిదా పడింది. -
25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
* సభకు అంతరాయం కలిగించినందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్య * సభకు అంతరాయం కలిగించినందుకు చర్య * కొనసాగిన విపక్ష సభ్యుల నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన * 25 మంది కాంగ్రెస్ సభ్యులను 5 రోజులు సస్పెండ్ చేస్తూ ప్రకటన * సస్పెండ్ అయిన సభ్యులకు 9 విపక్షాల సంఘీభావం.. * సభను బహిష్కరించాలని నిర్ణయం వివిధ వివాదాలు, కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. అయినా కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు. కాగా సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంట్ సమావేశాలను ఐదు రోజులు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతోపాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించాయి. సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వివాదాలు, స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలలను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు మొత్తం 44 మంది సభ్యులున్న విషయం విదితమే. లలిత్‌గేట్ వివాదంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్చౌహాన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. వామపక్షాలూ ఆందోళనలో పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు పట్టుకుని పోడియానికి కుడివైపు మౌనప్రదర్శన చేశారు. నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు నడిపారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదువుతూ ప్లకార్డులు తీసేయాలని, తమ స్థానాల్లో కూర్చోవాలని.. లేదంటే కఠిన నిర్ణయం తప్పదని పలుమార్లు హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ఉపసభాపతి గంట పాటు సభను నడిపించారు. పలు అంశాలపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు యువ సభ్యులు స్పీకర్ పోడియం (టేబుల్) పైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ప్లకార్డులను మైకుల్లా తయారు చేసి వాటి ద్వారా అరవడం వంటి చర్యలకు దిగారు. 3 గంటలకు స్పీకర్ సుమిత్రామహాజన్ తిరిగి సభాపతి స్థానంలోకి వచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఖర్గే మాట్లాడబోతుండగా బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఖర్గే ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు రాజీనామాలకు పట్టుబడితే రాజీనామాలు చేశాకే చర్చ జరిపాం. ఇప్పుడు మీరూ దానికి కట్టుబడండి. మీరు (ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు) రాజీనామా చేశాకే చర్చకు రండి’ అని అన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేస్తూ.. ‘మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రులు రాజీనామా చేయడానికి వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సీవీసీ గానీ, లేదా ఇతర ఏ దర్యాప్తు సంస్థ అయినా వారిని తప్పుబట్టలేదు. మేం చర్చకు సిద్ధం’ అని చెప్పారు. దీంతో కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు. కాగా, సస్పెన్షన్ ఉదంతం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా అన్నారు. మోదీ సర్కారు గుజరాత్ నమూనా ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలో అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత ఖర్గే మండిపడ్డారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంటు సమావేశాలను ఐదు రోజుల పాటు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతో పాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను కేంద్రం, అధికార బీజేపీ సమర్థించాయి. సస్పెండైన సభ్యులు వీరే.. బి.ఎన్. చంద్రప్ప, సంతోఖ్ సింగ్ చౌదరి, అబూ ఖాన్ చౌదరి, సుష్మితాదేవ్,ధ్రువ్నారాయణ్, నైనంగ్ ఎరింగ్, గౌరవ్ గోగోయ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, దీపేందర్‌సింగ్ హుడా, కె.సురేష్, తోక్చోం మేన్యా, ఎస్.పి.ముద్దహనుమే గౌడ, అభిజిత్ముఖర్జీ, ముల్లపల్లి రామచంద్రన్, కె.హెచ్.మునియప్ప, బి.వి.నాయక్, విన్సెంట్‌పాలా, ఎం.కె.రాఘవన్, రంజీత్ రంజన్, సి.ఎల్.రౌలా, తామ్రద్వజ్ సాహు, రాజీవ్సాతవ్, రవ్నీత్ సింగ్, డి.కె.సురేష్, కె.సి.వేణుగోపాల్. గతంలో సస్పెన్షన్లు ఇలా... 1989మార్చి 15: బోఫోర్స్ స్కాంపై ఆందోళనతో 63 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. 2012 ఏప్రిల్ 04: 8 మంది అధికార కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఆ ప్రాంత ఎంపీల ఆందోళనతో అధికార పార్టీ సొంత సభ్యులనే సస్పెండ్ చేసిన ఘటన ఇదే. 2013 ఆగస్టు 23: ఏపీ విభజనను వ్యతిరేకించిన 11మంది సీమాంధ్ర ఎంపీలను 5 రోజులు సస్పెండ్ చేశారు. 2013 సెప్టెంబర్ 2: సమైక్యాంధ్రప్రదేశ్ ఆందోళన వల్ల 9 మంది సస్పెండ్. 2014 ఫిబ్రవరి 13: తెలంగాణ బిల్లుపై ఇరు ప్రాంతాల సభ్యలు ఆందోళనతో 16 మంది సభ్యుల సస్పెన్షన్. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వినియోగించిన ఉదంతం అప్పుడు చోటు చేసుకుంది. -
అందరి సహకారాన్ని ఆశిస్తున్నా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులతో ఆమె అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వాడి వేడిగా సభలో సమరం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం రాకుండా నేతలంతా తనకు సహకరిస్తారని హామీ ఇచ్చారన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన సాయుధ దళాల సిబ్బందికి నివాళులు అర్పించేందుకు ఇకపై లోక్‌సభలో ఒక రోజును కేటాయించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. సమావేశాలకు, సమావేశాలకు మధ్య కాలంలో చనిపోయిన ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులకు, ఉగ్రవాద ఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉభయ సభల్లో నివాళులు అర్పించటం సంప్రదాయంగా ఉంది. విధి నిర్వహణలో చనిపోయిన భద్రతా బలగాల సిబ్బందికి కూడా పార్లమెంటులో నివాళులు అర్పించాలన్న సూచనను సభ్యులందరూ ఆహ్వానించారని ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పార్లమెంటులో 64 పెండింగ్ బిల్లులు వివాదాస్పద భూ సేకరణ బిల్లుతో సహా మొత్తం 64 బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని.. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన బృందం వెల్లడించింది. ఇందులో.. జీఎస్టీ బిల్లు, అవినీతి నిరోధక (సవరణ బిల్లు), ప్రజావేగుల భద్రత (సవరణ) బిల్లు వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు న్యూఢిల్లీ: లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ బీజేపీ నేతలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చూస్తూ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీ ఆందోళనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. -
ఆడపిల్లల్లో విద్యావ్యాప్తికి కృషి అవసరం
* వీవీ కన్యాశాల శతాబ్ది ఉత్సవాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ * నిజాం పాలనలో ఈ స్కూలును నడిపించడం సాహసోపేతమే సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అమ్మాయిని విద్యావంతురాలిని చేస్తే ఆమె కుటుంబ సభ్యులందరినీ విద్యావంతులను చేసినట్లేనని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కన్యాశాల శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ ప్రసంగిస్తూ ఏదైనా సంస్థ వందేళ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమని, అందులోనూ అమ్మాయిలకు విద్యనందించే సంస్థ ఈ ఘనత సాధించడం మరెంతో గొప్ప విషయమన్నారు. నిజాం పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యార్థినుల కోసం మరాఠీలో వీవీ కన్యాశాలను నడిపించడం సాహసోపేతమైనదన్నారు. గతం నుంచి తెలంగాణ పోరాటం అన్యాయం, అక్రమాలపై జరిగిందని, సమ్మక్క, సారక్కలు ఆధిపత్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి అమరత్వం పొందారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రెండేళ్లలో కోటి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బతుకమ్మ, బోనాలతో చైతన్యం: కవిత తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ, బోనాల ద్వారా సంస్కృతిని చాటి మహిళలను చైతన్యవంతులను చేశామని ఎంపీ కవిత అన్నారు. మరాఠీ మాతృభాష అయినాకాళోజీ నారాయణరావు తెలుగులో రాసిన కవితలు తెలంగాణ ఉద్యమంలో నినాదాలుగా పనిచేశాయన్నారు. -
'హ్యాపీ బర్త్ డే టూ యూ సుమిత్రాజీ'
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యంతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో తెలియజేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సుమిత్రా మహాజన్ 1943లో ఏప్రిల్ 12న జన్మించారు. ఎనిమిదిసార్లు పార్లమెంటుకు ఎన్నికైన సుమిత్రా.. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేస్తున్న రెండో మహిళ. లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరాకుమార్ పనిచేసిన విషయం తెలిసిందే. -
పార్లమెంటులో ‘బ్లాక్‌మనీ’రచ్చ
ఒక్కటైన ప్రతిపక్షం: నినాదాలతో హోరెత్తిన ఉభయసభలు నేడు చర్చకు అంగీకరించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల వేడిని అధికార పక్షం మొదటిరోజే చవిచూసింది. ఉభయసభలు మంగళవారం ఉదయం ప్రారంభం కావడంతోనే ‘100 రోజులు గడిచాయి.. బ్లాక్ మనీ ఎక్కడ?’ అనే నినాదాలతో హోరెత్తాయి. నల్లధనం విషయంలో బీజేపీ తన ఎన్నికల హామీని అమలు చేయడంలో విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఐక్యంగా గళమెత్తాయి. బ్లాక్‌మనీని భారత్‌కు తిరిగి తెప్పించేందుకు చేపట్టిన చర్యలను సభకు వివరించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్.. తదితర పార్టీల ఎంపీలు నల్లధనం అంశంపై సభలో నినాదాలు మొదలెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను ప్రారంభించడంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తృణమూల్ ఎంపీలు ‘నల్ల ధనాన్ని వెనక్కు తెండి’ అని రాసిన నల్ల గొడుగులను ప్రదర్శించారు. ఈ విషయంలో చేపట్టిన చర్యలను సభకు వివరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. బ్లాక్‌మనీ విషయంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలంతా యూపీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేశారని, అందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. దానికి ‘గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ బ్లాక్‌మనీ దేశం నుంచి తరలివెళ్లింది’ అని వెంకయ్య బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి బ్లాక్‌మనీపై చర్చ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ గందరగోళం మధ్యనే క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించారు. మరోవైపు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీయూ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ కార్యకలాపాలను కూడా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ నల్లధనం అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం బ్లాక్‌మనీని వెనక్కు తెస్తుందని ప్రజలు ఆశించినా ఆ హామీని సర్కారు నిలుపుకోవడంలేదని విమర్శించారు. అయితే దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఉభయ సభల్లో బిల్లులు * నాలుగు ట్రిపుల్ ఐటీ(అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం)ల యాజమాన్యాలను ఒకే ఛత్రం కిందకు తెచ్చే ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బిల్, 2014’ను మానవ వనరుల శాఖ మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును టీఆర్ఎస్ ఎంపీ కవిత సహా ఎంపీలంతా స్వాగతించారు. * ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ మధ్యనే సీబీఐ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. * యూజీసీ, ఏఐసీటీఈ వంటి నియంత్రణ సంస్థల స్థానంలో ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్, 2011’ను మోదీ ప్రభుత్వం రాజ్యసభ నుంచి ఉపసంహరించింది. నల్లధనం ఎంతో ఎవరికీ తెలియదు: ఆర్బీఐ గవర్నర్ విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం ఎంతో ఎవరకీ తెలియకున్నా ఈ విషయంలో ఊహాగానాలు సాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మంగళవారం గుజరాత్‌లోని ఆనంద్‌లో చెప్పారు. ఆదా యపు పన్ను రేట్లను మరింత తగ్గించడం ద్వారా అక్రమ నిధుల పుట్టుకను అరికట్టవచ్చన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎగువ తరగతివారికి ప్రోత్సాహకరంగా ఉండేలా పన్నురేట్లు తగ్గించాల్సి ఉందన్నారు. ‘కార్మిక’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం కార్మిక చట్టాల సరళీకరణకు సంబంధించిన సవరణ బిల్లు (ద లేబర్ లా అమెండ్మెంట్ బిల్-2011)ను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును సభలో కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు. 40 మంది వరకు ఉద్యోగులున్న పరిశ్రమలు, సంస్థల విషయంలో కార్మిక చట్టాల సరళీకరణకు ఉద్దేశించిన బిల్లు అది. పారదర్శకతకు, జవాబుదారీతనానికి, నిబంధనల కచ్చితమైన అమలుకు.. పెద్దపీట వేసేలా సవరణలను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించేలా.. రిటర్న్ దాఖలులో, రిజిస్టర్ల నిర్వహణలో కొన్ని వెసులుబాట్లను బిల్లులో పొందుపర్చారు. చిన్న తరహా పరిశ్రమ నిర్వచనాన్ని కూడా మార్చారు. 10 మందికి తగ్గకుండా.. 40 మందికి మించకుండా ఉద్యోగులు/కార్మికులు ఉన్న సంస్థ/ పరిశ్రమ ఆ కేటగిరీలో ఉంటుంది. ఈ బిల్లులోని నిబంధనలు కార్మికులకు వ్యతిరేకంగా, వారికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ, సీపీఎం ఎంపీ తపన్‌కుమార్ సేన్, సీపీఐ ఎంపీ డి. రాజా, జేడీయూ ఎంపీ కేసీ త్యాగి దీనిపై జరిగిన చర్చలో ఆరోపించారు. అనంతరం వామపక్ష, జేడీయూ ఎంపీల నిరసనల మధ్యనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌లో అనుకూలంగా 49 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓటేశారు. శివసేన సైతం బిల్లుకు మద్దతిచ్చింది.