అనుకున్నట్టే పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు వాయిదాలతో మొదల య్యాయి. చివరి వరకూ అవి ఈ మాదిరిగానే కొనసాగి ముగిసేలా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిలదీస్తామని సమావేశాలకు చాలాముందే కాంగ్రెస్ చెప్పింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఆ పార్టీతోపాటు విపక్షాలన్నీ ఉత్తరాఖండ్‌పై చర్చకు పట్టు బట్టాయి. అటు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది గనుక వీలుపడదని స్పష్టం చేసింది. కనుక సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని అందరూ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం స్పీకర్ చెప్పినా ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
ఈ సంగతి అధికార పక్షానికి కూడా తెలియకపోలేదు. దేశంలో కరువు పరిస్థితి, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని ఆహ్వానించడంలాంటి అంశాలు ఇప్పటికే ఉండగా అదనంగా అరుణాచల్, ఉత్తరాఖండ్ సంక్షోభాలు వీటికొచ్చి చేరడంవల్ల సమావేశాలు సక్రమంగా సాగబోవని ప్రభుత్వ పెద్దలు ముందే గ్రహించారు. అందుకే పార్లమెంటులో కొత్తగా ఐఐఎం బిల్లు మాత్రమే ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అంతేకాదు యూపీఏ హయాంలో ఇష్రాత్‌జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి అఫిడవిట్‌లలో సవరణలు, అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంవంటి అంశాలను లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని వ్యూహం పన్నింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వివిధ మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ కమిటీలు అధ్యయనం చేసి ఆయా శాఖల నుంచి వచ్చిన పద్దుల్ని పరిశీలించి, చర్చించి అవసరమైన ఆమోదం ఇచ్చేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈసారి ఫిబ్రవరి 23న మొదలైన బడ్జెట్ సమావేశాలు మార్చి 16 వరకూ కొనసాగాయి. 40 రోజుల వ్యవధి తర్వాత సోమవారం రెండో దశ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఇవి వచ్చే నెల 13 వరకూ కొనసాగవలసి ఉంది.
మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు ఉభయ సభలనూ కేవలం రెండు చట్టసభలుగానే చూడలేదు. దేశంలో జరగాల్సిన సామాజిక, ఆర్ధిక మార్పులకు వాటిని సాధనాలుగా భావించారు. దేశాన్ని పట్టిపీడించే సమస్యలపై అవి కూలంకషంగా చర్చించి సామరస్యపూర్వకమైన పరిష్కారాలకు తోడ్పడతాయని విశ్వసించారు. ఎన్నికయ్యే ప్రతినిధులు విశాల ప్రజానీకం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని వారు కోరుకున్నారు. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. బాధ్యతాయుతమైన చర్చలకు బదులు చట్టసభలు బలాబలాల్ని తేల్చుకునే వేదికలవుతున్నాయి. సభలో మెజారిటీ ఉన్నది గనుక ఏమైనా చేయొచ్చునన్న ధోరణి పాలకపక్షంలో ప్రబలుతున్నది.
ఇప్పుడు అరుణాచల్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రపతి పాలన విధింపు వ్యవ హారాన్నే చూస్తే ఆ చర్యలు మహాపరాధమన్నట్టు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్...తన ఏలుబడిలో అలాంటి పాపాలకు అనేకానేకసార్లు ఒడిగట్టింది. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా మారింది లేదు. కేరళలో 1951లో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అది మొదలు ఇంతవరకూ మొత్తంగా 111సార్లు దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. అందులో సింహభాగం కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధింపును వ్యతిరేకించే ముందు ఇలాంటి నేరాలు గతంలో తాము కూడా చేశామని అంగీ కరించి, క్షమాపణలు కోరడం ఆ పార్టీ కనీస బాధ్యత. అంతేకాదు... భవిష్యత్తులో ఆ నేరం ఎన్నడూ చేయబోమని కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చెప్పడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నట్టు కనబడదు.
అటు విపక్షంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్టు కనబడిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకొచ్చి అలాంటి పని చేయడానికి వెరవలేదు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం పర్యవసానంగా రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదని బీజేపీ వాదిస్తున్నది. అందులో నిజం ఉందనుకున్నా ఆ ప్రభుత్వాలు మైనారిటీలో పడ్డాయో లేదో తేలాల్సింది రాజ్‌భవన్‌లలో కాదు... అక్కడి చట్టసభల్లో! అలా తేలాక తీసుకోవాల్సిన చర్యను ముందే తీసుకోవడం రాజ్యాంగపరంగా, నైతికంగా మాత్రమే కాదు...రాజకీయంగా కూడా తప్పిదమని పాలకులు గుర్తించలేకపోయారు.
దేశంలో పది రాష్ట్రాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక లక్షలాదిమంది జనం వలస బాట పడుతున్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి ఉపశమన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. అందుకు తోడ్పడవలసిన పార్లమెంటు సమావేశాలు కాస్తా కీచులాటల్లో చిక్కుకోవడం బాధాకరం. ఇవి సక్రమంగా సాగకపోతే గత ఏడాదిన్నరలో వరసగా మూడు సమావేశాలు వాయిదాల్లో గడిచినట్టవుతుంది. ఇది ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీయడమే కాదు...ప్రపంచ దేశాల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను నగుబాటు పాలుచేస్తుంది. సరుకులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుతోసహా ఎన్నో కీలక బిల్లులు అనిశ్చితిలో పడిపోయిన ఇలాంటి తరుణంలో ఇరుపక్షాలూ ప్రతిష్టకు పోకుండా ఒక అవగాహనకొచ్చి సమావేశాలు సజావుగా సాగడానికి కృషి చేయాలి. అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి.
వాయిదాలతో కాలక్షేపం!
Published Wed, Apr 27 2016 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement