సుమిత్రా మహాజన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ దేవాలయం లాంటిదని అలాంటి చోట ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చర్చలు జరగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై మహాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘విజన్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన వర్క్ షాప్‌లో పాల్గొన్న స్పీకర్ పార్లమెంట్ కార్యకలాపాలపై మాట్లాడారు. సమస్యల గురించి చర్చించాల్సిన చోట సభ్యుల మధ్య వాగ్వాదాలు జరుతున్నాయని మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సభా కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్న విషయం ఎంపీలు గుర్తెరిగి ప్రవర్తించాలని, ఎన్నికల సమయంలో సభను అర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొన్నారు. ఎంపీలందరూ సభ రూల్స్ పాటించాలని, వెల్ లోపలికి వచ్చి అవాంతరం కలిగించి సభా మర్యాదలకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు.
సభ్యుల చర్యల వల్ల గత బడ్జెట్ సమావేశంలో 127 గంటల సమయం వృథా అయిందని, 29 సార్లు సమావేశమైతే కేవలం 0.58 శాతం ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహాజన్ పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష, అధికార పక్షాలు మహిళా రిజర్వేషన్లకు సహకరించాలని ఆమె ఎంపీలను కోరారు. మీడియా ప్రసారాలపై స్పీకర్ ఆగ్రహించారు. సభలో మంచి చర్చ జరిగినప్పుడు ప్రచారం చేయ్యరని, సభ్యుల మధ్య వాగ్వాదం జరిగితే పదేపదే ప్రసారం చేస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment