న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని వెల్లడించారు.
గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment