25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
* సభకు అంతరాయం కలిగించినందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్య
* సభకు అంతరాయం కలిగించినందుకు చర్య
* కొనసాగిన విపక్ష సభ్యుల నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన
* 25 మంది కాంగ్రెస్ సభ్యులను 5 రోజులు సస్పెండ్ చేస్తూ ప్రకటన
* సస్పెండ్ అయిన సభ్యులకు 9 విపక్షాల సంఘీభావం..
* సభను బహిష్కరించాలని నిర్ణయం
వివిధ వివాదాలు, కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు.
అయినా కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు. కాగా సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంట్ సమావేశాలను ఐదు రోజులు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతోపాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించాయి.
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వివాదాలు, స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలలను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు మొత్తం 44 మంది సభ్యులున్న విషయం విదితమే. లలిత్‌గేట్ వివాదంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్‌చౌహాన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. వామపక్షాలూ ఆందోళనలో పాల్గొన్నాయి.
తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు పట్టుకుని పోడియానికి కుడివైపు మౌనప్రదర్శన చేశారు. నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు నడిపారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదువుతూ ప్లకార్డులు తీసేయాలని, తమ స్థానాల్లో కూర్చోవాలని.. లేదంటే కఠిన నిర్ణయం తప్పదని పలుమార్లు హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ఉపసభాపతి గంట పాటు సభను నడిపించారు.
పలు అంశాలపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు యువ సభ్యులు స్పీకర్ పోడియం (టేబుల్) పైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ప్లకార్డులను మైకుల్లా తయారు చేసి వాటి ద్వారా అరవడం వంటి చర్యలకు దిగారు. 3 గంటలకు స్పీకర్ సుమిత్రామహాజన్ తిరిగి సభాపతి స్థానంలోకి వచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఖర్గే మాట్లాడబోతుండగా బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఖర్గే ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు రాజీనామాలకు పట్టుబడితే రాజీనామాలు చేశాకే చర్చ జరిపాం. ఇప్పుడు మీరూ దానికి కట్టుబడండి. మీరు (ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు) రాజీనామా చేశాకే చర్చకు రండి’ అని అన్నారు.
హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేస్తూ.. ‘మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రులు రాజీనామా చేయడానికి వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. సీవీసీ గానీ, లేదా ఇతర ఏ దర్యాప్తు సంస్థ అయినా వారిని తప్పుబట్టలేదు. మేం చర్చకు సిద్ధం’ అని చెప్పారు. దీంతో కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు.
కాగా, సస్పెన్షన్ ఉదంతం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా అన్నారు. మోదీ సర్కారు గుజరాత్ నమూనా ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలో అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత ఖర్గే మండిపడ్డారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంటు సమావేశాలను ఐదు రోజుల పాటు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతో పాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను కేంద్రం, అధికార బీజేపీ సమర్థించాయి.
సస్పెండైన సభ్యులు వీరే..
బి.ఎన్. చంద్రప్ప, సంతోఖ్ సింగ్ చౌదరి, అబూ ఖాన్ చౌదరి, సుష్మితాదేవ్,ధ్రువ్‌నారాయణ్, నైనంగ్ ఎరింగ్, గౌరవ్ గోగోయ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, దీపేందర్‌సింగ్ హుడా, కె.సురేష్, తోక్‌చోం మేన్యా, ఎస్.పి.ముద్దహనుమే గౌడ, అభిజిత్‌ముఖర్జీ, ముల్లపల్లి రామచంద్రన్, కె.హెచ్.మునియప్ప, బి.వి.నాయక్, విన్సెంట్‌పాలా, ఎం.కె.రాఘవన్, రంజీత్ రంజన్, సి.ఎల్.రౌలా, తామ్రద్వజ్ సాహు, రాజీవ్‌సాతవ్, రవ్‌నీత్ సింగ్, డి.కె.సురేష్, కె.సి.వేణుగోపాల్.
గతంలో సస్పెన్షన్లు ఇలా...
1989మార్చి 15: బోఫోర్స్ స్కాంపై ఆందోళనతో 63 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. 2012 ఏప్రిల్ 04: 8 మంది అధికార కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఆ ప్రాంత ఎంపీల ఆందోళనతో అధికార పార్టీ సొంత సభ్యులనే సస్పెండ్ చేసిన ఘటన ఇదే. 2013 ఆగస్టు 23: ఏపీ విభజనను వ్యతిరేకించిన 11మంది సీమాంధ్ర ఎంపీలను 5 రోజులు సస్పెండ్ చేశారు. 2013 సెప్టెంబర్ 2: సమైక్యాంధ్రప్రదేశ్ ఆందోళన వల్ల 9 మంది సస్పెండ్. 2014 ఫిబ్రవరి 13: తెలంగాణ బిల్లుపై ఇరు ప్రాంతాల సభ్యలు ఆందోళనతో 16 మంది సభ్యుల సస్పెన్షన్. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వినియోగించిన ఉదంతం అప్పుడు చోటు చేసుకుంది.