placards show
-
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్‌పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్‌లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడంతో బుధవారం లోక్‌సభలో ఇద్దరు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కేరళ కాంగ్రెస్(మణి) సభ్యుడు థామస్ చెళికాదన్, సీపీఎం సభ్యుడు ఎ.ఎం.అరీఫ్‌ను సభ నుంచి ఈ సెషన్లో మిగిలిన కాలమంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. లోక్‌సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు. -
#RCB: మాస్టర్ ప్లాన్.. ఆర్సీబీ పేరుతో అడ్డుపుల్ల!
ఐపీఎల్లో దురదృష్టమైన జట్టుగా పేరు పొందింది ఆర్సీబీ. కప్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగే ఆర్సీబీ లీగ్ దశ వరకు బాగానే ఆడుతున్నా ప్లేఆఫ్ దశలో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు. మూడుసార్లు ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ కనీసం ఈసారైనా టైటిల్ కొట్టాలని కోరుకుందాం. ఈ విషయం పక్కనబెడితే.. బుధవారం కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కు హాజరైన ఒక చిన్నారి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడం హైలెట్‌గా నిలిచింది. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా చిన్నారి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. ''వాళ్లు టైటిల్ కొట్టినా.. కొట్టకపోయినా డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది''.. ''ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం''.. ''ఆర్సీబీ కప్ గెలిస్తే ఓకే.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్ ఎగ్గొట్టడానికి ఆర్సీబీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేశావుగా'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో! Dear RCB, please win IPL for your fans ❤ pic.twitter.com/0PHQoyshQe — leisha (@katyxkohli17) April 26, 2023 -
కొయ్యలగూడెం రోడ్ షో లో చంద్రబాబుకు నిరసన సెగ
-
‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’
ఆ అక్షరాలు ఎంత పొదుపుగా ఉంటాయో అంతే పదునుగానూ ఉంటాయి. మనకున్న అభిప్రాయాన్ని ఒక్కోసారి సమర్థిస్తాయి మరోసారి మన లోపాల్ని సవరిస్తాయి. కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్టు సింపుల్‌గా ఉంటూనే మార్పు తెచ్చే ఆలోచనలకు శాంపిల్గానూ ఉంటాయి. ప్లకార్డు పట్టుకుని మన ఆలోచనల్ని చుట్టుకునే కుర్రాళ్ల సమూహమే తెలుగు డ్యూడ్. ఇందిరాపార్క్ దగ్గర ధర్నాల నుంచీ ఇంటర్నేషనల్ నిరసనల వరకూ ఎందెందు వెదికినా అందందే అనిపించే ప్లకార్డు సోషల్ మీడియాలో సిటీ యూత్‌కి ట్రెండీ స్టైల్ అవడమే విశేషం. సాక్షి, సిటీబ్యూరో :మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఏదైనా చేద్దామని ఎప్పుడూ అనుకునేవాళ్లం. అయితే ముగ్గురికీ కలిపి ఫ్రీటైమ్ దొరికింది లేదు. లాక్డౌన్ కారణంగా టైమ్ కలిసొచ్చింది. అదే ఈ తెలుగు డ్యూడ్కి రూట్ మ్యాప్ వేసింది’’అంటూ చెప్పాడు నవీన్. పబ్లిక్‌లో చిన్న చిన్న నినాదాలు, సందేశాలు రాసిన ప్లకార్డ్స్ పట్టుకుని నుంచుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ‘తెలుగు డ్యూడ్’పేరుతో ఫేమస్ అయిపోయారీ మిత్రబృందం. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వీరి మాటల్లోనే.. అక్షర ‘త్రయం’... మా తెలుగు డ్యూడ్ బృందంలో ముగ్గురు సభ్యులున్నాం. ఈ పేజ్‌కి ముఖ చిత్రం లాంటి నవీన్ కరీంనగర్ వాసి. పొలిటికల్ సైన్స్ విద్యార్ధి సివిల్స్‌కు ప్రిపేరవుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. భవిష్యత్తులో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కావాలనేది తన లక్ష్యం. ఇతనికి పూల చొక్కా పేరుతో మరొక మిమి పేజ్ కూడా ఉంది. మచిలీ పట్నంకు చెందిన నాని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రణీత్ ఈ నగరంలోనే పుట్టి పెరిగాడు. వీరు సినీ దర్శకులు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ప్రొఫెషనల్ లైఫ్స్ మొత్తం డిస్ట్రబ్ అయ్యాయి. మరోవైపు లాక్ డవున్ దెబ్బకి నవీన్ జుట్టు బాగా పెరిగిపోయింది. దీంతో అతను ‘క్యాస్ట్ మీ ఇన్ యువర్ ఫిలిమ్స్’ అంటూ ఓ వాట్సప్‌గ్రూప్‌లో తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోకి వచ్చిన రెస్పాన్స్ నుంచే ఒక ఐడియా వచ్చింది. మమ్మల్ని మేం వ్యక్తీకరించుకోవడానికి మాకో కొత్త మార్గం ఎంచుకోవాలనుకున్నాం. బహిరంగంగా ప్లకార్డ్స్ పట్టుకుని క్లిక్ మనిపించి మా ఆలోచనలను సోషల్ మీడియా వేదికలపై వెల్లడిస్తే... ఎలా ఉంటుంది? అనిపించింది. నిరసనల నుంచి ప్రచారం దాకా ఎప్పటి నుంచో వినియోగంలో ఉన్న ప్లకార్డ్స్ ప్రదర్శన... నిజానికి కొత్త ఐడియా కాదు. ఇదే తరహాలో డ్యూడ్ విత్ సైన్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్ బాగా పాపులర్. అదే మాకు ఒక రిఫరెన్స్ పాయింట్ అయింది. యువతకు, రోజువారీగా మన చుట్టూ జరుగుతున్న విశేషాలకు ప్రాధాన్యత నిస్తూ దీన్ని తెలుగులోకి తేవాలనుకున్నాం. మే 21న తొలి ప్లకార్డ్... నచ్చిన అక్షరాలు రాసి మే 20న షూట్ చేశాం. మరుసటి రోజే మా పేజ్ లాంచ్ చేశాం. మా ప్లకార్డ్స్ ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. మా తొలి పోస్ట్ ‘‘మూసుకుని మాస్క్ లు వేసుకోండి’’ ఇది బాగా హిట్టయింది. యూత్‌ని టార్గెట్ చేస్తూ ‘‘పెళ్లయ్యేవరకూ ఆగండి’’ అనేది కూడా బాగా స్పందన దక్కించుకుంది. ‘‘‘ హ్మ్ (Hmmm)’’అని రిప్లై ఇవ్వడం ఆపండి’’ కూడా బాగా ఆకట్టుకుంది. ఫాదర్స్ డే పోస్ట్ కూడా ఇన్స్టాంట్ హిట్ అయింది. మా పేజ్ కేవలం నెల రోజుల్లోనే 10వేల మంది ఫాలోయర్స్ దాటింది. మాలో నాని రాస్తాడు. నవీన్ ఫొటో పోజ్ ఇస్తాడు. ప్రణీత్ షూట్ చేస్తాడు. ఏదైతేనేం మొత్తానికి లాక్ డవున్ టైమ్‌లో చేయడానికి ఒక వినూత్నమైన పని మాకు దొరికింది. ఇది కూడా మిమిల తరహాలో ఇదీ ఒక భావ వ్యక్తీకరణే. అయితే మిమిల ద్వారా మనం కేవలం అందుబాటులో ఉన్న టెంప్లేట్స్‌ను వినియోగించుకుని మాత్రమే వ్యక్తీకరించాలి. అయితే ఇక్కడ మనం ప్లకార్డ్స్ ద్వారా అనుకున్నది ఏదైనా వ్యక్తీకరించగలం. వ్యంగ్యం, హాస్యం, విమర్శ, ప్రశంస...అన్నీ కలబోతగా అర్ధవంతంగా మా ప్లకార్డ్స్ ఉంటాయి. -
నిరసనలో నిరసన.. యువతికి పోలీసుల రక్షణ!
బెంగళూరు: ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన అమూల్యకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్ వేదిక శుక్రవారం నిరనస కార్యక్రమం చేపట్టింది. అయితే, అనూహ్యంగా ఓ యువతి ‘కశ్మీర్‌కు స్వేచ్ఛ కావాలి’, దళితులకు, ముస్లింలకు విముక్తి కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జాగరణ్ వేదిక కార్యకర్తలు యువతిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిరసనకారులు ఆమెను చుట్టుముడుతున్నక్రమంలో అప్రమత్తమైన పోలీసులు భద్రత నడుమ ఆమెను అక్కడ నుంచి తరలించారు. యువతిని అదుపులోకి తీసుకున్నామని, ఆమె నేపథ్యం తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని బెంగుళూరు పోలీస్ కమిషనర్ భాస్కరరావు తెలిపారు. (చదవండి : ‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ) ఇక బెంగుళూరు ఫ్రీడంపార్క్‌లో గురువారం జరిగిన పౌరసత్వ సవరణ చట్టం నిరసన కార్యక్రమంలో అమూల్య లియోన్ అనే యువతి ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. అమూల్యను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. -
స్పందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: తనకు న్యాయం చేయాలంటూ రాజ్ భవన్ వద్ద ఫ్లకార్డుతో ఓ మహిళ నిలబడటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం జగన్ సోమవారం రాజ్‌భవన్ వచ్చిన సందర్భంగా.... పద్మావతి అనే మహిళ తన సోదరి కుమారుడిని హత్యచేసిన వారిని శిక్షించాలంటూ ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు ప్రదర్శించింది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 21న తన చెల్లెలి కుమారుడు మనోజ్ హత్యకు గురయ్యాడని తెలిపారు. స్నేహితులే మనోజ్‌ని చంపేశారని అనుమానం వ్యక్తం చేశారు. గొంతుకోసి తలకాయపై మోది హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. కిరాయి మనుషులని కేసులో పెట్టి.. అసలు నిందితులను పోలీసులు వదిలేశారని అన్నారు. హత్య చేసిన వారి బంధువు ఎస్ఐ కావటంతో పోలీసు డిపార్ట్మెంట్ సాయం వల్ల కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాచకొండ సాయి కృష్ణతో పాటు అతని తల్లి కనకదుర్గ మరో ఇద్దరు మనోజ్‌ని హత్య చేశారని పద్మావతి తెలిపారు. కుటుంబ సభ్యులుగా తమ నుంచి పోలీసులు ఎటువంటి వివరాలు తీసుకోలేదన్నారు. హత్య చేసిన వారి గురించి సమాచారం ఇచ్చినా స్పందించలేదని చెప్పారు. అసలు నిందితులపై కేసు నమోదు చేయమంటే స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు చూపించాని పద్మావతి తెలిపారు. కాగా, దూరంలో ఉన్నా తనను సీఎం వైఎస్ జగన్ గమనించి స్పందించటం తనకు ఆనందంగా ఉందన్నారు. సీఎం దృష్టికి విషయం వెళ్లటంతో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని హతుని పెద్దమ్మ పద్మావతి తెలిపారు. స్పందించిన విజయవాడ డీసీపీ విక్రాంత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విజవాడ డీసీపీ విక్రాంత్ స్పందించి.. సెప్టెంబర్ 21న అరండల్‌పేటలో మనోజ్ అనే యువకుడి హత్య జరిగిందన్నారు. కాగా ఈ హత్యకేసుపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరిపై కేసు కూడా పెట్టామని ఆయన వెల్లడించారు. ఈ రోజు హతుడు మనోజ్ పెద్దమ్మ పద్మావతి సీఎం జగన్ కాన్వాయ్ ముందు న్యాయం కావాలని ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ ఈ కేసుపై విచారణ జరపాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలకు వెంటనే స్పందించిన డీపీపీ.. మనోజ్ కేసులో కుటుంబసభ్యుల అనుమానాలపై కూడా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. కుటంబ సభ్యులకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే సాక్ష్యాధారాలతో తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మనోజ్ హత్యకేసులో నిందితులను తప్చించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ పాత్రపై కూడా విచారణ జరిపిస్తామని డీసీపీ విక్రాంత్ పేర్కొన్నారు. -
లోక్‌సభ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తూ లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తనను పరిశీలించేందుకు రూల్స్ కమిటీతో సమావేశం అవుతానని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సభా కార్యకలాపాలకూ పలు పార్టీల ఎంపీలు ఆటంకం కలిగించారు. విపక్ష సభ్యులు వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఎంతకీ ఆందోళనలు నియంత్రణలోకి రాకపోవడంతో దీనిపై అఖిలపక్ష నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ నడుస్తున్న తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రూల్స్ కమిటీకి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ సభ్యులు సభలో నిబంధనలు, సభ్యుల ప్రవర్తన, సభా కార్యక్రమాలు జరగాల్సిన తీరుపై స్పీకర్‌కు సలహాలు, సూచనలు చేస్తారు. అవసరమైతే సభా నిబంధనలు, ప్రవర్తనా నియమావళిలో సవరణలు కూడా ప్రతిపాదిస్తారు. కాగా, ఈ ఆందోళనల నడుమనే లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. ఉభయసభల్లోనూ రఫేల్, కావేరీ డ్యాం వివాదాలపై కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీ ల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. కాగా, లోక్‌సభలో వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు, నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజెబిలిటీస్ (సవరణ) బిల్లులకు ఆమోదం లభించింది. దివ్యాంగుల బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. -
స్కూలు ఫీజులను నియంత్రించాలి
- ప్రభుత్వానికి హెచ్ఎస్పీఏ డిమాండ్ - సైబర్ టవర్స్ వద్ద మానవహారం... - ప్లకార్డుల ప్రదర్శన హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో తమిళనాడు, మహారాష్ట్రల తరహా నిబంధనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్గిపెట్టె నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎమ్మార్పీ ధరకు లభిస్తుంటే.. స్కూల్ ఫీజుల విషయంలో మాత్రం నిర్దిష్ట విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చెబుతున్న చదువుకు.. అమెరికాలో మాదిరిగా ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ వద్ద హెచ్ఎస్పీఏ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ పేరెంట్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతిని ధులు మాట్లాడుతూ స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించిన రూ. లక్షల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి విద్యా కోర్సుల మాదిరిగా స్కూల్ ఫీజులు నియంత్రించడానికి ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. గతేడాది హైదరాబాద్‌లో 12 స్కూళ్లలో తనిఖీలు చేసి అధికారులు రూపొం దించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జీఓ ఎంఎస్ నం 1 అమలయ్యే దాకా ఫీజులు పెంచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రీతేష్, అరవింద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మాతో కలసి రండి స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై 2008 నుంచి హెచ్ఎస్పీఏ ద్వారా పోరాడుతున్నాం. వేళ్లూనుకుపోయిన ఈ విధానానికి చరమగీతం పాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, సామాన్యులు కూడా మాతో కలసి రావాలి. - విక్రాంత్, హెచ్ఎస్పీఏ అధ్యక్షుడు విద్యతో వ్యాపారం.. ప్రతి ఏడాది ప్రైవేటు పాఠశాలల ఫీజులను విచ్చలవిడిగా యాజమాన్యాలు పెంచుతున్నాయి. సేవ పేరుతో పుట్టుకొస్తున్న పాఠశాలలు.. యథేచ్ఛగా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. - శివ మకుటం, హెచ్ఎస్పీఏ అధికార ప్రతినిధి -
25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
* సభకు అంతరాయం కలిగించినందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్య * సభకు అంతరాయం కలిగించినందుకు చర్య * కొనసాగిన విపక్ష సభ్యుల నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన * 25 మంది కాంగ్రెస్ సభ్యులను 5 రోజులు సస్పెండ్ చేస్తూ ప్రకటన * సస్పెండ్ అయిన సభ్యులకు 9 విపక్షాల సంఘీభావం.. * సభను బహిష్కరించాలని నిర్ణయం వివిధ వివాదాలు, కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. అయినా కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు. కాగా సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంట్ సమావేశాలను ఐదు రోజులు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతోపాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించాయి. సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వివాదాలు, స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలలను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు మొత్తం 44 మంది సభ్యులున్న విషయం విదితమే. లలిత్‌గేట్ వివాదంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్చౌహాన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. వామపక్షాలూ ఆందోళనలో పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు పట్టుకుని పోడియానికి కుడివైపు మౌనప్రదర్శన చేశారు. నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు నడిపారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదువుతూ ప్లకార్డులు తీసేయాలని, తమ స్థానాల్లో కూర్చోవాలని.. లేదంటే కఠిన నిర్ణయం తప్పదని పలుమార్లు హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ఉపసభాపతి గంట పాటు సభను నడిపించారు. పలు అంశాలపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు యువ సభ్యులు స్పీకర్ పోడియం (టేబుల్) పైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ప్లకార్డులను మైకుల్లా తయారు చేసి వాటి ద్వారా అరవడం వంటి చర్యలకు దిగారు. 3 గంటలకు స్పీకర్ సుమిత్రామహాజన్ తిరిగి సభాపతి స్థానంలోకి వచ్చారు. కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియంపై చేతులతో చరుస్తూ నినాదాలు చేస్తుండటంతో.. ‘‘కఠిన చర్యలు తీసుకునేలా నన్ను ప్రేరేపించవద్దు’’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఖర్గే మాట్లాడబోతుండగా బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఖర్గే ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు రాజీనామాలకు పట్టుబడితే రాజీనామాలు చేశాకే చర్చ జరిపాం. ఇప్పుడు మీరూ దానికి కట్టుబడండి. మీరు (ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు) రాజీనామా చేశాకే చర్చకు రండి’ అని అన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేస్తూ.. ‘మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రులు రాజీనామా చేయడానికి వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సీవీసీ గానీ, లేదా ఇతర ఏ దర్యాప్తు సంస్థ అయినా వారిని తప్పుబట్టలేదు. మేం చర్చకు సిద్ధం’ అని చెప్పారు. దీంతో కాంగ్రెస్, ఇతర పక్షాల సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వినిపిస్తూ.. వారు ఉద్దేశపూర్వకంగా, నిరంతరాయంగా సభను అడ్డుకుంటున్నారని.. వారిపై 374 (ఎ) నిబంధన కింద ఐదు రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తున్నానని ప్రకటించారు. వారు సభను వీడి వెళ్లాలని చెప్తుండగానే.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేశారు. కాగా, సస్పెన్షన్ ఉదంతం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా అన్నారు. మోదీ సర్కారు గుజరాత్ నమూనా ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలో అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత ఖర్గే మండిపడ్డారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులకు సంఘీభావంగా పార్లమెంటు సమావేశాలను ఐదు రోజుల పాటు బహిష్కరించాలని కాంగ్రెస్ మిగతా సభ్యులతో పాటు టీఎంసీ, ఆప్, జేడీయూ సహా తొమ్మిది పార్టీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను కేంద్రం, అధికార బీజేపీ సమర్థించాయి. సస్పెండైన సభ్యులు వీరే.. బి.ఎన్. చంద్రప్ప, సంతోఖ్ సింగ్ చౌదరి, అబూ ఖాన్ చౌదరి, సుష్మితాదేవ్,ధ్రువ్నారాయణ్, నైనంగ్ ఎరింగ్, గౌరవ్ గోగోయ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, దీపేందర్‌సింగ్ హుడా, కె.సురేష్, తోక్చోం మేన్యా, ఎస్.పి.ముద్దహనుమే గౌడ, అభిజిత్ముఖర్జీ, ముల్లపల్లి రామచంద్రన్, కె.హెచ్.మునియప్ప, బి.వి.నాయక్, విన్సెంట్‌పాలా, ఎం.కె.రాఘవన్, రంజీత్ రంజన్, సి.ఎల్.రౌలా, తామ్రద్వజ్ సాహు, రాజీవ్సాతవ్, రవ్నీత్ సింగ్, డి.కె.సురేష్, కె.సి.వేణుగోపాల్. గతంలో సస్పెన్షన్లు ఇలా... 1989మార్చి 15: బోఫోర్స్ స్కాంపై ఆందోళనతో 63 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. 2012 ఏప్రిల్ 04: 8 మంది అధికార కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఆ ప్రాంత ఎంపీల ఆందోళనతో అధికార పార్టీ సొంత సభ్యులనే సస్పెండ్ చేసిన ఘటన ఇదే. 2013 ఆగస్టు 23: ఏపీ విభజనను వ్యతిరేకించిన 11మంది సీమాంధ్ర ఎంపీలను 5 రోజులు సస్పెండ్ చేశారు. 2013 సెప్టెంబర్ 2: సమైక్యాంధ్రప్రదేశ్ ఆందోళన వల్ల 9 మంది సస్పెండ్. 2014 ఫిబ్రవరి 13: తెలంగాణ బిల్లుపై ఇరు ప్రాంతాల సభ్యలు ఆందోళనతో 16 మంది సభ్యుల సస్పెన్షన్. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వినియోగించిన ఉదంతం అప్పుడు చోటు చేసుకుంది.