సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి.
అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి.
సహకరించండి: ఉపరాష్ట్రపతి
సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్‌సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్‌ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్‌ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment