ఒక్కటైన ప్రతిపక్షం: నినాదాలతో హోరెత్తిన ఉభయసభలు
నేడు చర్చకు అంగీకరించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల వేడిని అధికార పక్షం మొదటిరోజే చవిచూసింది. ఉభయసభలు మంగళవారం ఉదయం ప్రారంభం కావడంతోనే ‘100 రోజులు గడిచాయి.. బ్లాక్ మనీ ఎక్కడ?’ అనే నినాదాలతో హోరెత్తాయి. నల్లధనం విషయంలో బీజేపీ తన ఎన్నికల హామీని అమలు చేయడంలో విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఐక్యంగా గళమెత్తాయి. బ్లాక్‌మనీని భారత్‌కు తిరిగి తెప్పించేందుకు చేపట్టిన చర్యలను సభకు వివరించాలని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్.. తదితర పార్టీల ఎంపీలు నల్లధనం అంశంపై సభలో నినాదాలు మొదలెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను ప్రారంభించడంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తృణమూల్ ఎంపీలు ‘నల్ల ధనాన్ని వెనక్కు తెండి’ అని రాసిన నల్ల గొడుగులను ప్రదర్శించారు. ఈ విషయంలో చేపట్టిన చర్యలను సభకు వివరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు.
బ్లాక్‌మనీ విషయంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలంతా యూపీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేశారని, అందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. దానికి ‘గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ బ్లాక్‌మనీ దేశం నుంచి తరలివెళ్లింది’ అని వెంకయ్య బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి బ్లాక్‌మనీపై చర్చ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ గందరగోళం మధ్యనే క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించారు. మరోవైపు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీయూ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ కార్యకలాపాలను కూడా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ నల్లధనం అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం బ్లాక్‌మనీని వెనక్కు తెస్తుందని ప్రజలు ఆశించినా ఆ హామీని సర్కారు నిలుపుకోవడంలేదని విమర్శించారు. అయితే దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
ఉభయ సభల్లో బిల్లులు
* నాలుగు ట్రిపుల్ ఐటీ(అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం)ల యాజమాన్యాలను ఒకే ఛత్రం కిందకు తెచ్చే ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బిల్, 2014’ను మానవ వనరుల శాఖ మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును టీఆర్‌ఎస్ ఎంపీ కవిత సహా ఎంపీలంతా స్వాగతించారు.
* ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ మధ్యనే సీబీఐ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
* యూజీసీ, ఏఐసీటీఈ వంటి నియంత్రణ సంస్థల స్థానంలో ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్, 2011’ను మోదీ ప్రభుత్వం రాజ్యసభ నుంచి ఉపసంహరించింది.
నల్లధనం ఎంతో ఎవరికీ తెలియదు: ఆర్‌బీఐ గవర్నర్
విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం ఎంతో ఎవరకీ తెలియకున్నా ఈ విషయంలో ఊహాగానాలు సాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మంగళవారం గుజరాత్‌లోని ఆనంద్‌లో చెప్పారు. ఆదా యపు పన్ను రేట్లను మరింత తగ్గించడం ద్వారా అక్రమ నిధుల పుట్టుకను అరికట్టవచ్చన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎగువ తరగతివారికి ప్రోత్సాహకరంగా ఉండేలా పన్నురేట్లు తగ్గించాల్సి ఉందన్నారు.
‘కార్మిక’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కార్మిక చట్టాల సరళీకరణకు సంబంధించిన సవరణ బిల్లు (ద లేబర్ లా అమెండ్‌మెంట్ బిల్-2011)ను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును సభలో కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు. 40 మంది వరకు ఉద్యోగులున్న పరిశ్రమలు, సంస్థల విషయంలో కార్మిక చట్టాల సరళీకరణకు ఉద్దేశించిన బిల్లు అది. పారదర్శకతకు, జవాబుదారీతనానికి, నిబంధనల కచ్చితమైన అమలుకు.. పెద్దపీట వేసేలా సవరణలను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించేలా.. రిటర్న్ దాఖలులో, రిజిస్టర్ల నిర్వహణలో కొన్ని వెసులుబాట్లను బిల్లులో పొందుపర్చారు.
చిన్న తరహా పరిశ్రమ నిర్వచనాన్ని కూడా మార్చారు. 10 మందికి తగ్గకుండా.. 40 మందికి మించకుండా ఉద్యోగులు/కార్మికులు ఉన్న సంస్థ/ పరిశ్రమ ఆ కేటగిరీలో ఉంటుంది. ఈ బిల్లులోని నిబంధనలు కార్మికులకు వ్యతిరేకంగా, వారికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ, సీపీఎం ఎంపీ తపన్‌కుమార్ సేన్, సీపీఐ ఎంపీ డి. రాజా, జేడీయూ ఎంపీ కేసీ త్యాగి దీనిపై జరిగిన చర్చలో ఆరోపించారు. అనంతరం వామపక్ష, జేడీయూ ఎంపీల నిరసనల మధ్యనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌లో అనుకూలంగా 49 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓటేశారు. శివసేన సైతం బిల్లుకు మద్దతిచ్చింది.
పార్లమెంటులో ‘బ్లాక్‌మనీ’రచ్చ
Published Wed, Nov 26 2014 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement