
న్యూఢిల్లీ: కేరళను ఉదారంగా ఆదుకోవాలని పార్లమెంటు ఉభయసభల స్పీకర్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సభ్యులందరూ తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సాయం చేయాలని కోరారు. సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్య భేటీ అయ్యారు. ఎంపీలందరూ ఓ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉభయసభల స్పీకర్లు కోరారు. కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. మానవుల కారణంగా లేదా ప్రకృతి ప్రకోపం వల్ల విపత్తులు సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు సభ్యుడు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ కేటాయించవచ్చని తెలిపారు. అదే తీవ్ర విపత్తు సంభవిస్తే గరిష్టంగా రూ.కోటి వరకూ సాయం చేయొచ్చని వెల్లడించారు.