ఆ అక్షరాలు ఎంత పొదుపుగా ఉంటాయో అంతే పదునుగానూ ఉంటాయి. మనకున్న అభిప్రాయాన్ని ఒక్కోసారి సమర్థిస్తాయి మరోసారి మన లోపాల్ని సవరిస్తాయి. కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్టు సింపుల్‌గా ఉంటూనే మార్పు తెచ్చే ఆలోచనలకు శాంపిల్‌గానూ ఉంటాయి. ప్లకార్డు పట్టుకుని మన ఆలోచనల్ని చుట్టుకునే కుర్రాళ్ల సమూహమే తెలుగు డ్యూడ్. ఇందిరాపార్క్ దగ్గర ధర్నాల నుంచీ ఇంటర్నేషనల్ నిరసనల వరకూ ఎందెందు వెదికినా అందందే అనిపించే ప్లకార్డు సోషల్ మీడియాలో సిటీ యూత్‌కి ట్రెండీ స్టైల్ అవడమే విశేషం.
సాక్షి, సిటీబ్యూరో :మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఏదైనా చేద్దామని ఎప్పుడూ అనుకునేవాళ్లం. అయితే ముగ్గురికీ కలిపి ఫ్రీటైమ్ దొరికింది లేదు. లాక్‌డౌన్ కారణంగా టైమ్ కలిసొచ్చింది. అదే ఈ తెలుగు డ్యూడ్‌కి రూట్ మ్యాప్ వేసింది’’అంటూ చెప్పాడు నవీన్. పబ్లిక్‌లో చిన్న చిన్న నినాదాలు, సందేశాలు రాసిన ప్లకార్డ్స్ పట్టుకుని నుంచుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ‘తెలుగు డ్యూడ్’పేరుతో ఫేమస్ అయిపోయారీ మిత్రబృందం. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వీరి మాటల్లోనే..
అక్షర ‘త్రయం’...
మా తెలుగు డ్యూడ్ బృందంలో ముగ్గురు సభ్యులున్నాం. ఈ పేజ్‌కి ముఖ చిత్రం లాంటి నవీన్ కరీంనగర్ వాసి. పొలిటికల్ సైన్స్ విద్యార్ధి సివిల్స్‌కు ప్రిపేరవుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. భవిష్యత్తులో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కావాలనేది తన లక్ష్యం. ఇతనికి పూల చొక్కా పేరుతో మరొక మిమి పేజ్ కూడా ఉంది. మచిలీ పట్నంకు చెందిన నాని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రణీత్ ఈ నగరంలోనే పుట్టి పెరిగాడు. వీరు సినీ దర్శకులు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ప్రొఫెషనల్ లైఫ్స్ మొత్తం డిస్ట్రబ్ అయ్యాయి. మరోవైపు లాక్ డవున్ దెబ్బకి నవీన్ జుట్టు బాగా పెరిగిపోయింది.
దీంతో అతను ‘క్యాస్ట్ మీ ఇన్ యువర్ ఫిలిమ్స్’ అంటూ ఓ వాట్సప్‌గ్రూప్‌లో తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోకి వచ్చిన రెస్పాన్స్ నుంచే ఒక ఐడియా వచ్చింది. మమ్మల్ని మేం వ్యక్తీకరించుకోవడానికి మాకో కొత్త మార్గం ఎంచుకోవాలనుకున్నాం. బహిరంగంగా ప్లకార్డ్స్ పట్టుకుని క్లిక్ మనిపించి మా ఆలోచనలను సోషల్ మీడియా వేదికలపై వెల్లడిస్తే... ఎలా ఉంటుంది? అనిపించింది. నిరసనల నుంచి ప్రచారం దాకా ఎప్పటి నుంచో వినియోగంలో ఉన్న ప్లకార్డ్స్ ప్రదర్శన... నిజానికి కొత్త ఐడియా కాదు. ఇదే తరహాలో డ్యూడ్ విత్ సైన్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్ బాగా పాపులర్. అదే మాకు ఒక రిఫరెన్స్ పాయింట్ అయింది. యువతకు, రోజువారీగా మన చుట్టూ జరుగుతున్న విశేషాలకు ప్రాధాన్యత నిస్తూ దీన్ని తెలుగులోకి తేవాలనుకున్నాం.
మే 21న తొలి ప్లకార్డ్...
నచ్చిన అక్షరాలు రాసి మే 20న షూట్ చేశాం. మరుసటి రోజే మా పేజ్ లాంచ్ చేశాం. మా ప్లకార్డ్స్ ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. మా తొలి పోస్ట్ ‘‘మూసుకుని మాస్క్ లు వేసుకోండి’’ ఇది బాగా హిట్టయింది. యూత్‌ని టార్గెట్ చేస్తూ ‘‘పెళ్లయ్యేవరకూ ఆగండి’’ అనేది కూడా బాగా స్పందన దక్కించుకుంది. ‘‘‘ హ్మ్ (Hmmm)’’అని రిప్‌లై ఇవ్వడం ఆపండి’’ కూడా బాగా ఆకట్టుకుంది. ఫాదర్స్ డే పోస్ట్ కూడా ఇన్‌స్టాంట్ హిట్ అయింది. మా పేజ్ కేవలం నెల రోజుల్లోనే 10వేల మంది ఫాలోయర్స్ దాటింది. మాలో నాని రాస్తాడు. నవీన్ ఫొటో పోజ్ ఇస్తాడు. ప్రణీత్ షూట్ చేస్తాడు. ఏదైతేనేం మొత్తానికి లాక్ డవున్ టైమ్‌లో చేయడానికి ఒక వినూత్నమైన పని మాకు దొరికింది. ఇది కూడా మిమిల తరహాలో ఇదీ ఒక భావ వ్యక్తీకరణే. అయితే మిమిల ద్వారా మనం కేవలం అందుబాటులో ఉన్న టెంప్లేట్స్‌ను వినియోగించుకుని మాత్రమే వ్యక్తీకరించాలి. అయితే ఇక్కడ మనం ప్లకార్డ్స్ ద్వారా అనుకున్నది ఏదైనా వ్యక్తీకరించగలం. వ్యంగ్యం, హాస్యం, విమర్శ, ప్రశంస...అన్నీ కలబోతగా అర్ధవంతంగా మా ప్లకార్డ్స్ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment