అందరి సహకారాన్ని ఆశిస్తున్నా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులతో ఆమె అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వాడి వేడిగా సభలో సమరం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం రాకుండా నేతలంతా తనకు సహకరిస్తారని హామీ ఇచ్చారన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన సాయుధ దళాల సిబ్బందికి నివాళులు అర్పించేందుకు ఇకపై లోక్‌సభలో ఒక రోజును కేటాయించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు.
సమావేశాలకు, సమావేశాలకు మధ్య కాలంలో చనిపోయిన ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులకు, ఉగ్రవాద ఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉభయ సభల్లో నివాళులు అర్పించటం సంప్రదాయంగా ఉంది. విధి నిర్వహణలో చనిపోయిన భద్రతా బలగాల సిబ్బందికి కూడా పార్లమెంటులో నివాళులు అర్పించాలన్న సూచనను సభ్యులందరూ ఆహ్వానించారని ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
పార్లమెంటులో 64 పెండింగ్ బిల్లులు
వివాదాస్పద భూ సేకరణ బిల్లుతో సహా మొత్తం 64 బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని.. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన బృందం వెల్లడించింది. ఇందులో.. జీఎస్‌టీ బిల్లు, అవినీతి నిరోధక (సవరణ బిల్లు), ప్రజావేగుల భద్రత (సవరణ) బిల్లు వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు
న్యూఢిల్లీ: లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ బీజేపీ నేతలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చూస్తూ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీ ఆందోళనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు.