రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచే  | Parliament Second part of Budget Session to begin on 10 March 2025 | Sakshi
Sakshi News home page

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచే 

Published Mon, Mar 10 2025 6:35 AM | Last Updated on Mon, Mar 10 2025 6:35 AM

Parliament Second part of Budget Session to begin on 10 March 2025

వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం!

మణిపూర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి 

కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ 

సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు అమో దం, మణిపూర్‌ బడ్జెట్‌ ఆమోదం, అత్యంత కీలకమైన వక్ఫ్‌ (సవరణ) ను ఆమోదంపై ఈ సమావేశాల్లో కేంద్రం దృష్టి సారించనుంది. వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇప్పటికే నివేదిక అందజేసింది. దాన్ని వీలైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్‌ ఆమోదం కోరుతూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మణిపూర్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. 

వాడీవేడిగా... 
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు వాడివేడీగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్‌ బిల్లుతో పాటు మణిపూర్‌ హింసాకాండ, లోక్‌సభ నియోజకవర్గాల పుర్వివభజన, అమెరికా సుంకాల పెంపు తదితరాలపై మోదీ సర్కారును గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు చేటు చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆయన ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పుర్వివభజనను, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. 

ఈ మేరకు రెండు తీర్మానాలను ఆమోదించారు. పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశి్చమబెంగాల్, పంజాబ్‌ పార్టీల మద్దతు కూడగట్టాలని డీఎంకే నిర్ణయించింది. ఇక నకిలీ ఎలక్టోరల్‌ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌)లపై కేంద్రాన్ని నిలదీయాలని టీఎంసీ నిర్ణయించింది. దీనిపై కలిసి రావాలని కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్‌)లను కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని కాంగ్రెస్‌ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లోనూ గళ మెత్తాలని పార్టీ              నిర్ణయించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement