పార్లమెంట్ ప్రాంగణంలో ‘ఇండియా’ ఎంపీల నినాదాలు
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో గాం«దీజీ విగ్రహం ఉన్నచోట విపక్ష ఎంపీలు గుమికూడారు. రాజ్యాంగం ప్రతులను చేతబూని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం జోలికి రావొద్దు: రాహుల్
పవిత్రమైన మన రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష కూటమి సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగంపై ఎవరు దాడికి దిగినా సహించబోమని తేలి్చచెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదని తేలి్చచెప్పారు. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటామని స్పష్టంచేశారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం
ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల గొంతుకను సభలో వినిపిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి మోదీ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తొలి 15 రోజుల్లో ఎన్నో ఘోరాలు, ప్రమాదాలు జరిగాయని, పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని, ధరలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment