లోక్‌సభలో ప్రణబ్ ముఖర్జీకి నివాళిగా మౌనం పాటిస్తున్న ప్రధాని మోదీ తదితరులు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు సోమవారం వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యాన్ని, సభ్యుల వాణిని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించాయి. కోవిడ్ కారణంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తామని ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ అవర్ అత్యంత కీలకమని, ఈ సమయంలోనే ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం లభిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఎంసీ తదితర పార్టీల సభ్యులూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సాధారణంగా సభ ప్రారంభం కాగానే తొలి గంట ప్రశ్నోత్తరాల సమయంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజన అంశాలపై సభ్యులను మంత్రులను ప్రశ్నించి, సమాధానాలు పొందవచ్చు.
తాజా సమావేశాల్లో, కరోనా ముప్పు కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల సభాకార్యక్రమాల్లో క్వశ్చన్ అవర్‌ను, ప్రైవేటు మెంబర్ బిజినెస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభకు వివరించారు. ఈ నిర్ణయం తీసుకునేముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్ దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడారన్నారు. రాజ్‌నాథ్ కూడా మాట్లాడుతూ.. క్వశ్చన్ అవర్‌ను రద్దు చేయడానికి, జీరో అవర్‌ను 30 నిమిషాలకు కుదించడానికి దాదాపు అన్ని పార్టీల నాయకులు అంగీకరించారని వెల్లడించారు. సభ్యులెవరైనా ఏదైనా అంశంపై ప్రశ్నించాలనుకుంటే.. జీరో అవర్‌లో ప్రశ్నించవచ్చని తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా దుస్సాహసాల అంశాన్ని లేవనెత్తేందుకు కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్‌చౌధురి ప్రయత్నించారు. దీనికి అభ్యంతరపెట్టిన స్పీకర్.. మొదట బీఏసీ సమావేశంలో మొదట ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆయనకు సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రాజ్యసభ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతీరోజు 4 గంటల పాటు కాకుండా, సభాసమయాన్ని మరో గంట పెంచి, ఆ సమయాన్ని క్వశ్చన్ అవర్‌కు కేటాయించాలని ఆజాద్ సూచించారు.
నెంబర్ 1, 2, 3..
స్పీకర్ పోడియానికి కుడి వైపు అధికార పక్షం కూర్చుంది. నెంబర్ 1 అని రాసి ఉన్న స్థానంలో ప్రధాని మోదీ, నెంబర్ 2 అని రాసి ఉన్న స్థానంలో రాజ్‌నాథ్ సింగ్, నెంబర్ 3 అని రాసి ఉన్న స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూర్చున్నారు. విపక్షం వైపు ముందు సీట్లలో డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, ఆధిర్ రంజన్ చౌధురి కూర్చున్నారు. రెండో వరుసలో నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం కూర్చున్నారు. ములాయం వీల్‌చెయిర్‌లో సభలోనికి వచ్చారు. ప్రధాని సభలోకి ప్రవేశించగానే అధికార పక్ష సభ్యులు భారత్‌మాతా కీ జై అనే నినాదాలతో ఆయనను స్వాగతించారు. సభ్యులంతా మాస్క్‌లు ధరించడంతో పాటు, కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు.
జై జవాన్ ! దేశమంతా మీ వెనుకే..
దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో విధుల్లో ఉన్న వీర సైనికులకు సంఘీభావం తెలుపుతూ, దేశమంతా వారి వెనుకే ఉందన్న సందేశాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా వెలువరిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులకు సంఘీభావం తెలపడం చట్ట సభల అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముంచుకొస్తున్న తరుణంలో కఠిన పర్వత ప్రదేశాల్లో మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తున్నారు’ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉభయసభల్లో అన్ని ప్రజా ప్రయోజన అంశాలపై విలువైన, లోతైన చర్చలు జరగాలని, ఆ చర్చల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాలని ఆయన కోరారు. అలాగే, కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సభాకార్యక్రమాలను రిపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకు సూచించారు.
వారు ఇటు.. వీరు అటు
తొలిసారి లోక్‌సభ సభ్యులు రాజ్యసభ చాంబర్‌లో కూర్చుని లోక్‌సభ కార్యక్రమాల్లో.. రాజ్యసభ సభ్యులు లోక్‌సభలో కూర్చుని రాజ్యసభ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ సభ్యులకు స్థానాలను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉభయ సభల్లో, గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు కేటాయించారు. లోక్‌సభలో ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు, రాజ్యసభలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7వరకు సభా కార్యక్రమాలు నడిచాయి. కానీ, నేటి(మంగళవారం) నుంచి ఉదయం షిఫ్ట్‌లో రాజ్యసభ, మధ్యాహ్నం షిఫ్ట్‌లో లోక్‌సభ కార్యక్రమాలు సాగుతాయి. మాట్లాడే సభ్యుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘కూర్చుని ప్రసంగించడం కొందరికి కష్టం కావచ్చు’ అని చమత్కరించారు. అలాగే, ప్రతీ సభ్యుడి స్థానం ముందు పారదర్శక ప్లాస్టిక్ షీట్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఒక సభ్యుడు, 13 మంది మాజీ సభ్యుల మృతికి సభ్యులు నివాళులర్పించారు. ఆ తరువాత, గంట వాయిదా అనంతరం సభ మళ్లీ సమావేశమైంది. ఆ సమయానికి సభకు హాజరైన సభ్యుల సంఖ్య కూడా కొంత పెరిగింది.
25 మంది ఎంపీలకు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: 17 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శుక్ర, శని వారాల్లో పార్లమెంటు సభ్యులకు ఇక్కడి పార్లమెంటు అనుబంధ భవనంలో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఆయా పరీక్షల రిపోర్టులు రాగా 25 మందికి వైరస్ సోకినట్టు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. వైరస్ బారిన పడినవారిలో లోక్‌సభ సభ్యుల్లో బీజేపీకి చెందిన 12 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిన ఎంపీలు కొందరు క్వారంటైన్‌లో ఉండగా.. మరికొందరు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాజస్తాన్‌కు చెందిన ఆర్‌ఎల్పీ ఎంపీ హనుమాన్ బెణివాల్‌కు పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే, తాను జైపూర్‌లోని ఒక ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నానని, ఆ పరీక్షలో నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని ఆయన తెలిపారు. ఏ ఫలితాన్ని తాను విశ్వసించాలని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సభానాయకుడు తావర్‌చంద్ గెహ్లోత్ ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు కానీ, ఓటింగ్‌కు పట్టుబట్ట లేదు. రాజ్యసభ డి³N్యటీ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన జేడీయూ నేత హరివంశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన అన్ని పక్షాలకు చెందినవాడన్నారు. సభను నిష్పక్షపాతంతో నడుపుతారని, అద్భుతమైన అంపైర్ అని ప్రశంసించారు. జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరికీ ఆప్తుడుగా ఉన్నారన్నారు.
రాజ్యసభలో కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న చైర్మన్ వెంకయ్యనాయుడు
Comments
Please login to add a commentAdd a comment